ఇన్‌స్టాలో బగ్‌ పట్టాడు.. ₹22 లక్షలు కొట్టాడు!

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేయడం అంత శ్రేయస్కరం కాదని ఇటీవలి ఉదంతాలు చాటుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రొఫైల్‌ లాక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి సామాజిక మాధ్యమాలు..

Updated : 16 Jun 2021 17:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేయడం అంత శ్రేయస్కరం కాదని ఇటీవలి ఉదంతాలు చాటుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రొఫైల్‌ లాక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి సామాజిక మాధ్యమాలు. అయినా వాటిలోని చిన్న చిన్న బగ్స్‌ సైబర్‌ నేరగాళ్ల పాలిట వరంలా మారుతున్నాయి. అలాంటి ఓ బగ్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాడు ఓ 21 ఏళ్ల యువకుడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు ఖాతాలను ఫాలో అవ్వకుండానే వారి ఫొటోలు, వివరాలు తస్కరించి బ్లాక్‌ మెయిల్‌ చేయడం, వేధింపులకు పాల్పడడం వంటి నేరాలకు వీలు కల్పించేలా ఈ బగ్‌ ఉపయోగపడుతుందని గుర్తించాడు. దీంతో ఇన్‌స్టా మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి ఏకంగా ₹22 లక్షలు అందుకున్నాడు.

సోలాపూర్‌కు చెందిన మయూర్‌ ఫర్తడే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ లోపాన్ని కనుగొన్నాడు. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మయూర్‌.. ఇన్‌స్టాలో సైబర్‌ నేరగాళ్లు ఎలా అవతలి వ్యక్తుల పోస్టులను చూడగలరో పేర్కొన్నాడు. ఈ బగ్‌ ద్వారా  ప్రైవేట్‌ ఇన్‌స్టా ఖాతాల ఫొటోలు, ఆర్కివ్డ్‌ పోస్టులు, స్టోరీలు, రీల్స్‌ తదితర వివరాలను పొందేందుకు అవకాశం ఉందని గుర్తించాడు. వ్యక్తుల పోస్టుకు సంబంధించిన మీడియా ఐడీ ద్వారా ఈ వివరాలను పొందొచ్చని కనుగొన్నాడు. మీడియా ఐడీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన డెవలపర్‌ లైబ్రరీలోని గ్రాఫ్‌క్యూఎల్‌ అనే టూల్‌ను ఉపయోగించి బ్రూట్‌ ఫోర్స్‌డ్‌ మీడియా ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా సదరు పోస్ట్‌ తాలూకా లింక్‌, పోస్ట్‌ వివరాలు పొందొచ్చన్న విషయాన్ని గుర్తించాడు. 

ఇదే విషయాన్ని ఏప్రిల్ 16న ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకెళ్లాడు మయూర్‌. అందుకు ఏప్రిల్‌ 19న బదులిచ్చిన ఫేస్‌బుక్‌... ఆ లోపాన్ని సవరించుకుంది. ప్రమాదకరమైన బగ్‌ను కనుగొన్నందుకు గానూ జూన్‌ 15న ₹22 లక్షలను మయూర్‌కు అందజేసింది. బగ్‌ను కనుగొన్నందుకు గానూ ధన్యవాదాలు చెప్పడమే కాకుండా.. భవిష్యత్‌లోనూ ఇలాంటి లోపాలుంటే గుర్తించి పంపించాలని కోరుతూ లేఖ రాసింది. మరోవైపు తన బగ్‌ బౌంటీని ఇకపైనా కొనసాగిస్తానని చెప్తున్నాడు మయూర్‌. అయితే, దాన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగంగా భావిస్తానని, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అవ్వాలన్నదే తన లక్ష్యమన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని