Facebook: ఈ యాప్‌లతో జాగ్రత్త సుమా.. ఫేస్‌బుక్‌ యూజర్లకు మెటా కీలక సూచన

మాల్‌వేర్ యాప్‌లతో యాజర్లు అప్రమత్తంగా ఉండాలని ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సూచించింది. యాప్‌ స్టోర్‌, ప్లేస్టోర్‌లోని సుమారు 400కు పైగా యాప్‌లలో మాల్‌వేర్‌ను గుర్తించినట్లు తెలిపింది. 

Updated : 10 Oct 2022 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మాల్‌వేర్‌ యాప్స్‌ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని మెటా సంస్థ హెచ్చరించింది.  గూగుల్‌ ప్టేస్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌లోని సుమారు 400 పైగా యాప్స్‌లో మాల్‌వేర్‌ గుర్తించినట్లు తెలిపింది. వీటిద్వారా సుమారు ఒక మిలియన్‌ ఫేస్‌బుక్ యూజర్ల లాగిన్‌ వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కినట్లు తన నివేదికలో పేర్కొంది. ఈ యాప్స్‌ యూజర్ల ఫేస్‌బుక్‌ ఖాతాల వివరాలతోపాటు, ఇతర ఆన్‌లైన్‌ ఖాతాలకు సంబంధించిన లాగిన్‌ వివరాలను సేకరిస్తున్నాయని మెటా ఆరోపించింది. ఫొటో ఎడిటింగ్‌, గేమింగ్‌, వీపీఎన్‌ సర్వీస్‌, ఫ్లాష్‌లైట్, బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌, హెల్త్‌, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.   ఈ యాప్‌లను యాప్‌స్టోర్‌, ప్లేస్టోర్‌ నుంచి తొలగించమని యాపిల్‌, గూగుల్‌ సంస్థలను కోరినట్లు మెటా తెలిపింది. యూజర్లు కూడా తమ డివైజ్‌ల నుంచి వీటిని వెంటనే తొలగించాలని సూచించింది. 


ఇలా ఏమారుస్తారు

‘‘మాల్‌వేర్‌ యాప్‌లపట్ల యూజర్లు ఆకర్షితులయ్యేందుకు సైబర్‌ నేరగాళ్లు వాటిని  కార్టూన్‌ ఇమేజ్‌ ఎడిటర్లు, మ్యూజిక్‌ ప్లేయర్, గేమింగ్‌ గ్రాఫిక్స్‌ యాప్‌లుగా డిజైన్ చేస్తారు. యూజర్లు వాటిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత  వారి డివైజ్‌లలోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెడతారు.  తర్వాత ప్రకటనలో పేర్కొన్నట్లు అదనపు ఫీచర్లు కావాలంటే ఫేస్‌బుక్‌ ఐడీతో లాగిన్‌ చేయమని యూజర్లకు సూచిస్తాయి. లాగిన్‌ వివరాలను నమోదు చేసిన వెంటనే సైబర్‌నేరగాళ్లు వాటిని సేకరిస్తారు. వాటితో యూజర్‌ ఖాతాను పూర్తి నియంత్రణలోకి తీసుకుని ఫ్రెండ్స్‌ జాబితాలోని వారికి నకిలీ మెసేజ్‌లు పంపుతారు. ఒకవేళ యూజర్‌ వాటిలోని లోపాన్ని గుర్తించి రివ్యూలో పేర్కొంటే, నకిలీ రివ్యూలతో ఇతర యూజర్లను ఏమారుస్తున్నట్లు గుర్తించాం’’ అని మెటా సంస్థ తన నివేదికలో పేర్కొంది. 


ఈ జాగ్రత్తలు పాటించాలి

మాల్‌వేర్‌ యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కుండా ఉండేందుకు మెటా కొన్ని సూచనలు చేసింది. అవేంటో చూద్దాం...

* యూజర్లు కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేసేముందు వాటిని ఎంతమంది డౌన్‌లోడ్ చేశారు? రేటింగ్‌, రివ్యూ వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలి. 

* యాప్‌ డౌన్‌లోడ్ చేశాక, ప్రకటనలో పేర్కొన్న అదనపు ఫీచర్లను లాగిన్‌ అవసరంలేకుండా ఇస్తుందా? లేదా? అనేది సరిచూసుకోవాలి. ఏదైనా యాప్‌ ఫేస్‌బుక్‌ ఐడీతో లాగిన్ కోరితే సదరు యాప్‌ను ఉపయోగించకపోవడం మేలు. 

* ఒకవేళ మాల్‌వేర్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నామనే అనుమానం కలిగితే, వెంటనే యాప్‌ను డిలీట్ చేయాలి. ఫేస్‌బుక్‌ ఐడీతో లాగిన్‌ అయితే, పాస్‌వర్డ్‌ను మార్చి, టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఎనేబుల్ చేయమని మెటా సూచిస్తోంది.    

మాల్‌వేర్‌ యాప్‌ల జాబితా... 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని