ఫోన్‌జాలం!

స్మార్ట్‌ఫోన్లు రోజురోజుకీ మరింత స్మార్ట్‌గా తయారవుతున్నాయి. అధునాతన టెక్నాలజీకి పర్యాయపదంగా మారుతున్నాయి. కొత్త కొత్త అప్‌డేట్లతో వినూత్నంగా మారుతున్నాయి. ఈ అప్‌డేట్ల జోరులో కొన్ని ఫీచర్లు మరుగుపడిపోతుంటాయి. అంతగా తెలియని ఫీచర్లయితే మరింత అడుక్కు వెళ్లిపోతుంటాయి.

Published : 17 Aug 2022 01:15 IST

స్మార్ట్‌ఫోన్లు రోజురోజుకీ మరింత స్మార్ట్‌గా తయారవుతున్నాయి. అధునాతన టెక్నాలజీకి పర్యాయపదంగా మారుతున్నాయి. కొత్త కొత్త అప్‌డేట్లతో వినూత్నంగా మారుతున్నాయి. ఈ అప్‌డేట్ల జోరులో కొన్ని ఫీచర్లు మరుగుపడిపోతుంటాయి. అంతగా తెలియని ఫీచర్లయితే మరింత అడుక్కు వెళ్లిపోతుంటాయి. అలాంటి కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలిస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.


మార్గ సూచి

అధునాతన స్మార్ట్‌ఫోన్లలో మొదట్నుంచీ మ్యాప్స్‌ కీలక భాగంగా ఒదిగిపోయింది. ఇప్పుడు గూగుల్‌, యాపిల్‌ దీనికి కెమెరాను జోడించి కొత్త సొబగులు అద్దాయి. ఆగ్మెంటెండ్‌ రియాలిటీ అనుభవాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లలో గూగుల్‌ మ్యాప్స్‌ను ఓపెన్‌ చేసి, చేరుకోవాల్సిన గమ్యాన్ని టైప్‌ చేయండి. తర్వాత డైరెక్షన్స్‌ మీద ట్యాప్‌ చేసి, నడవటం ఆరంభించండి. మ్యాప్‌లో మూలకు ఉండే లైవ్‌ వ్యూ గుర్తు మీద ట్యాప్‌ చేస్తే చాలు. గూగుల్‌ స్ట్రీల్‌ వ్యూ ఫొటోలతో చుట్టుపక్కల పరిసరాలను పోల్చుకొని గుర్తించటానికి వీలుగా చుట్టుపక్కల భవనాల మీద కెమెరాను ఫోకస్‌ చేయమని ఫోన్‌ సూచిస్తుంది. దీన్ని ఒకసారి సెట్‌ చేసుకుంటే కెమెరా స్క్రీన్‌ మీద ఆగ్మెంటెడ్‌ రియాలిటీ దృశ్యాలతో కూడిన దారి కనిపిస్తుంది. యాపిల్‌ మ్యాప్స్‌ కూడా ఐఫోన్‌ కెమెరాను ఇలాగే వాడుకుంటుంది. దీన్ని సపోర్టు చేసే పట్టణాల్లో డైరెక్షన్స్‌ను ఎంచుకొని నడవటం మెదలెట్టి, మ్యాప్‌ తెర మీద ఐఆర్‌ గుర్తును తట్టాలి.


స్కాన్‌ మాయ

పర్యాటక గైడ్‌గానే కాదు. డాక్యుమెంట్లు, క్విక్‌-రెస్పాన్స్‌ (క్యూఆర్‌) కోడ్లను స్కాన్‌ చేయటానికీ కెమెరా ఉపయోగపడుతుంది. ఐఫోన్లలో నోట్స్‌ యాప్‌తో డాక్యుమెంట్లు, రసీదుల వంటి వాటిని స్కాన్‌ చేయొచ్చు. ఇందుకు నోట్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, కొత్త నోట్‌ను ఎంచుకోవాలి. టూల్‌బార్‌ మీద కెమెరా గర్తును నొక్కి, స్కాన్‌ డ్యాక్యుమెంట్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే ఆయా పత్రాలు స్కాన్‌ అవుతాయి. కీబోర్డు టూల్‌బార్‌ మీదుండే కెమెరా గుర్తును ట్యాప్‌ చేసీ స్కాన్‌ చేయొచ్చు. వీటిని మెయిల్‌లో కంపోజ్‌ చేస్తున్న మెసేజ్‌కు అటాచ్‌ చేసుకోవచ్చు కూడా.

గూగుల్‌ డ్రైవ్‌ యాప్‌లోనూ స్కానింగ్‌ సదుపాయముంది. ఇందుకోసం ప్లస్‌ బటన్‌ను నొక్కి, స్కాన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉచిత గూగుల్‌ స్టాక్‌ యాప్‌ కూడా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో స్కాన్‌ చేస్తుంది. పీడీఎఫ్‌ పైళ్లను ఒక క్రమంలో ఉంచుతుంది. కొన్ని సామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోన్లలోని కెమెరా కూడా డాక్యుమెంట్లను గుర్తించి, స్కాన్‌ చేయగలదు. ఇందుకు ఆయా డాక్యుమెంట్లను ఫోన్‌ కెమెరా కంటపడేలా చేస్తే చాలు. క్యూఆర్‌ కోడ్స్‌ విషయానికి వస్తే- కెమెరాను ఓపెన్‌ చేసి, క్యూఆర్‌ కోడ్‌ మీద ఫోకస్‌ చేస్తే స్కాన్‌ అవుతాయి. చాలా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో క్యూఆర్‌ స్కానర్‌ ఆప్షన్‌ సైతం కెమెరా యాప్‌ సాయంతోనే పనిచేస్తుంది. అయితే నమ్మకమైన సోర్స్‌లకు చెందిన క్యూఆర్‌ కోడ్లనే స్కాన్‌ చేయాలి. ఎందుకంటే సైబర్‌ నేరగాళ్లు వీటిని మోసం చేయటానికి, హానికర సాఫ్ట్‌వేర్లను వ్యాప్తి చేయటానికి ఉపయోగించుకోవచ్చు.


అత్యవసర సాయం

అత్యవసర సమయాల్లో కొన్ని షార్ట్‌కట్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. ఐఫోన్‌ 8, అంతకన్నా తర్వాతి మోడళ్లలో కుడివైపు బటన్‌, వాల్యూమ్‌ బటన్లను అలాగే నొక్కి పడితే తెర మీద ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ స్లైడర్‌ కనిపిస్తుంది. దీన్ని పక్కకు జరిపితే ఆ నంబరుకు ఫోన్‌ కలుస్తుంది. ఒకవేళ స్లైడర్‌ను పక్కకు జరపలేని స్థితిలో ఉంటే ఆ బటన్లను అలాగే నొక్కి పట్టుకుంటే దానంతటదే ఫోన్‌ను కలుపుతుంది. పక్క బటన్‌ను ఐదు సార్లు నొక్కినప్పుడు అత్యవసర నంబర్‌కు కాల్‌ వెళ్లేలా ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ సెటింగ్స్‌లో ఎనేబుల్‌ చేసుకోవచ్చు కూడా. ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లలో వేర్వేరు అత్యవసర సేవల సదుపాయాలుంటాయి. పవర్‌ బటన్‌ను కిందికి అలాగే నొక్కి పట్టి ఉంచితే ఎమర్జెన్సీ కాల్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. తెర మీద కింది నుంచి పైకి స్వైప్‌ చేసినా ఎమర్జెన్సీ కాల్‌ బటన్‌ ప్రత్యక్షమవుతుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లకు గూగుల్‌ ఉచితంగా అందించే పర్సనల్‌ సేఫ్టీ యాప్‌లో మరిన్ని ఎక్కువ సదుపాయాలుంటాయి. ఇవి అత్యవసర సమయాల్లో బాగా సాయం చేస్తాయి.


భూతద్దం

పుస్తకం చదువుతున్నారు. అక్షరాలు చిన్నగా ఉన్నాయి. లేదూ ప్యాకింగ్‌ మీద వివరాలు సరిగా కనిపించటం లేదు. ఇలాంటి సమయాల్లో ఐఫోన్‌లోని భూతద్దం ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది దగ్గర్లోని వస్తువులు పెద్దగా కనిపించేలా చేస్తుంది. సెటింగ్స్‌ ద్వారా యాక్సెసబిలిటీ విభాగంలోకి వెళ్తే మ్యాగ్నిఫయర్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని టర్న్‌ ఆన్‌ చేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కావాలంటే మ్యాగ్నిఫయర్‌ను కంట్రోల్‌ సెంటర్‌కు జత చేసుకొని.. తేలికగా, త్వరగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. సెటింగ్స్‌ ద్వారా కంట్రోల్‌ సెంటర్‌లోకి వెళ్లి కస్టమైజ్‌ కంట్రోల్స్‌ను ఎంచుకోవాలి. మ్యాగ్నిఫయర్‌ పక్కన ఉండే ప్లస్‌ గుర్తు మీద ట్యాప్‌ చేయాలి. దీంతో కంట్రోల్‌ సెంటర్‌లోనే భూతద్దం గుర్తు కనిపిస్తుంది.


స్మార్ట్‌గా రింగ్‌

ఎంత మంచి రింగ్‌టోన్‌ అయినా కొన్నిసార్లు చిరాకు తెప్పించొచ్చు. అందుకే చాలామంది ఫోన్‌ రింగ్‌ కాగానే వ్యాల్యూమ్‌ బటన్‌ను నొక్కి సౌండ్‌ ఆపేస్తుంటారు. పిక్సెల్‌ ఫోన్‌ వాడేవారికైతే ఇందుకోసం మరింత మంచి ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఇది కాల్‌ వస్తున్నప్పుడు ముందుగా ఫోన్‌ వైబ్రేట్‌ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాతే రింగ్‌ అవుతుంది. అదీ నెమ్మదిగా మొదలై క్రమంగా సౌండ్‌ పెరుగుతుంది. సౌండ్‌ విభాగంలోని ‘వైబ్రేట్‌ ఫర్‌ కాల్స్‌’ ఆప్షన్‌ ద్వారా దీన్ని ఎనేబుల్‌ చేసుకోవచ్చు.


పాటను పసిగట్టు

స్మార్ట్‌ఫోన్ల మైక్రోఫోన్‌ కేవలం మాటలను గ్రహించటానికి.. ఆడియో/వీడియో కాల్స్‌కే పరిమితం కావటం లేదు. మరింత విస్తృత రూపం ధరిస్తోంది. ఉదాహరణకు- ఆటో షాజమ్‌ ఫీచర్‌. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వర్షన్లు రెండింటిలోనూ పనిచేసే ఇది చుట్టుపక్కల వినిపించే సంగీతాన్ని తనకు తానే గుర్తించటానికి ప్రయత్నిస్తుంది. షాజమ్‌ సాయంతో  పాటను గుర్తించిన తర్వాత యాపిల్‌ మ్యూజిక్‌, స్పోటిఫై, యూట్యూబ్‌ మ్యూజిక్‌ వంటి వాటి వేదికల మీద ఎంచక్కా ప్లే చేసుకోవచ్చు. గూగుల్‌కు చెందిన చాలా పిక్సెల్‌ ఫోన్లలోని ‘నౌ ప్లేయింగ్‌’ ఫీచర్‌ సైతం ఇలాగే పనిచేస్తుంది. దీన్ని సౌండ్‌ అండ్‌ వైబ్రేషన్‌ సెటింగ్స్‌ ద్వారా ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని యాక్టివేట్‌ చేసుకుంటే చాలు. మైక్రోఫోన్‌ పరిధిలో వినిపించే సంగీతాన్ని, పాటలను జాబితాగా సృష్టించి పెడుతుంది. ఆయా పాటల టైటిల్స్‌ను లాక్‌ స్క్రీన్‌ మీద చూపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని