క్రోమ్‌లో లైవ్‌ క్యాప్షన్లు

సిస్టంలో వీడియో, ఆడియో ఫైళ్లను ప్లే చేసుకుని చూస్తాం, వింటాం. కానీ, అదే మీడియా ఫైల్స్‌లో ఆడియోని టెక్స్ట్‌ రూపంలో...

Published : 21 Mar 2021 10:47 IST

వీడియో, ఆడియో.. ప్లే చేస్తే చాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సిస్టంలో వీడియో, ఆడియో ఫైళ్లను ప్లే చేసుకుని చూస్తాం. వింటాం. కానీ, అదే మీడియా ఫైల్స్‌లో ఆడియోని టెక్స్ట్‌ రూపంలో ఎప్పుడైనా చూశారా? ఎందుకు చూడలేదు.. సబ్‌టైటిల్స్‌ వస్తున్నాయ్‌గా అనుకుంటాం అందరం. కానీ, సబ్‌టైటిల్స్‌ ఆయా మీడియా ఫైల్స్‌కి ప్రీ-యాడెడ్‌గా ఉంటాయి. ఒకవేళ అలా లేకుంటే? అంటే.. ఉదాహరణకు ఓ ముఖ్యమైన వ్యక్తి మాట్లాడుతున్న ఉపన్యాసం యూట్యూబ్‌లో ఉంది. దాన్ని వీక్షించే సమయంలో మాట్లాడుతున్న వ్యక్తి ప్రసంగాన్ని లైవ్‌ క్యాప్షన్స్‌లో చదువుకుందాం అనుకుంటే? ఇప్పటికైతే ఆ సౌలభ్యం లేదుగానీ.. ఇకపై క్రోమ్‌ యూజర్లు లైవ్‌ క్యాప్షన్స్‌ని పెట్టుకోవచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌లో అందుకు కావాల్సిన ఆప్షన్‌ని గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది. ఎప్పుడో 2019లోనే పిక్సల్‌ ఫోన్‌ల్లోనే ఈ ఫీచర్‌ని గూగుల్‌ ప్రవేశపెట్టింది. తర్వాత కొన్ని శాంసంగ్, వన్‌ప్లస్‌ ఫోన్‌ల్లోనూ గత ఏడాది లైవ్‌ క్యాప్షన్లను పరిచయం చేసింది. అప్పుడు పీసీ యూజర్లు ఈ సదుపాయాన్ని వాడుకునేలా క్రోమ్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో అందిస్తోంది. దీన్ని ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలో చూద్దాం..

అప్‌డేట్‌ చేయాలి..

లైవ్‌ క్యాప్షన్స్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ అవ్వాలంటే ముందు.. మీరు వాడుతున్న బ్రౌజర్‌ కొత్త వెర్షన్‌కి (89.0.4389.90) అప్‌డేట్‌ అయ్యిందో లేదో చెక్‌ చేసుకోవాలి. అందుకు మీరు ఏం చేయాలంటే.. క్రోమ్‌లోని ‘అబౌట్‌ క్రోమ్‌’లోకి వెళ్లి చూడండి. అక్కడ ఒకవేళ పాత వెర్షన్‌లోనే బ్రౌజర్‌ ఉంటే వెంటనే అప్‌డేట్‌‌ చేసి, బ్రౌజర్‌ని రీలాంచ్‌ చేయండి. కొత్త వెర్షన్‌కి అప్‌డేట్‌ అవుతుంది. ఇప్పుడు లైవ్‌ క్యాప్షన్స్‌ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేయాలి. అందుకు.. బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోని ‘అడ్వాన్స్‌’ విభాగాన్ని చూడండి. దాంట్లో యాక్సెసబిలిటీ సెక్షన్‌లోకి వెళ్తే క్యాప్షన్‌ టాగిల్‌ కనిపిస్తుంది. డీఫాల్ట్‌గా డిసేబుల్‌గా ఉన్న ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయాలి. అంతే.. ఇకపై మీరే మీడియా ఫైల్‌ ఓపెన్‌ చేసినా లైవ్‌ క్యాప్షన్స్‌ని చూడొచ్చు.

ప్రత్యేక బాక్స్‌లో కనిపిస్తాయి..

యూట్యూబ్‌ లేదా మరేదైనా పాడ్‌క్యాస్ట్‌ సర్వీసు ఓపెన్‌ చేయండి. మీరు ఎంపిక చేసుకున్న మీడియా ఫైల్‌ని ఓపెన్‌ చేస్తే చాలు. క్రోమ్‌లో ఆటోమాటిక్‌గా క్యాప్షన్స్‌ ప్రారంభం అవుతాయి. బ్రౌజర్‌ కింది భాగంగా డీఫాల్ట్‌గా కనిపిస్తాయి. కావాలంటే మీరు వాటిని తెరపై ఎక్కడికైనా జరుపుకోవచ్చు. ఉదాహరణకు మీరు గూగుల్‌ పాడ్‌క్యాస్ట్‌లో ఏదైనా ఆడియో ఫైల్‌ని ఓపెన్‌ చేయండి. వెంటనే కింద క్యాప్షన్స్‌ ప్లే అవ్వడం చూస్తారు. క్యాప్షన్స్‌ విండో కనిపించే ‘డౌన్‌ యారో’ని సెలెక్ట్‌ చేస్తే.. బాక్స్‌ పరిమాణం పెరుగుతుంది. దీంతో క్యాప్షన్స్‌ అన్నీ పేరాగ్రాఫ్‌గా కనిపిస్తాయి. వ్యాసం మాదిరిగా చదువుకోవచ్చు. ఒకవేళ క్యాప్షన్స్‌ వద్దు అనుకుంటే క్లోజ్‌ బటన్‌ని సెలెక్ట్‌ చేయాలి. క్రోమ్‌ అందించే మీడియా కంట్రోల్స్‌ నుంచి కూడా క్యాప్షన్స్‌ని ఎనేబుల్, డిసేబుల్‌ చేయొచ్చు. ముఖ్యంగా ఈ క్యాప్షన్స్‌ ఫీచర్‌ వినికిడి సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయుక్తం. నెట్టింట్లో మీడియా కంటెంట్‌ని వీక్షించే క్రమంలో క్యాప్షన్స్‌ ద్వారా టెక్స్ట్‌ చదువుకోవచ్చు అన్నమాట! అంతేకాదు.. ఆడియో వినేందుకు వీలు లేని సందర్భాల్లో ఇలా క్యాప్షన్స్‌ పెట్టుకోవడం చక్కని సౌలభ్యమేగా!! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని