జేమ్స్ వెబ్ 365
నక్షత్రాల పుట్టుకను చూపించింది. సుదూర గ్రహాల వాతావరణాన్నీ కళ్లకు కట్టింది. తాజాగా తొలిసారిగా కృష్ణ నక్షత్రాల (డార్క్ స్టార్స్) ఉనికినీ పసిగట్టింది. విశ్వాంతరాళ రహస్యాలను ఛేదించటానికి నాసా ప్రయోగించిన అతిపెద్ద, అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా ప్రతీసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
నక్షత్రాల పుట్టుకను చూపించింది. సుదూర గ్రహాల వాతావరణాన్నీ కళ్లకు కట్టింది. తాజాగా తొలిసారిగా కృష్ణ నక్షత్రాల (డార్క్ స్టార్స్) ఉనికినీ పసిగట్టింది. విశ్వాంతరాళ రహస్యాలను ఛేదించటానికి నాసా ప్రయోగించిన అతిపెద్ద, అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా ప్రతీసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనుయాయిగా బాధ్యతలు చేపట్టి దాన్నే మించిపోయింది. కంటికి కనిపించని పరారుణ కాంతి సాయంతో మునుపెన్నడూ చూడని అంతరిక్ష దృశ్యాలతో ఆకట్టుకుంటూనే ఉంది. విశ్వదర్శినిగా పేరొందిన ఈ టెలిస్కోప్ గత సంవత్సరం జులైలో తొలి చిత్రాన్ని పంపించింది. అప్పటి నుంచీ ఎన్నెన్నో అపురూప దృశ్యాలను అందిస్తూనే ఉంది. మొదటి ఏడాదిలో జేమ్స్ వెబ్ పంపించిన వాటిల్లో మేటిగా నిలిచిన కొన్ని దృశ్యాల సమాహారం ఇదిగో..
నక్షత్ర మండల కుటుంబం
నక్షత్ర మండలాలంటేనే బోలెడన్ని చుక్కల సముదాయం. అలాంటిది ఐదు నక్షత్ర మండలాలు ఒకేచోట చేరితే? చూడటానికి రెండు కళ్లూ చాలవు. అలాంటి అద్భుతాన్నే కళ్లకు కట్టింది జేమ్స్ వెబ్. ఈ నక్షత్ర సముదాయం పేరు స్టెఫాన్స్ క్వింటెట్. వీటిల్లో నాలుగు స్పష్టంగా కనిపిస్తుండగా.. ఐదోది వీటి వెనకాల దాగి ఉంది. ఇవన్నీ గురుత్వాకర్షణ ప్రభావంతో ఒకదాంతో మరోటి అనుసంధానమై ఉన్నాయి. వీటి వెలుగులు ఈనాటివి కావు. దాదాపు 1,300 కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. అంటే విశ్వం ఆవిర్భావానికి మూలమైన బిగ్ బ్యాంగ్ సంభవించిన 80 కోట్ల ఏళ్ల తర్వాత మెరిసిన వెలుగులు అన్నమాట. నక్షత్ర మండలాలు ఎలా దగ్గరికి చేరుకుంటాయి? కొన్నిసార్లు అవి ఎందుకు కలిసిపోతాయి? అనే వాటిపై అధ్యయనం చేయటానికి స్టెఫాన్స్ క్వింటెట్ వంటి నక్షత్ర సముదాయాలు ఉపయోగపడతాయి. విశ్వం తొలినాళ్లలో నక్షత్ర మండలాలు కలవటం మామూలేనని, వీటి మూలంగానే మహా నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయన్నది శాస్త్రవేత్తల భావన. ఇలాంటి అంతర్ నక్షత్ర మండలాల చర్యలే వాయువును అస్తవ్యస్తం చేసి నక్షత్రాల ఏర్పాటు, కృష్ణ బిలాల పుట్టుకనూ ప్రేరేపిస్తుంటాయి.
అంతరిక్ష శిఖరాల సోయగం
కేరినా నెబ్యులాలో వాయు మేఘం, ధూళి పైకి ఎగుస్తున్న తీరు చూసినకొద్దీ చూడాలనిపిస్తుంది. భూమి మీద పర్వతాల మాదిరిగా కనిపిస్తుండటం వల్ల ఈ ప్రాంతాన్ని ‘అంతరిక్ష శిఖరాలు’ (కాస్మిక్ క్లిఫ్స్) అని పిలుచుకుంటున్నారు. మన భూమి నుంచి సుమారు 7,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వీటిని జేమ్స్ వెబ్ స్పష్టంగా, కమనీయంగా చిత్రీకరించింది. కొత్తగా ఏర్పడిన నక్షత్రాల నుంచి వెలువడే అతి నీలలోహిత కాంతి పుంజాలతో వాయు ధూళి మేఘం చెదిరిపోవటం వల్ల ఈ ఆకారాలు రూపొందాయి. అంతరిక్ష ‘పర్వతాల’ నుంచి వెలువడుతున్న ప్రవాహం మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ నిజానికిది రేడియేషన్ మూలంగా పేలిపోయిన అయోనైజ్డ్ వాయువు, వేడి దుమ్ము సమూహమే. ఈ ప్రాంతం గురించి ఖగోళ శాస్త్రవేత్తలకు ఇంతకుముందే తెలిసినా జేమ్స్ వెబ్ సరికొత్త రూపంలో చూపించింది.
సృష్టి స్తంభాల కనువిందు
అప్పట్లో హబుల్ టెలిస్కోప్ పంపించిన అద్భుత ‘సృష్టి స్తంభాల’ చిత్రం శాస్త్రవేత్తలనే అబ్బురపరిచింది. ఈగల్ నెబ్యులాలో భాగమైన వాయు మేఘాలు నిట్ట నిలువుగా పైకి ఎగుస్తుండటం, వీటి ముందూ వెనకా నక్షత్రాలు మిణుకు మిణుకు మనటం అందరినీ ఆకట్టుకుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీన్ని మరింత ఆకర్షణీయంగా చిత్రీకరించింది. నెబ్యులా మేఘాల నిండా పరచుకున్న చిన్న ఎరుపు నక్షత్రాలను కళ్లకు కట్టింది. తమ అంతర్భాగంలో హైడ్రోజన్‌ను మండించేంత పెద్దగా లేకపోవటం వల్ల శాస్త్రవేత్తలు వీటిని ‘ప్రోటోస్టార్స్’ అని పిలుచుకుంటున్నారు. దట్టమైన వాయు మేఘాలు, ధూళి వెనక దాక్కొని ఉండటం వల్ల హబుల్ టెలిస్కోప్ వీటి వెలుపలి అంచులనే చిత్రీకరించింది. జేమ్స్ టెలిస్కోప్ పుణ్యమాని నెబ్యులాలో నక్షత్రాలు పుట్టుకొచ్చే ఈ ప్రాంతం స్పష్టంగా ఆవిష్కృతమైంది. ఇది భూమికి 7వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నక్షత్రాల ఏర్పాటును అధ్యయనం చేయటానికిది ఈ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగశాలగా భావిస్తుండటం విశేషం.
ఆవలి గ్రహం గుర్తింపు
సౌర మండలం ఆవలి గ్రహాలను గుర్తించటం చాలా కష్టం. ఇవి తమ నక్షత్రం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతితో మసకబారి ఉంటాయి. ఇలాంటి ఒక గ్రహం ఉనికినీ జేమ్స్ వెబ్ పసిగట్టింది. దీని పేరు హెచ్‌ఐపీ 65426 బి. అతిథి నక్షత్రం నుంచి వెలువడే కాంతిని అడ్డుకునే కొరోనాగ్రాఫ్ సాయంతో దీన్ని గుర్తించింది. హెచ్‌ఐపీ 65426 బిని మహా వాయు గ్రహంగా భావిస్తున్నారు. ఇది గురు గ్రహం కన్నా 12 రెట్లు పెద్దది! భూమి-సూర్యుడికి మధ్య ఉన్న దూరం కన్నా 100 రెట్ల ఎక్కువ దూరంతో తన నక్షత్రం చుట్టూ తిరుగుతుండటం గమనార్హం. ఈ గ్రహం ఉపరితలం గట్టిగా లేకపోవటం వల్ల జీవం ఉండే అవకాశం లేకపోవచ్చు గానీ దీన్ని చిత్రీకరించటం నిజంగా గొప్ప విషయమే.
గ్రహాల వాతావరణం గుట్టు
జేమ్స్ వెబ్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి- భూమి నుంచి వేలాది కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందించటం. వీటిల్లో ఒకటి వాస్ప్-39 బి. ఇది భారీ వాయు గ్రహం. సుమారు శని గ్రహమంత ద్రవ్యరాశి కలిగుంది. కాకపోతే తన నక్షత్రానికి చాలా దగ్గరి కక్ష్యలో తిరుగాడుతోంది. వెబ్ టెలిస్కోప్‌లోని పరికరాల సాయంతో శాస్త్రవేత్తలు దీని వాతావరణంలోని రసాయన తీరుతెన్నులనూ పరీక్షించారు. అక్కడ నీటి ఆవిరి, సల్ఫర్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సోడియం, పొటాషియం ఉన్నట్టు గుర్తించారు. అన్నింటికన్నా చిత్రమైంది సల్ఫర్ ఆక్సైడ్ ఉండటం. ఈ గ్రహం చాలా వేడిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సల్ఫర్ ఆక్సైడ్ పుట్టుకురావటం అసాధ్యం. కానీ రసాయనాలను తీవ్రమైన కాంతి ఢీకొట్టటం (ఫొటోకెమిస్ట్రీ) వంటి అసాధారణ ప్రతిచర్యలతో ఇది సాధ్యమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక్కడ నక్షత్రం నుంచి వెలువడే కాంతి గ్రహం వాతావరణంలోని నీటి అణువులను తాకుతోంది. ఇంత కచ్చితంగా ఇలాంటి ప్రక్రియలను మునుపెన్నడూ శాస్త్రవేత్తలు చూడలేదు. ఇది జేమ్స్‌తోనే సాధ్యమైంది.
నక్షత్ర అలలు
జేమ్స్ చిత్రించిన మరో అసాధారణ దృశ్యమిది. ఇందులో కనిపిస్తున్నది వోల్ఫ్-రేయర్ (డబ్ల్యూఆర్) 140 నక్షత్రం. ఇలాంటి నక్షత్రాల వాతావరణంలో అయోనైజ్డ్ హీలియం, నత్రజని, కార్బన్ ఉంటాయి. డబ్ల్యూఆర్ 140 నక్షత్రం చుట్టూ వలయాలు ఏర్పడటం విచిత్రం. చూడటానికిది కళాకారులు గీసిన చిత్రంలా అనిపించినా ఇది అంతరిక్షంలో నిజంగా వెలిసిన దృశ్యం. ఈ వలయాలు నక్షత్రం చుట్టూ ఉండే శంఖ పదార్థాలు కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటిగా కనిపిస్తున్నప్పటికీ ఇది రెండు నక్షత్రాల వ్యవస్థ. ఇవి ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి దగ్గరగా వస్తుంటాయి. ఇలా రెండు నక్షత్రాలు ఒకదాని దగ్గరికి మరోటి వచ్చినప్పుడు ‘అంతరిక్ష గాలుల’ను.. అంటే ఆవేశిత రేణువులను పెద్దమొత్తంలో వెలువరిస్తుంటాయి. ఇవి చుట్టుపక్కల వాయువు, ధూళిని నెట్టేస్తుంటాయి. వలయాల మధ్య నిర్ణీత ఎడమ ఉండటం వల్ల ఇవి తరచూ ఏర్పడుతుండొచ్చని అనుకుంటున్నారు. మొత్తం 17 వలయాలను లెక్కించారు.
అంతరిక్ష లోతుల గుట్టు రట్టు
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో ప్రజల కోసం విడుదల చేసిన తొలి చిత్రం ఇదే. దీన్ని అమెరికా అధ్యక్షుడు గత జులైలో విడుదల చేశారు. హబుల్ టెలిస్కోప్ కన్నా మరింత వేగంతో కేవలం 12 గంటల్లోనే జేమ్స్ వెబ్ దీన్ని చిత్రీకరించింది. ఇందులో ఎస్‌ఎంఏసీఎస్ 0723 అనే నక్షత్ర మండలాల సముదాయం ప్రధానంగా కనిపిస్తుంది. భూమికి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఇందులో వేలాది నక్షత్ర మండలాలు ఇమిడి ఉండటం గమనార్హం. దీనిలోని నక్షత్రాలు అతి పురాతనమైనవి. పెద్దగా మారలేదు కూడా. దీన్ని మిణుగురు నక్షత్ర మండలంగానూ శాస్త్రవేత్తలు అభివర్ణించారు. దీని చుట్టూ మిణుగురుల మాదిరిగా పసుపు-ఎరుపు చుక్కలు కనిపిస్తున్నాయి మరి. వీటిని కళ్లకు కట్టటం జేమ్స్ వెబ్‌కే సాధ్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు
-
Padmanabha reddy: రూ.10వేల కోట్లు ఫ్రీజ్ చేయండి: సీఈసీకి పద్మనాభరెడ్డి లేఖ
-
Harish Rao: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు: మంత్రి హరీశ్‌రావు
-
ChatGPT: చాట్‌జీపీటీ ఇక వింటుందీ చూస్తుంది.. కొత్త ఫీచర్లు వారికి మాత్రమే!
-
CM Jagan: ‘ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి’.. కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశం