Ravindra Jadeja: టీమ్‌ఇండియాకు షాక్‌.. రెండో టెస్టుకు జడేజా అనుమానమే?

Ravindra Jadeja: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ జడేజా రెండో టెస్టులో ఆడటం అనుమానంగానే కన్పిస్తోంది. తొలి టెస్టులో అతడి తొడ కండరాలు పట్టేశాయి.

Updated : 29 Jan 2024 12:37 IST

హైదరాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు (IND vs ENG) ఓటమితో షాక్‌లో ఉన్న టీమ్‌ఇండియా (Team India)కు మరో ఎదురుదెబ్బ తగిలేట్లుంది..! ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో రెండో టెస్టుకు అతడు ఆడటం కష్టమనే ప్రచారం జరుగుతోంది.

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అనవసరంగా పరుగు కోసం యత్నించి జడ్డూ రనౌట్‌ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వేగంగా పరిగెత్తడంతో అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఇబ్బందిపడుతూనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం అతడికి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ అనంతరం హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇంకా ఫిజియోను సంప్రదించలేదు. ఇప్పుడే అతడి పరిస్థితి గురించి ఏమీ చెప్పలేం’’ అని అన్నాడు.

జడ్డూ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ఎలాంటి చీలిక లేకుండా కేవలం కండరాలు పట్టేసినా వైద్యులు అతడికి కనీసం వారం పాటు విశ్రాంతి సూచించే అవకాశాలున్నాయి. అయితే, మరో నాలుగు రోజుల్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా?అనేది అనుమానంగానే కన్పిస్తోంది. జట్టుతో కలిసి జడేజా వైజాగ్‌ వెళ్తాడా లేదా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి పంపిస్తారా? అన్నదానిపై బీసీసీఐ నేడు స్పష్టతనిచ్చే అవకాశముంది.

చివరికి బజ్‌బాలే

రెండో ఇన్నింగ్స్‌లో బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో జడ్డూను రనౌట్‌ చేయడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. వైజాగ్‌ టెస్టుకు అతడు దూరమవడం టీమ్‌ఇండియాకు ప్రతికూలాంశమే. ఈ ఆల్‌రౌండర్‌ తొలి టెస్టులో 87 పరుగులతో భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు సాధించాడు.

ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో మరో రోజు మిగిలి ఉండగానే అనూహ్యంగా భారత్‌ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్‌ స్పిన్‌కు కుదేలైన రోహిత్‌ సేన.. ఉప్పల్‌లో టెస్టుల్లో అజేయ రికార్డును చేజేతులా కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని