BCCI: ఆరేళ్ల తర్వాత.. దేశవాళీలోనూ మహిళలకు రెడ్‌బాల్ టోర్నీ

మహిళా క్రికెట్‌లోనూ బీసీసీఐ (BCCI) వినూత్న మార్పులు తీసుకొస్తోంది. వారికి కూడా దేశవాళీ క్రికెట్‌లో రెడ్‌బాల్‌ మ్యాచ్‌లను నిర్వహించనుంది.

Published : 01 Mar 2024 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశవాళీ క్రికెట్‌పై దృష్టిసారించిన బీసీసీఐ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకూ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పుణె వేదికగా మార్చి 28 నుంచి ఏప్రిల్  11 వరకు సీనియర్‌ మహిళల ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఒక్కో మ్యాచ్‌ మూడు రోజులపాటు జరగనుంది. చివరిసారిగా 2018లో రెండు రోజుల మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించింది. 

గతేడాది టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లతో ఏకైక టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అంతకుముందు 2021లోనూ ఆ దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో తలపడింది. రాబోయే కాలంలోనూ మరిన్ని టెస్టులను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పుడు డొమిస్టిక్‌ క్రికెట్‌లోనూ ప్రాక్టీస్‌ కోసం రెడ్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం మహిళా క్రికెటర్లు డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉన్నారు. ఇది మార్చి 17తో ముగుస్తోంది. మరో పది రోజుల తర్వాత ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్‌ మొదలుకానుంది. 

ఆ రెండు నేరుగా సెమీస్‌కు.. 

ఈ టోర్నీకి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈస్ట్‌ జోన్ X నార్త్‌ ఈస్ట్‌ జోన్, వెస్ట్‌ జోన్ X సెంట్రల్‌ జోన్‌ల మధ్య లీగ్‌ స్టేజ్‌లో మ్యాచులు జరుగుతాయి. మొత్తం 14 రోజులపాటు నిర్వహించనున్న ఈ టోర్నీలో నార్త్‌ జోన్‌, సౌత్ జోన్‌ నేరుగా సెమీస్‌లోనే ఆడతాయి. లీగ్‌ స్టేజ్‌లో గెలిచిన రెండు జట్లతో అవి సెమీ ఫైనల్‌లో తలపడతాయి. సెమీస్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 3న జరుగుతాయి. ఏప్రిల్ 9న ఫైనల్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని