యాపిల్‌ వాచ్‌ ఛార్జింగ్‌ సమస్యను తీర్చేలా..

ఛార్జింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న యాపిల్‌ వాచ్‌ వినియోగదారులకు యాపిల్‌ సంస్థ మంచి అవకాశం...

Published : 17 Feb 2021 21:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఛార్జింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న తమ బ్రాండ్‌ వాచ్‌ వినియోగదారులకు యాపిల్‌ సంస్థ మంచి అవకాశం కల్పించింది. పవర్‌ రిజర్వ్‌ మోడ్‌లో పెట్టినప్పుడు డివైజ్‌ ఛార్జింగ్ కావడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో.. సమస్యను ఉచితంగా పరిష్కరిస్తామని యాపిల్‌ వెల్లడించింది. దీని కోసం విడుదల చేసే వెర్షన్‌ కోసం వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జ్‌లు వసూలు చేయడం లేదని యాపిల్‌ స్పష్టం చేసింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 5, ఎస్ఈ మోడళ్లలో ఓఎస్ 7.2, 7.3 వెర్షన్‌తో రన్‌ అవుతున్న కొన్నింట్లో సమస్య తలెత్తినట్లు సంస్థ గుర్తించింది. ఇలాంటి సమస్య కలిగిన వాచ్‌లను వెంటనే యాపిల్‌ సపోర్ట్‌ దృష్టికి తీసుకురావాలని యాపిల్ సూచించింది. 

కొత్తగా కొనుగోలు చేసిన తర్వాత కనీసం ఓ అరగంటపాటు ఛార్జింగ్‌ పెట్టేందుకు ప్రయత్నించాలని, అప్పుడు కూడా ఛార్జింగ్‌ కాకపోతే యాపిల్‌ సపోర్ట్‌ను సంప్రదించాలని సంస్థ వెల్లడించింది. అలాగే యాపిల్ వాచ్‌ మోడల్‌, ఓఎస్‌ వెర్షన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. సిరీస్‌ 5, ఎస్‌ఈ మోడళ్లలోని అన్ని వాచ్‌ల్లో సమస్య ఉత్పన్నం కాలేదని పేర్కొంది. అయితే తర్వాత సమస్య తలెత్తే అవకాశాలను ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం యాపిల్‌ కొత్తగా ఓఎస్‌ 7.3.1 వెర్షన్‌ను విడుదల చేసింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వెర్షన్‌తో డివైజ్‌ను అప్‌డేట్‌ చేసుకుంటూ ఉంటే భద్రతాపరమైన చిక్కుల నుంచి, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని