ODI World Cup: భారత్ వద్ద వన్డే ప్రపంచకప్‌ను అందించే ఆటగాళ్లున్నారు: మహ్మద్‌ కైఫ్‌

వన్డే ప్రపంచకప్ స్వదేశంలో జరగడటం టీమ్‌ఇండియా (Team India)కు కలిసొస్తుందని, బ్యాటింగ్‌ విభాగం రాణిస్తే భారత్‌ను ఓడించడం ఏ జట్టుకైనా కష్టమేనని టీమ్‌ఇండియా మాజీ వికెట్ కీపర్‌ మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు. 

Published : 08 Jul 2023 18:59 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)ను అందించే ఆటగాళ్లు భారత్‌ వద్ద ఉన్నారని టీమ్‌ఇండియా (Team India) మాజీ వికెట్ కీపర్‌ మహ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif)  అన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మధ్య భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, స్వదేశంలో ఆడటం కూడా కలిసొస్తుందని చెప్పాడు. అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌ మహాసమరానికి తెరలేవనుంది. ఆస్ట్రేలియాతో (అక్టోబర్‌ 8) భారత్ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

‘‘ఈ ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్వదేశంలో ఆడటం మనకు కలిసొస్తుంది. ఇతర జట్లతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు మనకే బాగా తెలుసు. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. ట్రోఫీని అందించే ఆటగాళ్లు భారత్‌ వద్ద ఉన్నారు. సీనియర్‌ ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ పరంగా, ఫామ్‌లో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. నాకైతే బౌలింగ్‌ విభాగం ఫర్వాలేదనిపిస్తోంది. బ్యాటింగ్‌ విభాగం రాణిస్తే టీమ్‌ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే. సీనియర్‌ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలకడను ప్రదర్శించి మ్యాచ్‌లను గెలిపించాలి. 

వెన్ను నొప్పి కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా ఆసియా కప్‌తో మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇది టీమ్‌ఇండియాకు శుభవార్త. భారత్‌కు బుమ్రా అవసరం.  అతడు జట్టులో చేరుతాడని, ఆ తర్వాత స్వదేశంలో భారత్‌ను ఓడించడం చాలా కష్టమని భావిస్తున్నా. సిరాజ్, షమీ ఇటీవల బాగా బౌలింగ్ చేస్తున్నారు. బుమ్రా కూడా జట్టులోకి వస్తే బౌలింగ్ దళం పటిష్టంగా మారుతుంది’’ అని మహ్మద్‌ కైఫ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు