VK-MSD: ఆ సమయంలో ధోనీ చేసిన మెసేజ్‌ నాకు బలంగా తాకింది: విరాట్

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న విరాట్ కోహ్లీ ఓ రెండు నెలల ముందు వరకు ఫామ్‌తో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే అవాంతరాలను దాటుకొని మరీ ఆసియా కప్‌తోపాటు ఈ మెగా టోర్నీలో దంచికొట్టేస్తున్నాడు.

Updated : 07 Nov 2022 12:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యువ క్రికెటర్లకు స్ఫూర్తిమంతంగా నిలిచిన టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ.. కష్టాల్లో ఉన్న సహచరులకు ధైర్యం చెప్పడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడని అభిమానులకు తెలిసిన విషయమే. దానికి ప్రత్యక్ష ఉదాహరణ విరాట్ కోహ్లీ ఉదంతమే. గత ఏడాది టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత స్పందించిన ఏకైక వ్యక్తి ధోనీ అని విరాట్ చెప్పాడు కదా.. తాజాగా ధోనీ గురించి మరో విషయం కూడా విరాట్ బయటపెట్టాడు. ఫామ్‌ కోల్పోయి (శతకాలను చేయలేదంతే) ఇబ్బంది పడిన సందర్భంలో చాలా మంది సలహాలు ఇచ్చారని.. అయితే ధోనీ మాత్రమే ప్రత్యేకంగా సందేశం పెట్టాడని గుర్తు చేసుకొన్నాడు. అది తన మనసుకు బాగా తాకిందని చెప్పాడు.

‘‘క్లిష్ట సమయాల్లో నాకు బాసటగా నిలిచిన వ్యక్తి ఎంఎస్ ధోనీ. అది నాకు కచ్చితంగా ఆశీర్వాదం లాంటిదే. నాకు సీనియర్‌ అయిన ధోనీతో ఇలాంటి బలమైన బంధం, స్నేహం కలిగి ఉండటం ఎప్పటికీ మరువలేను. ఇక ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ధోనీ పంపిన సందేశం నా మనసును తాకింది. అందులో ఉన్న విషయం తెలిసిందే అయినా చెప్పిన విధానం నచ్చింది. ‘నువ్వు బలంగా ఉండాలని అనుకున్నప్పుడు.. దృఢమైన వ్యక్తిగా కన్పిస్తున్నప్పుడు.. నువ్వు ఎలా ఆడుతున్నావ్‌? అని అడగటం ప్రజలు మర్చిపోతారు’ అని ధోనీ చెప్పాడు. ఇదే నన్ను బలంగా తాకింది. ఎందుకంటే ఎప్పుడూ నన్ను ఆత్మవిశ్వాసంతో, మానసికంగా బలంగా ఉండే వాడిగా.. ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి రాణించేవాడిగానే చూసేవారు. అయితే జీవితంలో ఏదొక సమయంలో ఓ రెండు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి తప్పదని గ్రహించాల్సి ఉంటుంది. అలాగే ఉన్నతంగా రాణించేందుకు ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది’’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 246 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉండటం విశేషం. పాకిస్థాన్‌పై 82* పరుగులతో అదరగొట్టే ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ భారత్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు