పంటికి నానోబోట్ల రక్ష

పంటి ఇన్‌ఫెక్షన్లను తగ్గించటానికి డాక్టర్లు తరచూ రూట్‌ కెనాల్‌ చికిత్స చేస్తుంటారు. దీని ద్వారా పంటి లోపల ఇన్‌ఫెక్షన్‌కు గురైన మెత్తటి కణజాలాన్ని తొలగిస్తుంటారు. ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియాను

Published : 18 May 2022 00:50 IST

పంటి ఇన్‌ఫెక్షన్లను తగ్గించటానికి డాక్టర్లు తరచూ రూట్‌ కెనాల్‌ చికిత్స చేస్తుంటారు. దీని ద్వారా పంటి లోపల ఇన్‌ఫెక్షన్‌కు గురైన మెత్తటి కణజాలాన్ని తొలగిస్తుంటారు. ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియాను నిర్మూలించటానికి పంటి లోపలికి యాంటీబయాటిక్స్, రసాయనాలను సూదితో పిచికారీ చేస్తుంటారు కూడా. అయితే అన్నిసార్లూ బ్యాక్టీరియా.. ముఖ్యంగా మందులను తట్టుకునేవి చనిపోకపోవచ్చు. ఇవి దంతం లోపల సన్నటి గొట్టాల్లో దాక్కొని, మళ్లీ మళ్లీ ఇన్‌ఫెక్షన్లు తెచ్చిపెడుతుంటాయి. దంతం లోపలి గొట్టాలు చాలా చాలా సన్నగా ఉండటం వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు వీటిల్లోని బ్యాక్టీరియాను చంపటంలో అంతగా సఫలం కావటం లేదు. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ), దీని అనుబంధ అంకురసంస్థ థెరానాటిలస్‌ వినూత్న నానో రోబోలను సృష్టించాయి. వీటిని ద్రవం ద్వారా పంటి గొట్టాల్లోకి ఇంజెక్ట్‌ చేయొచ్చు. సిలికాన్‌ డయాక్సైడ్‌తో తయారుచేసిన వీటి మీద ఐరన్‌ పొర ఉండటం వల్ల అయస్కాంత క్షేత్రాన్ని పుట్టించే పరికరంతో బయటి నుంచే కదలికలను నియంత్రించొచ్చు. అయస్కాంత క్షేత్రంతో నానో రోబోలను వేడి చేయొచ్చు కూడా. ఈ వేడికి చుట్టుపక్కల బ్యాక్టీరియా చనిపోతుంది. ఇంతకుముందు బ్యాక్టీరియా బయటకు వచ్చేలా చేయటానికి పిచికారీ చేసే ద్రవంలో శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్‌ లేదా లేజర్‌ ప్రచోదనాలతో షాక్‌ తరంగాలను సృష్టించేవారు. అయితే ఇవి 800 మైక్రోమీటర్ల దూరంలోకే చొచ్చుకుపోతాయి. త్వరగా క్షీణిస్తాయి కూడా. కొత్త నానో రోబోలైతే 2వేల మైక్రోమీటర్ల వరకూ చొచ్చుకుపోతాయి. వేడితోనే బ్యాక్టీరియాను చంపటం వల్ల రసాయనాలు, యాంటీబయాటిక్స్‌తో తలెత్తే దుష్ప్రభావాలేవీ ఉండవు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని