సంకేతం రహస్యం సురక్షితం!

ఇంటర్నెట్‌ వాడేవారు ఎన్‌క్రిప్షన్‌ గురించి వినే ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన టెక్నాలజీ.

Updated : 01 Nov 2023 09:40 IST

ఇంటర్నెట్‌ వాడేవారు ఎన్‌క్రిప్షన్‌ గురించి వినే ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన టెక్నాలజీ. భద్రంగా బ్రౌజింగ్‌ చేయటం దగ్గరి నుంచి ఈమెయిల్‌ సురక్షితంగా ఉండటం వరకూ ఎన్నో డిజిటల్‌ సెక్యూరిటీ పద్ధతులు దీని మీదే ఆధారపడతాయి. వాట్సప్‌ లాంటి యాప్‌ల్లో సందేశాలు ఎన్‌క్రిప్ట్‌ మోడ్‌లోనే ప్రసారమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే- ఇది లేకపోతే గోప్యతే లేదనుకోవచ్చు. ఇంతకీ ఈ ఎన్‌క్రిప్షన్‌ కథేంటి?

మీరు ఉత్తరం ద్వారా స్నేహితుడికి రహస్య సమాచారాన్ని పంపించాలని అనుకున్నారు. మధ్యలో ఎవరైనా చదివితే? అదే స్నేహితుడికి, మీకు మాత్రమే తెలిసిన సంకేత భాషలో రాస్తే? ఇతరులకు అసలే అర్థం కాదు. తేలికగా చెప్పాలంటే ఇదే ఎన్‌క్రిప్షన్‌. సంకేత సందేశమన్నమాట. ఇది మెసేజ్‌ లేదా డేటా సంవిధానాన్నే మార్చేస్తుంది. అసలు రూపంలోకి మారితేనే చదవటం సాధ్యమవుతుంది. ఇతరులకైతే అర్థం పర్థం లేని అక్షరాలు, చిహ్నాల్లా కనిపిస్తుంది. రహస్య సమాచారం పంపే వారికిది బాగా ఉపయోగపడుతుంది. గూఢచారుల కంట పడకుండా కాపాడుతుంది. ఇప్పుడిది ఇంటర్నెట్‌లో అంతర్భాగమైంది గానీ పురాతన కాలం నుంచీ అనుసరిస్తున్న పద్ధతే.


బ్రౌజింగ్‌ సురక్షితం

విశ్వసనీయమైన చాలా వెబ్‌సైట్లు ట్రాన్స్‌పోర్ట్‌ లేయర్‌ సెక్యూరిటీ అనే ఎన్‌క్రిప్షన్‌ ప్రొటెక్షన్‌ కలిగుంటాయి. ఇది రెండు వ్యవస్థల మధ్య పంపిణీ అయ్యే సమాచారాన్ని భద్రంగా ఉంచుతుంది. ఉదాహరణకు- ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ లేదా పేమెంట్‌ యాప్‌ల ద్వారా ఒక సర్వర్‌ నుంచి మరో సర్వర్‌కు చేరే క్రెడిట్‌ కార్డు సమాచారాన్ని కాపాడుతుంది. అటాకర్లకు సమాచారం అందకుండా నిలువరిస్తుంది. అడ్రస్‌బార్‌లో వెబ్‌సైట్‌ పేరుకు ముందు హెచ్‌టీటీపీఎస్‌ ఉంటే ఈ ఎన్‌క్రిప్షన్‌ పద్ధతిని ఉపయోగిస్తున్నట్టేనని అనుకోవచ్చు. ఇందులో ఎస్‌ అంటే సెక్యూర్‌ అని. ఆ వెబ్‌సైట్‌ సమాచార పంపిణికి ఎన్‌క్రిప్షన్‌ ఉపయోగిస్తుందని అర్థం. వచ్చీ, పోయే డేటా భద్రతకు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లు (వీపీఎన్‌) ఎన్‌క్రిప్షన్‌ను వాడుకుంటాయి. హ్యాకర్లు సమాచారాన్ని దొంగిలించకుండా అడ్డుకుంటాయి.


అనాదిగా వస్తున్నదే..

వ్యక్తిగత సందేశాలను ఆయా వ్యక్తులు మాత్రమే చదవగలిగేందుకు అనాదిగా రకరకాల పద్ధతులను వాడుతూనే వస్తున్నారు. పురాతన గ్రీకులు గుండ్రటి కర్ర (స్కైటేల్‌) చుట్టూ తోలు పట్టీని చుట్టి, దాని పొడవునా రహస్య సందేశాలను రాసేవారు. తోలును విప్పదీస్తే రాసిన విషయం గజిబిజిగా ఉండి, ఎవరికీ అర్థమయ్యేది కాదు. దీన్ని అందుకున్నవారు అదే సైజు కర్ర చుట్టూ తోలును చుట్టి, అసలు విషయాన్ని గ్రహించేవారు. ఆనాటి గ్రీకులు వాడిన మరో రహస్య విధానం పాలీబియస్‌ స్క్వయర్‌. ఇందులో అడ్డంగా, నిలువుగా ఐదు లేదా ఆరు గదులతో కూడిన అక్షరాలుంటాయి. ఒకో అక్షరం ఒకో అంకెను ప్రతిబింబిస్తుంది. అడ్డం, నిలువు వరుసల్లో అంకెల ఆధారంగా అక్షరాలను పోల్చుకోవాల్సి ఉంటుంది. అక్షరాల తీరు గురించి తెలిస్తే తప్ప సంకేతం గుట్టు విప్పలేం. అక్షరాల క్రమాన్ని ముందుకో, వెనక్కో జరిపి రాసే సీజర్స్‌ సైఫర్‌ విధానమూ ఇలాంటిదే. ఇవన్నీ ఎన్‌క్రిప్షన్‌కు ఉదాహరణలే. అక్షరాల అమరిక తీరును కనుక్కొని, వాటిని మామూలుగా రాస్తే రహస్యం తెలుస్తుంది. ఇవన్నీ పురాతన విధానాలే అయినా ఆధునిక ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థల్లోనూ వీటి ఆనవాళ్లు కనిపిస్తాయి. సమాచారాన్ని పంపేవారికీ, అందుకునేవారికీ ముందుగానే రహస్య పద్ధతేంటి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అనేవి తెలిసి ఉండటం వీటిల్లోని కీలకాంశాలు. ఈ సూత్రాల సముచ్ఛయమే ఆల్గారిథమ్‌. ఇదే ఎన్‌క్రిప్షన్‌. అంటే గోప్యతకు ఉద్దేశించిన ఆల్గారిథమ్‌ల సమూహం అన్నమాట.


ఏంటీ ఎన్‌క్రిప్షన్‌?

పురాతన రాజుల కాలం మాదిరిగానే నేటి డిజిటల్‌ యుగం మానవుడికీ రహస్య సమాచారాన్ని పంపటం, భద్రపరచటం పెద్ద సవాల్‌గానే నిలుస్తోంది. ఇక్కడే ఎన్‌క్రిప్షన్‌ విధానాలు ఉపయోగపడుతున్నాయి. రహస్య సమాచారం భద్రంగా ఉండటానికివి వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రోజురోజుకీ పెద్దమొత్తంలో సమాచారం చేరుతూ వస్తోంది. ఇది వెబ్‌తో అనుసంధానమయ్యే క్లౌడ్‌లో, సర్వర్లలో నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో చేయని పనంటూ లేదన్నా అతిశయోక్తి కాదేమో. వస్తువులను కొనటం దగ్గరి నుంచి హెచ్‌ఆర్‌ పోర్టల్‌లో లాగిన్‌ కావటం వరకూ అన్నీ అంతర్జాలంతోనే ముడిపడి ఉంటున్నాయి. కంపెనీలు, బ్యాంకులు, ఆఫీసులు, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని భద్రంగా కాపాడుకోవటం అనివార్యమైంది. ఇక్కడే ఎన్‌క్రిప్షన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. మెసేజ్‌లు, ఫైళ్లు, ఆన్‌లైన్‌లో డేటా మార్పిడి.. ఇలా అన్నింటికీ ఎన్‌క్రిప్షన్‌ అవసరమవుతోంది. ఇది ఉద్దేశించిన వ్యక్తులే సమాచారం చదువుకునేలా చేస్తుంది మరి.


ప్రధానంగా రెండు రకాలు

ఎన్‌క్రిప్షన్‌ కీ అనేది అంకెల వరుస. దీని ద్వారానే డేటా సంకేతలిపిలోకి, తిరిగి మామూలు రూపంలోకి మారుతుంది. ఆల్గారిథమ్‌లో ఈ ఎన్‌క్రిప్షన్‌ కీలను తయారుచేస్తారు. ప్రతీదీ ర్యాండమ్‌గా ఉండొచ్చు. లేదూ విశిష్టమైనదీ కావొచ్చు. ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థలో ప్రధానంగా రెండు విధానాలు కనిపిస్తాయి. ఒకటి- సిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌. రెండోది- అసిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌. సిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌ ఒకే రహస్య పాస్‌వర్డ్‌ లేదా కీతో డేటాను ఎన్‌క్రిప్ట్‌, డీక్రిప్ట్‌ చేస్తుంది. సాధారణంగా బ్యాంకింగ్‌ స్థాయి ఎన్‌క్రిప్షన్‌ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇది సరళమైంది. ఎక్కువగా దీన్నే వాడుతుంటారు. సిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌లో మళ్లీ రెండు రకాలు. ఒకటేమో మామూలు టెక్స్ట్‌ గుర్తులను ఒక బ్లాక్‌లో రహస్య సంకేతంగా మారుస్తుంది (బ్లాక్‌ ఆల్గారిథమ్‌లు). రెండోదేమో ఒక మామూలు టెక్స్ట్‌ గుర్తును నేరుగా రహస్య టెక్స్ట్‌గా మారుస్తుంది (స్ట్రీమ్‌ ఆల్గారిథమ్‌లు). ఇక అసిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌ రెండు కీల సాయంతో ఎన్‌క్రిప్ట్‌, డీక్రిప్ట్‌ చేస్తుంది. దీన్నే పబ్లిక్‌ కీ క్రిప్టోగ్రఫీ అనీ అంటారు. యూజర్ల మధ్య షేర్‌ అయ్యే పబ్లిక్‌ కీ డేటాను ఎన్‌క్రిప్ట్‌, డీక్రిప్ట్‌ చేస్తుంది. ప్రైవేట్‌ కీ కూడా డేటాను ఎన్‌క్రిప్ట్‌, డీక్రిప్ట్‌ చేసినప్పటికీ యూజర్ల మధ్య పంపిణీ కాదు. అసిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌ రెండు పెద్ద కీలను వాడుకోవటం వల్ల నెమ్మదిగా పనిచేస్తుంది. సిమెట్రిక్‌ క్రిప్టోగ్రఫీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగుంటుంది. అయితే భద్రత విషయంలో దీన్ని అధునాతమైందని భావిస్తారు. ఇప్పుడు రెండు పద్ధతులూ వాడకంలో ఉన్నాయి. ఒకోసారి రెండూ కలిసి పనిచేస్తాయి. ఒకదాని లోపాన్ని మరోటి సవరిస్తుంది.


ఎన్‌క్రిప్షన్‌ ఆల్గారిథమ్‌ అంటే?

ఎన్‌క్రిప్షన్‌ ఆల్గారిథమ్‌ కొన్ని నియమాలతో పనిచేస్తుంది. దీంతో కూడిన విధానాలు అక్షరాలకు బదులు బిట్స్‌ను వాడుకుంటాయి. ఇవి ఒకటి, సున్నా రూపంలో ఉంటాయి. ఎన్‌క్రిప్షన్‌ ఆల్గారిథమ్‌లో నిక్షిప్తమైన సంక్లిష్ట గణిత సూత్రాలను బట్టి ఆయా బ్లాకుల్లో బిట్స్‌ మారిపోతాయి. ఉదాహరణకు- ఆల్గారిథమ్‌ 128 బిట్స్‌ సైజు బ్లాక్‌ను వాడుకున్నట్టయితే డేటా మొత్తం 128 బిట్స్‌ విభాగాలుగా మారిపోతుంది. ఒకవేళ చివరి విభాగం 128 బిట్స్‌ కన్నా తక్కువగా ఉంటే సమాచారాన్ని అంతవరకూ పూడ్చు కుంటుంది. ప్రస్తుతం రకరకాల బ్లాక్‌ ఎన్‌క్రిప్షన్‌ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు ఆల్గారిథమ్‌లు వేర్వేరు పొడవుల బ్లాక్‌లను వినియోగించుకుంటాయి. వివిధ గణిత సమ్మేళనాలుగా మార్చేస్తాయి. ఇదంతా బాగానే ఉంది గానీ అదే ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థ గలవారు అనధికారికంగా సమాచారాన్ని డీక్రిప్ట్‌ చేస్తే? అంటే బ్యాంకుల వంటివి మన పాస్‌వర్డ్‌ను చూస్తే? ఇలాంటి సందేహం రావటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడే ఒక కిటుకుంది. సాంకేతిక లిపి(సైఫర్‌ టెక్స్ట్‌)ని బ్యాంకుల వంటివి తిరిగి మామూలు టెక్స్ట్‌గా మార్చటం కుదరదు. ఆయా వ్యక్తులకే ప్రత్యేకం.  హ్యాకర్లు సైతం వీటిని చూడగలరేమో గానీ అర్థం చేసుకోలేరు. డీక్రిప్ట్‌ చేయటానికి పాస్‌వర్డ్‌ లేదా ఎన్‌క్రిప్షన్‌ కీ ఉంటే తప్ప సందేశమేంటో తెలియదు. ఒకవేళ సైబర్‌ నేరగాళ్లకు ఎన్‌క్రిప్షన్‌ కీ చిక్కితే మాత్రం కష్టమే.


ఎన్నెన్నో ప్రయోజనాలు

  • స్నేహితుల మధ్య సందేశాలు కావొచ్చు, ఆర్థిక లావాదేవీలు కావొచ్చు. ఎలాంటి డేటా అయినా నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా పరికరాలు, సర్వర్ల మధ్య పంపిణీ అయ్యే డేటాను అథెంటికేషన్‌ వంటి భద్రత సదుపాయాలతో ఎన్‌క్రిప్షన్‌ విధానం కాపాడుతుంది.
  • అనధీకృత వ్యక్తులు మామూలు టెక్స్ట్‌ను చూడకుండా అడ్డుకుంటుంది. అలాగే మోసగాళ్లు నేరాలకు పాల్పడకుండా, డేటాను దుర్వినియోగం చేయకుండా నిలువరిస్తుంది.
  • రోజురోజుకీ క్లౌడ్‌ స్టోరేజీ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో డేటాను కాపాడటంలో ఎన్‌క్రిప్షన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. సర్వర్లో స్టోర్‌ అయినప్పుడే కాదు, దాన్ని వాడుకునే సమయంలోనూ భద్రంగా ఉంచుతుంది.

    ఎలా పనిచేస్తుంది?

ఎన్‌క్రిప్షన్‌ గొప్ప సాధనం. ఇది టెక్స్ట్‌ మెసేజ్‌, ఈమెయిల్‌ వంటి మామూలు టెక్స్ట్‌ను చదవటానికి వీల్లేని సంకేతలిపి రూపంలోకి మారుస్తుంది. కంప్యూటర్‌ వ్యవస్థల్లో నిల్వ ఉన్న లేదా ఇంటర్నెట్‌ వంటి నెట్‌వర్క్‌ ద్వారా పంపిణీ అయ్యే డిజిటల్‌ డేటా రహస్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఉద్దేశించినవారికి సందేశం అందిన తర్వాతే తిరిగి అసలు రూపంలోకి మారుతుంది. దీన్నే డీక్రిప్షన్‌ అంటారు. మెసేజ్‌ గుట్టు విప్పటానికి పంపినవారు, అందుకున్నవారు ఇద్దరూ సమాచారాన్ని సంకేతరూపంలోకి, తిరిగి దాన్ని మామూలు రూపంలోకి మార్చే ‘సీక్రేట్‌’ ఎన్‌క్రిప్షన్‌ కీ కలిగి ఉండాలి. అప్పుడే అందుకున్నవారు సమాచారాన్ని చదవగలుగుతారు.


నాలుగిందాలా..

ఎన్‌క్రిప్షన్‌ ప్రధానంగా నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది.

  • కాన్ఫిడెన్షియాలిటీ: డేటాలోని అంశాలను రహస్యంగా ఉంచుతుంది.
  • ఇంటిగ్రిటీ: మెసేజ్‌ లేదా డేటా మూలాన్ని ధ్రువీకరిస్తుంది.
  • అథెంటికేషన్‌: పంపించినప్పటి నుంచి డేటా లేదా మెసేజ్‌ అంశాలు మారలేదనే విషయాన్ని ధ్రువీకరిస్తుంది.
  • నాన్‌రెప్యుడియేషన్‌: తమ నుంచి డేటా లేదా మెసేజ్‌ వెళ్లలేదని వాటిని పంపించిన వారు అనకుండా నిరోధిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని