UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్‌ ఊగేలా... ప్రపంచకప్‌కు సిద్ధమవుతోన్న స్టేడియం

వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) సొబుగులు ఆ స్టేడియానికి వచ్చేశాయి. అక్కడ భారత మ్యాచ్‌లు లేవు.. అయినా టికెట్లకూ విపరీతమైన డిమాండ్ నెలకొందంటే తెలుగు అభిమానులకు క్రికెట్‌ పట్ల ఉన్న ప్రేమ ఏంతనేది అర్థమైపోతుంది. 

Updated : 24 Sep 2023 15:30 IST

బాబర్‌ అజామ్‌ కళాత్మక బ్యాటింగ్‌.. షహీన్‌ షా అఫ్రిది ప్రమాదకర బౌలింగ్‌! బ్యాట్‌తో అదరగొట్టే డెవాన్‌ కాన్వే, గ్లెన్‌ ఫిలిప్స్‌.. బంతితో చెలరేగే బౌల్ట్‌.. కుదిరితే కేన్‌ మామ ఆట! స్మిత్, వార్నర్‌ మెరుపులు.. మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, గ్రీన్‌ ఆల్‌రౌండ్‌ విన్యాసాలు.. కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్‌ బుల్లెట్‌ బంతులు! పరుగుల వేటలో సాగే కుశాల్‌ మెండిస్, నిశాంక, శానక.. బంతిని గింగిరాలు తిప్పే దునిత్, హసరంగ (గాయం నుంచి కోలుకుంటే)! ఇప్పుడు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఆటగాళ్ల ప్రస్తావన ఒక దగ్గరే ఎందుకని అనుకుంటున్నారా? వీళ్లు వేర్వేరు జట్ల ఆటగాళ్లే కానీ.. ఉప్పల్‌ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌ 5న ఆరంభమయ్యే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇక్కడ తమ జట్ల తరపున ఈ ఆటగాళ్లు బరిలో దిగబోతున్నారు. హైదరాబాద్‌లో మూడు ప్రపంచకప్‌ ప్రధాన మ్యాచ్‌లతో పాటు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఉప్పల్‌ స్టేడియం సిద్ధమవుతోంది. 

ఆ నిరాశను దాటేలా..

ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులు నిరుత్సాహపడ్డారు. రెండు వార్మప్‌ సహా ఉప్పల్‌ స్టేడియానికి బీసీసీఐ అయిదు మ్యాచ్‌లు కేటాయించింది. కానీ ఇందులో ఒక్కటి కూడా టీమ్‌ఇండియా మ్యాచ్‌ లేకపోవడం నిరాశ కలిగించింది.  కానీ ఆ లోటును తీర్చేలా.. అభిమానులకు అత్యుత్తమ క్రికెట్‌ అనుభూతిని అందించేందుకు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబవుతోంది. మొట్టమొదటి సారి ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సిద్ధమవుతోంది. ఓవరాల్‌గా హైదరాబాద్‌లో 27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగనుంది. చివరగా ఎల్బీ స్టేడియంలో 1996 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్‌ జరిగింది. 

మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

ఇప్పుడు ప్రపంచకప్‌ నేపథ్యంలో మూడు ప్రధాన మ్యాచ్‌లతో పాటు అంతకంటే ముందు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఈ వేదికలో పాకిస్థాన్‌ అత్యధికంగా నాలుగు మ్యాచ్‌లాడనుంది. నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌ రెండేసి చొప్పున మ్యాచ్‌లాడతాయి. ఈ నెల 29న పాకిస్థాన్, న్యూజిలాండ్‌ మధ్య ఇక్కడ మొదటి వార్మప్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అక్టోబర్‌ 3న ఉప్పల్‌లో జరిగే రెండో వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్‌ ఢీ కొడుతుంది. అసలైన ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో.. అక్టోబర్‌ 6న నెదర్లాండ్స్‌తో పాకిస్థాన్, అక్టోబర్‌ 9న నెదర్లాండ్స్‌తో న్యూజిలాండ్, అక్టోబర్‌ 10న శ్రీలంకతో పాకిస్థాన్‌ తలపడతాయి. 

సరికొత్త హంగులతో..

2006 నుంచి ఇప్పటివరకూ ఉప్పల్‌ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్లో 5 టెస్టులు, 7 వన్డేలు, 3 టీ20లు జరిగాయి. గతంలో ఓ వైపు పైకప్పు మధ్యలో కొంచెం ఎగిరిపోయి, కుర్చీలు అక్కడక్కడా విరిగిపోయి, తాగునీటి ఇబ్బంది తదితర సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం ఉప్పల్‌ స్టేడియాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సరికొత్తగా ముస్తాబు చేస్తోంది. స్టేడియం ఆధునీకీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దక్షిణం వైపు గతంలో భారీ వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో ఇప్పుడు కొత్తదాన్ని బిగించారు. తూర్పు పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేశారు. 39 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంలో ప్రపంచకప్‌ వరకు 12 వేల వరకు కొత్త కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచకప్‌ తర్వాత మిగతా కుర్చీలతో పాటు పశ్చిమ వైపు పైకప్పు కూడా ఏర్పాటు చేస్తారు. వర్షం పడ్డ మైదానంలో నీరు నిలవకుండా ఉండటం కోసం డ్రైనేజీ వ్యవస్థనూ మెరుగుపరిచారు. కొత్త రంగులతో స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అభిమానుల కోసం ఉచితంగా నాణ్యమైన తాగునీటి వసతి కల్పించనున్నారు. 

అదే జోష్‌..

హైదరాబాద్‌లో మ్యాచ్‌ అంటే చాలు స్టేడియం కిక్కిరిసిపోవడం ఖాయం. తెలుగు రాష్ట్రాల అభిమానులకు క్రికెట్‌పై ఉన్న అభిమానం అలాంటిది. ఐపీఎల్‌ అయినా అంతర్జాతీయ మ్యాచ్‌ అయినా స్టేడియం పూర్తిగా నిండుతుంది. ఇప్పుడు ప్రపంచకప్‌లో ఇక్కడ భారత జట్టు మ్యాచ్‌లు లేనప్పటికీ.. ఇతర మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లకు డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని బట్టే క్రికెట్‌పై మన అభిమానుల ఇష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నెల 29న పాకిస్థాన్, న్యూజిలాండ్‌ మధ్య వార్మప్‌ మ్యాచ్‌ ఖాళీ స్టేడియంలో జరిగే అవకాశముంది. గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల నేపథ్యంలో మ్యాచ్‌కు భద్రత ఇవ్వలేమని పోలీసులు అంటున్నారు. అయితే మిగతా నాలుగు మ్యాచ్‌లకు మాత్రం ప్రేక్షకులను అనుమతిస్తారు. ఈ మ్యాచ్‌ల్లో విదేశీ ఆటగాళ్ల ఆటను ఆస్వాదిస్తూ మన అభిమానులు కేరింతలు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని