2021లో ఆన్‌లైన్ భద్రత.. ఏం చేయాలంటే..!

ఆన్‌లైన్‌ మోసాలు..అవగాహనా లోపంతో కొందరు..ఆశతో మరికొందరు వీటి బారిన పడుతున్నారు. కొవిడ్‌-19 పరిస్థితులతో బయటి వెళ్లలేకపోవడం..పిల్లల చదువులు, ఆఫీస్‌ వర్క్‌, షాపింగ్‌ ఇలా దాదాపు అన్ని అవసరాలకు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి...

Published : 06 Jan 2021 13:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవగాహనా లోపంతో కొందరు.. ఆశతో మరికొందరు ఆన్‌లైన్‌ మోసాల బారిన పడుతున్నారు. కొవిడ్‌-19 పరిస్థితులతో బయటికి వెళ్లలేకపోవడం.. పిల్లల చదువులు, ఆఫీస్‌ వర్క్‌, షాపింగ్‌ ఇలా దాదాపు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ వినియోగంపై అవగాహన లేమితో కొత్తగా ఉపయోగించేవాళ్లు ఎక్కువగా మోసాలకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత గోప్యత, భద్రతపై ప్రభుత్వాలు, పోలీస్‌ శాఖ తరచూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే కొత్త ఏడాదిలో ఆన్‌లైన్‌ భద్రత, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం.


ప్రొఫైల్ లాక్‌ చేయడమే మేలు

మనసులోని భావాలను అందరితో పంచుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఫేస్‌బుక్‌ ఖాతా కోసం నమోదు చేసిన వివరాలను సేకరించి కొందరు అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను లాక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు సైబర్‌ నిపుణులు. ఫేస్‌బుక్‌లో లొకేషన్‌ ట్రాకింగ్, ఆటోమేటిక్‌ ఫేస్‌ రికగ్నిషన్‌, యాడ్‌ టార్గెటింగ్‌ వంటి ఆప్షన్స్‌ని డిసేబుల్ చేసుకోవాలంటున్నారు. 


లాగిన్‌పై ఓ కన్నేయాలి

మీరు ఉపయోగించే ఈ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాలు ఎప్పుడు, ఎక్కడ, ఏయే డివైజ్‌లలో ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం మనకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. దాని సహాయంతో తరచుగా ఏయే డివైజ్‌లలో లాగిన్‌ అయ్యారనేది చెక్‌ చేస్తూ ఉండాలి. ఒకవేళ వాటిలో ఏవైనా పబ్లిక్‌ డొమైన్‌ డివైజ్‌లలో లాగిన్‌ అయినట్లు ఉంటే వెంటనే తొలగించాలి. 


టూ-స్టెప్ ఉండాల్సిందే

టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌.. వాట్సాప్, టెలిగ్రాం వంటి ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌లు ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. దీన్ని ఎనేబుల్‌ చేస్తే మీ ఖాతాను ఇతరులు హ్యాక్‌ చెయ్యకుండా అడ్డుకోవచ్చు. అంతేకాదు మీ ఫోన్‌ను దొంగిలించి సిమ్‌ మార్చి వాట్సాప్‌, టెలిగ్రాం ఉపయోగించాలని చూసినా వాళ్లు ఉపయోగించకుండా టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ అడ్డుకుంటుంది. 


యాడ్స్‌కి చెక్‌ పెట్టండిలా

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లలో మీ యాక్టివిటీ ఆధారంగా యాడ్‌లను ఇచ్చేందుకు పర్సనలైజ్‌ యాడ్స్‌ అనే ఫీచర్‌ ఉంటుంది. దాన్ని డిసేబుల్ చేస్తే మీ యాక్టివిటీని ట్రాక్‌ చేయలేరు. దాంతో మీకు ఎలాంటి యాడ్స్‌ కనిపించవు. ఇందుకోసం యూజర్స్‌ మొబైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీలో ట్రాకింగ్‌ ఆప్షన్ ఓపెన్‌ చేసి అందులో ‘అలో యాప్స్‌ టు రిక్వెస్ట్‌ టు ట్రాక్‌’ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి. పర్సనలైజ్‌ యాడ్స్‌ రాకుండా ఉండేందుకు ఐఓఎస్‌ యూజర్స్‌ అయితే ప్రైవసీలోకి వెళ్లి చివర యాపిల్ అడ్వర్‌టైజింగ్ అనే ఆప్షన్‌ని ఓపెన్‌ చేసి అందులో పర్సనలైజ్‌ యాడ్స్‌ ఆప్షన్‌ని డిసేబుల్ చేయాలి. ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ సెట్టింగ్స్‌లో అడిషనల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ ఓపెన్ చేసి అందులో చివర యాడ్ సర్వీసెస్‌పై క్లిక్‌ చేయాలి. అందులో పర్సనలైజ్‌ యాడ్ రికమండేషన్స్‌ అనే ఫీచర్‌ ఉంటుంది. దాన్ని డిసేబుల్ చేస్తే టార్గెట్‌ యాడ్స్‌ పంపలేరు. దాంతో పాటు తరచుగా యునిక్‌ ఐడీని మార్చుకుంటూ ఉండాలి.   


గూగుల్‌కి ప్రత్యామ్నాయం

ఆన్‌లైన్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం గూగుల్‌లో వెతుకుతాం. అలానే గూగుల్ సర్వీసెస్‌ ఈ-మెయిల్, మ్యాప్స్‌ వంటి ఇతర సేవలను కూడా అందిస్తుంది. అయితే ఇంటర్నెట్‌లో మీ యాక్టివిటీని ట్రాక్‌ చేయకుండా ఉండాలంటే గూగుల్‌పై ఆధారపడకపోవడమే మంచిదంటున్నారు సైబర్‌ నిపుణులు. దానికి బదులు అలాంటి సేవలనందించే ప్రత్యామ్నాయలపై దృష్టి సారించాలంటున్నారు. అలానే మీ ఈ-మెయిల్‌ లేదా ఇతర ఆన్‌లైన్‌ ఖాతాలు భద్రంగా ఉండాలంటే పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటున్నారు నిపుణులు. ఇందుకు పాస్‌వర్డ్ మేనేజర్స్‌ సహాయం తీసుకుంటే సరిపోతుంది. 


వాటిని ఓపెన్‌ చెయ్యొద్దు

లాటరీలో నగదు గెలిచారు.. లక్కీడ్రాలో బహుమతి పొందారు.. అంటూ వచ్చే ఈ-మెయిల్స్‌, ఎస్సెమ్మెస్‌ల జోలికి వెళ్లపోవడమే మంచిది. కొన్ని సార్లు వాటిని ఓపెన్‌ చేసిన వెంటనే మీ వ్యక్తిగత, బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఒకవేళ మీ మొబైల్‌ లేదా ఈ-మెయిల్‌ ఖాతాలకు అలాంటివి వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా డిలీట్ చేయమని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. 


ఎక్స్‌టెన్షన్స్‌ వద్దు

ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేసేప్పుడు సౌలభ్యంగా ఉండేందుకు కొన్ని రకాల ఎక్స్‌టెన్షన్స్‌ని ఉపయోగిస్తుంటాం. వాటిలో కొన్ని వెబ్‌ ట్రాకర్‌ని డిసేబుల్ చేసి ఎక్కువ యాడ్స్‌ని చూపిస్తాయి. అందుకే మనం ఉపయోగించే ఎక్స్‌టెన్షన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలి. ఇలా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. 


స్టేటస్‌ షో అక్కర్లేదు

సోషల్‌ మీడియాలో మనం యాక్టివ్‌లో ఉన్నామా లేదా అనేది ఇతరులు సులభంగా తెలుసుకోవచ్చు. మీ సోషల్ మీడియా ఖాతాలో ‘షో యాక్టివిటీ స్టేటస్‌’ ఆన్‌లో ఉంటే మీ గురించి తెలుస్తుంది. అలా మీ గురించి ఇతరులకు తెలియకుండా ఉండాలంటే ఆ ఫీచర్‌ని డిసేబుల్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇన్‌స్టాగ్రాం సెట్టింగ్స్‌లో ప్రైవసీలోకి వెళితే షో యాక్టివిటీ స్టేటస్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి డిసేబుల్‌ చేస్తే సరిపోతుంది. 

ఇవీ చదవండి..

ఈ ఏడాది సందడి చేయనున్న స్మార్ట్‌ఫోన్లివే..

గూగుల్ కొత్త పాలసీ..ఏం చేయాలో తెలుసా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని