Team India: ఎనిమిది ఫైనల్స్‌.. ఏడు టైటిల్స్‌.. వీరే కెప్టెన్స్..!

మహిళల ఆసియా కప్ చరిత్రలో టీమ్ఇండియాది సువర్ణాధ్యాయం. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు టోర్నీలు జరగగా.. ఏడు టైటిళ్లను భారత్‌ గెలుచుకోవడం అద్భుతం. తొలి ఆసియా కప్‌ నుంచి తాజాగా జరిగిన టోర్నీ వరకు ఏ కెప్టెన్ సారథ్యంలో భారత్‌ సొంతం చేసుకుందో తెలుసుకుందాం.. 

Published : 16 Oct 2022 01:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. ఆసియాకప్‌లో చరిత్ర సృష్టించారు. ఏడో టైటిల్‌ను సాధించారు. 2004లో రెండు జట్లతో ప్రారంభమైన మహిళల ఆసియాకప్‌లో తాజాగా ఏడు దేశాల జట్లు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు టోర్నమెంట్‌ జరిగింది. అంతేకాకుండా ఫైనల్‌లో భారత్‌కు ఐదు సార్లు శ్రీలంక ప్రత్యర్థి కావడం గమనార్హం. తాజాగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలో భారత్‌ గెలిచింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సారథ్యంలో అత్యధికంగా నాలుగు టైటిళ్లను అందుకోవడం ఒక రికార్డే.

  • తొలి కప్‌ ‘మమత’ (2004): శ్రీలంక వేదికగా మహిళల కోసం 18 ఏళ్ల కిందట రెండు జట్లతో ఆసియా కప్‌ ప్రారంభమైంది. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆ టోర్నీ తొలి టైటిల్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. కెప్టెన్‌గా మమతా మబెన్ వ్యవహరించింది. భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు నిర్వహించగా.. 5-0 తేడాతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో మొదటి టైటిల్‌ భారత్ వశమైంది.
  • మిథాలీ సారథ్యంలోనే..(2005/06): ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ మొదటిసారిగా 2005లో ఆసియా కప్‌ టైటిల్‌ను అందుకొంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండో కప్‌ను ఖాతాలో వేసుకొంది. అయితే ఈసారి భారత్‌-లంక కాకుండా మూడో జట్టు వచ్చి చేరింది. అదే దాయాది దేశం పాకిస్థాన్‌. 2005 ఆసియా కప్‌ను అక్కడే నిర్వహించారు. మూడు టీమ్‌లు కలిసి లీగ్‌ స్టేజ్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. అలాగే 2006లో జరిగిన కప్‌నూ మిథాలీరాజ్‌ కెప్టెన్సీలోనే భారత్‌ గెలుచుకొంది. రెండుసార్లూ లంకనే ప్రత్యర్థి. వేదిక భారత్‌ కావడవం విశేషం.
  • నాలుగుకు పెరిగినా.. (2008): ఈసారి టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్ల సంఖ్య 4కి చేరింది. కొత్తగా బంగ్లాదేశ్‌ టీమ్‌ వచ్చింది. గ్రూప్‌లో భారత్‌, శ్రీలంక జట్లు టాపర్లుగా నిలిచి ఫైనల్‌కు చేరుకొన్నాయి. టీమ్‌ఇండియా ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. లంక నాలుగు గెలిచి.. రెండింట్లో ఓడింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కేవలం ఒక్కో విజయంతోనే సరిపెట్టుకొన్నాయి. తుదిపోరులోనూ లంకను కెప్టెన్‌ మిథాలీరాజ్‌ నాయకత్వంలోని భారత్‌ చిత్తు చేసింది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. 
  • ఎనిమిది జట్లు (2012): అంతకుముందు జరిగిన ఆసియా కప్‌ పోటీలకు 2012 ఆసియా కప్‌ టోర్నీకి నాలుగేళ్ల వ్యవధి ఉండటం గమనార్హం. అయితే ఈ సారి ఏకంగా ఎనిమిది జట్లు తలపడ్డాయి. తొలిసారిగా టీ20 ఫార్మాట్‌ను ప్రవేశపెట్టారు. మొదటిసారి చైనా ఆతిథ్యం ఇవ్వడంతోపాటు పాల్గొంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయిన జట్లు.. నాకౌట్‌ దశకు మాత్రం నాలుగే చేరాయి. భారత్‌-శ్రీలంక ఈసారి సెమీస్‌లోనే ఢీకొట్టుకోగా.. బంగ్లాదేశ్‌-పాకిస్థాన్‌ మొదటిసారి సెమీఫైనల్‌కు వచ్చాయి. అయితే ఫైనల్‌కు టీమ్‌ఇండియా-పాక్‌ చేరుకోగా.. టైటిల్‌ను భారత్‌ సొంతం చేసుకొంది. ఈ జట్టుకు మిథాలీ రాజ్‌ సారథ్యం వహించగా.. హర్మన్‌ డిప్యూటీగా వ్యవహరించింది. 
  • మళ్లీ పాక్‌నే ప్రత్యర్థి (2016): భారత్‌కు వరుసగా రెండోసారి ఫైనల్‌లో పాకిస్థాన్‌ ప్రత్యర్థిగా తలపడింది. అయితే ఈసారి మాత్రం ఆరు జట్లతోనే ఆసియా కప్‌ జరిగింది. హాంకాంగ్‌, చైనా పాల్గొనలేదు. థాయ్‌లాండ్‌ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో ఆరు జట్లూ మిగతా టీమ్‌లతో రెండేసి మ్యాచ్‌లను ఆడాయి. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు వచ్చాయి. అలా భారత్‌-పాక్ మరోసారి తలపడగా.. టీమ్‌ఇండియానే విజయం సాధించి కప్‌ను ఖాతాలో వేసుకొంది. తొలిసారి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గెలిచిన టైటిల్‌. 
  • ఇప్పుడు శ్రీలంకపైనే (2022): హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత్‌  2018 ఆసియా కప్‌ ఫైనల్‌లో చివరి వరకు పోరాడినా ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్‌ 2022లో కసిగా దిగిన టీమ్‌ఇండియా ఆద్యంతం దూకుడుగానే ఆడింది. ఒక్క మ్యాచ్‌ మినహా అన్నింట్లోనూ విజయం సాధించి టైటిల్‌ను పట్టేసింది. ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌గా దీప్తి శర్మ.. ఫైనల్‌లో ప్లేయర్ ది మ్యాచ్‌ అవార్డును రేణుకా సింగ్‌ అందుకొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని