Beijing Olympics: మంచు క్రీడా మర్మం

మంచు క్రీడలతో అలరించే వింటర్‌ ఒలింపిక్స్‌ ఎట్టకేలకు ఆరంభమయ్యాయి. నేల మీద ఆటలు ఆడాలంటేనే ఎంతో నైపుణ్యం కావాలి. అలాంటిది నిల్చుంటే సర్రుమని జారిపోయే మంచు మీద ఆటలంటే మాటలా? అయినా క్రీడాకారులు స్కీయింగ్‌, స్కై జంపింగ్‌, ఐస్‌ హాకీ వంటివి తేలికగా ఎలా ఆడతారు? శరీరం మీద నియంత్రణ సాధిస్తూ నిర్ణీత లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తారు? దీని వెనక చాలా సైన్స్‌ దాగుంది. మంచు తయారీలోనూ భౌతిక శాస్త్ర నియమాలు ఇమిడి ఉన్నాయి.

Updated : 09 Feb 2022 07:12 IST

మంచు క్రీడలతో అలరించే వింటర్‌ ఒలింపిక్స్‌ ఎట్టకేలకు ఆరంభమయ్యాయి. నేల మీద ఆటలు ఆడాలంటేనే ఎంతో నైపుణ్యం కావాలి. అలాంటిది నిల్చుంటే సర్రుమని జారిపోయే మంచు మీద ఆటలంటే మాటలా? అయినా క్రీడాకారులు స్కీయింగ్‌, స్కై జంపింగ్‌, ఐస్‌ హాకీ వంటివి తేలికగా ఎలా ఆడతారు? శరీరం మీద నియంత్రణ సాధిస్తూ నిర్ణీత లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తారు? దీని వెనక చాలా సైన్స్‌ దాగుంది. మంచు తయారీలోనూ భౌతిక శాస్త్ర నియమాలు ఇమిడి ఉన్నాయి.

క్రీడలు మనిషి సామర్థ్యానికే కాదు.. సైన్స్‌ వినియోగానికీ కొలమానాలే. మంచు క్రీడలూ దీనికి నిదర్శనాలే. వీటిల్లోనూ ఎన్నో భౌతిక, గణిత శాస్త్ర నియమాలు ఇమిడి ఉన్నాయి. మంచు మీద తేలికగా జారిపోవటానికి తోడ్పడే బోర్డుల తయారీలో ఇంజినీరింగ్‌ ప్రతిభ కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. నిజానికి మంచు మీద వేగంగా సాగిపోవాలనే కోరిక ఈనాటిది కాదు. వేలాది ఏళ్ల క్రితమే వేట, రవాణా కోసం స్కిస్‌ను.. అదే బోర్డుల వంటి వాటిని ఉపయోగించుకోవటం ఆరంభించారు. స్కి నుంచే స్కీయింగ్‌ అనే పదం వాడకంలోకి వచ్చింది. స్కి అంటే చెక్క ముక్క అని అర్థం. దీని సాయంతోనే మంచు మీద జారటాన్ని స్కీయింగ్‌ అని పిలుచుకుంటున్నారు. క్రమంగా ఇది జీవనోపాధి నుంచి ఆటగా మారిపోయింది. ఎన్నెన్నో రూపాలను సంతరించుకుంది. ప్రత్యేకంగా చలికాలపు ఒలింపిక్స్‌ స్థాయికి ఎదిగింది. మరి ఈ క్రీడల వెనక ఉన్న సైన్స్‌ సంగతులు, పరిజ్ఞానాలేంటో చూద్దామా.


ఎత్తు నుంచి దూకినా..

వాలు ర్యాంపు మీద వేగంగా 40 డిగ్రీల కోణంలో కిందికి దూసుకుపోవటం. అంతలోనే గాలిలోకి 30-45 అడుగుల ఎత్తు ఎగరటం. మళ్లీ మళ్లీ అలాగే పైకీ కిందికీ ఎగురుతూ ఉండటం. స్కీయర్లు ఇలాంటి విన్యాసాలతోనే కనువిందు చేస్తుంటారు. ఎంత ఎత్తుకు ఎగిరితే అంతే వేగంతో కిందికి దూసుకొస్తుంటారు. ఫిగర్‌ స్కేటింగ్‌ క్రీడాకారులు ఒకట్రెండు అడుగుల ఎత్తు ఎగిరినా వారి కాళ్ల మీద శరీర బరువు కన్నా 5-8 రెట్ల ఎక్కువ బలం పడుతుంది. అలాంటిది అంత ఎత్తుల నుంచి కిందికి దూకినా స్కీయర్ల కాళ్లు ఎలా తట్టుకుంటాయి. రహస్యమంతా మంచు వాలు నిర్మాణంలోనే ఉంది. దీని ఉపరితలం 30 డిగ్రీల కోణంలో వాలుగా ఉంటుంది. దీంతో ఎత్తు నుంచి కిందికి దూకినా క్రీడాకారుల వేగం ఒక్కసారిగా సున్నాకు పడిపోదు. అదే వేగం కొనసాగుతూ వస్తుంది. అదే ఊపులో క్రీడాకారులు ముందుకు వెళ్తారు. అందుకే పాదాలు, మోకీళ్లు దెబ్బతినవు. మంచు వాలు ఉపరితలం మీద స్కేటింగ్‌ బోర్డు తాకేటప్పుడు కోణీయ సూత్రం ఇక్కడ కీలకపాత్ర పోషిస్తుంది.


బ్లేడు వైవిధ్యం

స్కేటింగ్‌లో వాడే బూట్లకు, బోర్డులకు అమర్చే బ్లేడ్లు కూడా ప్రత్యేకమైనవే. ఒకో ఆటకు ఒకో రకంగా వీటిని రూపొందిస్తారు. ఇందులోనూ ఎంతో సైన్స్‌ ఉంది.

* హాకీ: మంచు మీద హాకీ ఆడేవారు ధరించే స్కేటింగ్‌ బోర్డు బ్లేడ్లు పొట్టిగా, అంచుల చివర్ల మధ్య భాగం కాస్త బోలుగా ఉంటుంది. దీంతో రెండు అంచులు ఏర్పడతాయి. దీంతో బ్లేడు ఒకవైపు మంచును కోసుకుంటూ వెళ్తూనే మరోవైపు ఘర్షణ పుట్టుకొస్తుంది. క్రీడాకారులు అవసరమైనప్పుడు ఆగటానికి, తిరగటానికి, స్థిరంగా ఉండటానికి తోడ్పడేది ఈ ఘర్షణే.

* ఫిగర్‌ స్కేటింగ్‌: ఫిగర్‌ స్కేటింగ్‌ క్రీడాకారులు ముందే నిర్ణయించుకున్న విధంగా కదులుతుంటారు. అందువల్ల ఇందులో బోర్డు బ్లేడ్ల చివర బోలు మరీ ఎక్కువ లోతుగా ఉండాల్సిన అవసరం లేదు. బోలు కాస్త చిన్నగా ఉండటం వల్ల ఘర్షణ తగ్గుతుంది. దీంతో తేలికగా మంచు కోసుకుపోతుంది. ఎటంటే అటు తేలికగా తిరగటానికి, అవసరమైన సమయంలో పైకి ఎగరటానికి, హఠాత్తుగా ఆగి ఆటను ముగించటానికి వీలవుతుంది.

* స్పీడ్‌ స్కేటింగ్‌: దీని బోర్డు బ్లేడ్లను పొడవుగా, గట్టిగా ఉండేలా రూపొందిస్తారు. దీంతో మంచుకు తాకినప్పుడు బ్లేడు ఎక్కువ చోటును ఆక్రమిస్తుంది. ఫలితంగా మరింత ఎక్కువ ఘర్షణ పుట్టుకొస్తుంది. ఎంత ఎక్కువ ఘర్షణ ఏర్పడితే అంత ఎక్కువ ఉష్ణం జనిస్తుంది. అప్పుడు మంచు కొద్దిగా కరిగి, ముందుకు జారటానికి వీలు కల్పిస్తుంది. బ్లేడు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించటం వల్ల క్రీడాకారులు మంచు మీద ఎక్కువ బలం ప్రయోగించటానికి వీలవుతుంది. ఇవన్నీ ఎక్కువ వేగంతో దూసుకుపోయేలా చేస్తాయి.


గింగిరాల రహస్యం

ఫిగర్‌ స్కేటింగ్‌లో క్రీడాకారులు గింగిరాలు తిరగటం, జంప్‌ చేయటం ముచ్చట గొలుపుతుంది. ఇందులో కోణీయ వేగ నియంత్రణ కీలకం. శరీరం గాల్లోకి లేవటానికి ముందు ఆటగాళ్లు నిలువు వేగాన్ని సాధించటానికి అధోముఖ బలాన్ని సృష్టించుకుంటారు. అదే సమయంలో స్కేట్‌ అంచును పక్కలకు.. అంటే శరీర మధ్య రేఖకు అవతలి వైపునకు నొక్కుతారు. ఫలితంగా కోణీయ వేగం పుట్టుకొచ్చి, మంచు మీద ఉండగానే శరీరం పక్కకు తిరగటానికి వీలవుతుంది. ఇలా ఒకసారి క్వాడ్‌ జంప్‌ చేయటానికి చాలా బలాన్నే సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఇది శరీర బరువును బట్టి ఉంటుంది. 75 కిలోల బరువున్న క్రీడాకారుడు 75 కిలోల కోణీయ వేగాన్ని, మంచుకు వ్యతిరేకంగా 150 కిలోల బలాన్ని పుట్టించుకుంటేనే గానీ ఒక క్వాడ్‌ జంప్‌ పూర్తి కాదు.

* తల నుంచి పాదాల వరకు ఒక తిన్నని రేఖను ఊహించుకోండి. దీని చుట్టూరా ద్రవ్యరాశి విస్తరణ వల్లనే శరీరం స్థిరంగా చుట్టూ తిరగటం సాధ్యమవుతుంది. క్రీడాకారులు చేతులు, కాళ్లను శరీరానికి బిగుతుగా పట్టుకొని దీన్ని సాధిస్తారు. అప్పుడు శరీర మధ్య రేఖకు ద్రవ్యరాశి మధ్య దూరం తగ్గుతుంది. ఫలితంగా వేగంగా శరీరాన్ని చుట్టూ తిప్పటం సాధ్యమవుతుంది. లేకపోతే కింద పడిపోయే ప్రమాదముంది.

* ఎత్తుకు ఎగరటంతో పాటు గాల్లో ఎన్నిసార్లు గింగిరాలు కొట్టారనేదీ విజేతను నిర్ణయిస్తుంది. ఆడవాళ్లు సగటున 16 అంగుళాల వరకు గాల్లోకి ఎగురుతారు. అదే పురుషులు సగటున 20 అంగుళాల వరకు ఎగురుతారు. అందుకే గాల్లో గింగిరాలు కొట్టటానికి మగవారికి ఎక్కువ సమయం లభిస్తుంది. ఫలితంగా ఎక్కువసార్లు గింగిరాలు తిరుగుతారు.


ఐస్‌ ప్రత్యేకత కూడా..

మంచు క్రీడల్లో ఐస్‌ వైవిధ్యమూ కీలక పాత్ర పోషిస్తుంది. దీని తయారీ వెనకా సైన్స్‌ సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

* స్పీడ్‌ స్కేటింగ్‌: వేగంగా స్కేట్‌ చేయటానికి పొడవైన ట్రాక్‌లు కావాలి. వీటి ఐస్‌ పొర మందంగా, గట్టిగా ఉంటుంది. దీని మూలంగానే క్రీడలు పూర్తయ్యేంతవరకు చల్లగా ఉంటుంది. నీటిలోంచి అన్నిరకాల ఖనిజాలను వడపోసిన తర్వాతే ఈ మంచును తయారుచేస్తారు.

* కర్లింగ్‌: మంచు మీద రాతి గ్లైడ్స్‌ విసురుతూ ఆడే కర్లింగ్‌ కోసం ఐస్‌ తయారుచేయటంలో నీటి నాణ్యత చాలా ముఖ్యం. పూర్తిగా శుద్ధమైన నీరు బాగా గడ్డ కడుతుంది. నున్నగానూ ఉంటుంది. నీరు గడ్డ కట్టాక 8 అడుగుల పొడవైన బ్లేడుతో గీకుతూ చాలా నున్నగా చేస్తారు. తర్వాత 1-2 మిల్లీమీటర్ల ఎత్తు, 3-10 మిల్లీమీటర్ల వెడల్పు గల మంచు గులకలను చేత్తో చల్లుతారు. గ్లైడ్స్‌ జారుతున్నప్పుడు ఇవి ఘర్షణ తగ్గిస్తాయి. ఈ రాళ్లు ముందుకు కదులుతున్నప్పుడు క్రీడాకారులు బ్రష్షుల వంటి చీపుర్లతో ఊడ్వటం గమనించే ఉంటారు. ఇలా ఊడ్చినప్పుడు పుట్టుకొచ్చే వేడికి మంచు మీదుండే పలుచటి పొర కరిగి, నీరుగా మారుతుంది. ఇది రాయి తేలికగా జారటానికి, వేగంగా కదలటానికి తోడ్పడుతుంది.

* హాకీ: ఐస్‌ హాకీ రింకులను జంబోనీ అనే యంత్రం సాయంతో రూపొందిస్తారు. ఇది నీటిని వెదజల్లుతూ మంచు పగుళ్లలోని చెత్తను తొలగిస్తుంది. మలినాలతో కూడిన నీటిని పీల్చేసుకుంటుంది. అంతేకాదు, పలుచటి వేడి నీటి పొరను చల్లుతుంది. ఇది గడ్డ కట్టి, ఉపరితలాన్ని నున్నగా చేస్తుంది.

* ఫిగర్‌ స్కేటింగ్‌: దీనికి మరీ అంత చల్లగా లేని, మందమైన ఐస్‌ పొర అవసరం. అప్పుడే బూట్ల బ్లేడ్‌ అంచున ఉండే కోరల వంటివి మంచులోకి దిగబడి, పైకి ఎగరటం,  మంచు మీద, గాల్లో గిరగిరా తిరగటం సాధ్యమవుతుంది. బూట్లు బలంగా కింద తాకినా క్రీడాకారులకు గాయాలు కాకుండా కాపాడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని