ఇక మొబైల్‌ ఫోనే టీవీ

రేడియో, ఫోన్లలోని రిసీవర్‌ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి  ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది  వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్‌ ఫోన్‌లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం.

Updated : 31 Jan 2024 07:09 IST

రేడియో, ఫోన్లలోని రిసీవర్‌ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి  ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది  వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్‌ ఫోన్‌లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. మరి మొబైల్‌ ఫోన్లలో రేడియో ఛానెళ్ల మాదిరిగా టీవీ ఛానెళ్లనూ చూస్తే? అదీ ఇంటర్నెట్‌ అవసరం లేకుండా. అలాంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి.

మొబైల్‌ ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో ప్రసారాలను ఆస్వాదిస్తూనే ఉన్నాం. వీటి తరహాలోనే టీవీ కార్యక్రమాలూ ప్రసారమయ్యే రోజులు త్వరలోనే సాకారం కానున్నాయి. ఇందుకు డైరెక్ట్‌-టు-మొబైల్‌ (డీ2ఎం) పరిజ్ఞానం వీలు కల్పించనుంది. దీని ప్రయోగ పరీక్షలను 19 పట్టణాల్లో ప్రారంభించనున్నట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. దీంతో ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండానే మొబైల్‌ ఫోన్లలో వీడియో కార్యక్రమాలను చూడొచ్చు. ఐఐటీ కాన్పుర్‌, సాంఖ్య ల్యాబ్స్‌ ఈ పరిజ్ఞానాన్ని రూపొదించాయి. మనదేశంలో 80కోట్ల మంది మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కంటెంట్‌.. ముఖ్యంగా విద్య, అతవ్యసర హెచ్చరికల వంటివాటికి ప్రభుత్వం డీ2ఎం పరిజ్ఞానాన్ని వాడుకోవాలని భావిస్తోంది.

ఏంటీ పరిజ్ఞానం?

డైరెక్ట్‌ టు మొబైల్‌ పరిజ్ఞానాన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించారు. ఇలాంటి పరిజ్ఞానం ప్రపంచంలోనే ఇదే మొదటిది. ఒకరకంగా దీన్ని ఎఫ్‌ఎం రేడియో లాంటిదని చెప్పుకోవచ్చు. పరికరంలోని రిసీవర్‌ వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీలను గ్రహించి, ఆయా రేడియో కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది కదా. టీవీల్లోనూ ప్రస్తుతం డైరెక్ట్‌ టు హోం (డీటీహెచ్‌) విధానంతో కార్యక్రమాలను చూస్తున్నాం. డిష్‌ యాంటెన్నాలు నేరుగా ఉపగ్రహాల నుంచి బ్రాడ్‌కాస్ట్‌ సంకేతాలను గ్రహించి సెట్‌టాప్‌ బాక్స్‌కు చేరవేస్తాయి. సెట్‌బాక్స్‌ నుంచి టీవీ వాటిని గ్రహించి కార్యక్రమాలను చూపిస్తుంది. డీ2ఎం కూడా దాదాపు ఇలాగే పనిచేస్తుంది. కాకపోతే ఇందులో టీవీకి బదులు ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి పరికరాలు సంకేతాలను గ్రహించి నేరుగా కార్యక్రమాలను చూపిస్తాయి. ఈ పరిజ్ఞానంలో బ్రాడ్‌బ్యాండ్‌, బ్రాడ్‌కాస్ట్‌లు రెండూ కలిసి ఉంటాయి. ప్రాంతీయ టెలీకమ్యూనికేషన్స్‌ వసతులు, కేటాయించిన స్పెక్ట్రమ్‌ సాయంతో నేరుగా డేటా సంకేతాలు మొబైల్‌ ఫోన్లకు అందుతాయి. ఇందుకోసం ప్రభుత్వం 470-582 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష క్రీడా ప్రసారాల వంటి మల్టీమీడియా కంటెంట్‌ నేరుగా ప్రసారం కావటానికిది తోడ్పడుతుంది. ఇంటర్నెట్‌ అవసరముండదు. కంటెంట్‌ ప్రసారంలో.. ముఖ్యంగా వీడియో ప్రసారాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని భావిస్తున్నారు.

ఎలా ఉపయోగపడుతుంది?

స్మార్ట్‌ఫోన్‌ వాడేవారికి, టెలికం ఆపరేటర్లకు.. ఇద్దరికీ డీ2ఎం పరిజ్ఞానం మేలు చేసే అవకాశముంది. దీంతో 25-30% వరకు వీడియో కంటెంట్‌ రద్దీ తగ్గుతుంది. ఫలితంగా 5జీ నెట్‌వర్క్‌ మీదా భారం తగ్గుతుంది. ఇది డిజిటల్‌ పరిణామ ప్రక్రియ వేగం పుంజుకోవటానికి తోడ్పడుతుంది. మనదేశంలో స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారిలో 69% కంటెంట్‌ను వీడియోలే ఆక్రమిస్తున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. డీ2ఎం పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే వీడియోలను.. ముఖ్యంగా టీవీ కార్యక్రమాలను చూసేవారి మరింత పెరగగలదని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని