Rahul Dravid: లఖ్‌నవూ మెంటార్‌గా ద్రవిడ్‌? టీమ్‌ఇండియా కోచ్‌గా లక్ష్మణ్‌!

టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది. అతడు తిరిగి కోచ్‌గా కొనసాగకపోతే ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించే అవకాశముంది. 

Published : 25 Nov 2023 21:30 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌తో టీమ్‌ఇండియా (Team India) ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పదవీ కాలం ముగిసింది. ద్రవిడ్‌ సరేనంటే బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశముంది. కానీ,  అతడు ఈ పదవిలో కొనసాగేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్ తిరిగి కేకేఆర్‌ గూటికి చేరుకున్నాడు. దీంతో గంభీర్‌ స్థానంలో ద్రవిడ్‌ను మెంటార్‌గా నియమించుకునేందుకు లఖ్‌నవూ యాజమాన్యం ఆసక్తి చూపుతునట్లు సమాచారం. ద్రవిడ్‌కి టీమ్‌ఇండియా కోచ్‌గా కొనసాగే ఉద్దేశం లేకపోవడంతో ఎల్‌ఎస్‌జీకి మెంటార్‌గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కోచ్‌, భారత జట్టు భవిష్యత్‌పై కెప్టెన్‌ రోహిత్‌, కోచ్ ద్రవిడ్, చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో బీసీసీఐ డిసెంబరు 2 లేదా 3న సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతాడా లేదా తేలనుంది. కోచ్‌గా ద్రవిడ్ కొనసాగకపోతే నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman)ను ఆ స్థానంలో నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. జూనియర్లు అధికంగా ఉన్న జట్టుతో లక్ష్మణ్‌ పలు పర్యటనలకు వెళ్లిన విషయం తెలిసిందే. 


చైనా మాస్టర్స్‌ ఫైనల్లో అడుగుపెట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ

చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్లో చైనా ద్వయం జి టింగ్, రెన్ జియాంగ్ యు పై 21-15, 22-20 తేడాతో విజయం సాధించింది. 50 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో భారత జోడీ సునాయాసంగా గెలుపొందింది. రెండో గేమ్‌లో మాత్రం చైనా ద్వయం నుంచి గట్టిపోటీ ఎదురైంది. రెండో గేమ్‌ విరామ సమయానికి సాత్విక్, చిరాగ్ జోడీ 8-11తో వెనకబడింది. కోచ్‌ గోపీచంద్‌ భారత ద్వయంతో మాట్లాడిన అనంతరం ఈ జోడీ పుంజుకుని 14-14తో నిలిచింది. చివర్లో చైనా జోడీ జోరు తగ్గడంతో గేమ్‌ భారత్ వశమైంది. నవంబర్ 26న (ఆదివారం) ఫైనల్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని