సోషల్‌ ఖాతా హ్యాక్‌ అయితే?

ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి

Updated : 24 Jan 2024 04:52 IST

ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వినోద, విజ్ఞానాల కోసమూ ఎంతోమంది వీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే సామాజిక మాధ్యమ ఖాతాల హ్యాకింగ్‌ ఇటీవల పెరగటం కలకలం సృష్టిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా చాలామంది దీనికి గురవుతున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు చెందినవే కాదు.. మామూలు వ్యక్తుల ఖాతాలనూ డేటా చోరులు హ్యాక్‌ చేస్తున్నారు. స్పామింగ్‌ బాట్స్‌ కూడా వీరికి తోడవుతున్నాయి. మరి సామాజిక మాధ్యమ ఖాతా హ్యాకింగ్‌కు గురైతే ఏం చెయ్యాలి? అసలు దీన్నుంచి ఎలా కాపాడుకోవాలి?

అన్ని పరికరాల్లోంచి సైన్‌ అవుట్‌

 సామాజిక మాధ్యమ ఖాతాను ఎవరో తమ చేతుల్లోకి తీసుకొని, అసంబద్ధ విషయాలన్నీ పోస్ట్‌ చేస్తుంటే ఎవరికైనా మనసు కలుక్కుమంటుంది. ఇలాంటి సమయంలో ముందుగా చేయాల్సింది అన్ని పరికరాల్లోనూ ఆ ఖాతా నుంచి సైన్‌ అవుట్‌ కావటం. ఆటోమేటిక్‌ సైన్‌ ఇన్స్‌తో హ్యాక్‌ చేసేవారి ఆటను దీంతో చాలావరకు కట్టించొచ్చు. పాస్‌వర్డ్‌లు అందుబాటులో లేకపోవటం వల్ల హ్యాకర్లు తిరిగి లాగిన్‌ కాలేరు.

 పాస్‌వర్డ్‌ మార్చుకోవాలి

సైన్‌ అవుట్‌ అయ్యాక ఒక పరికరం ద్వారా ఖాతాలోకి లాగిన్‌ కావాలి. అకౌంట్‌ లేదా సెటింగ్స్‌ పేజీలోకి వెళ్లి పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి. హ్యాకర్లు మన పాస్‌వర్డ్‌ను దొంగిలించి ఉన్నట్టయితే ఇది కాపాడుతుంది. పాస్‌వర్డ్‌ను మార్చుకోవటం వల్ల వాళ్లు తిరిగి ఖాతాలోకి చొరపడటం సాధ్యం కాదు. కొందరు ఒకే పాస్‌వర్డ్‌ను ఇతరత్రా చాలా ఖాతాలకూ వాడుతుంటారు. ఒకవేళ ఇలాంటి పని చేస్తున్నట్టయితే ఇతర ఖాతాల సెటింగ్స్‌లోకి విధిగా పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి. ఎందుకంటే హ్యాకర్లు  దొంగిలించిన పాస్‌వర్డ్‌తో ఇతరత్రా ఖాతాలనూ హ్యాక్‌ చేయటానికి ప్రయత్నించొచ్చు. పాస్‌వర్డ్‌ మార్చుకుంటే ఇలాంటి ముప్పును తప్పించుకోవచ్చు. ఈసారి మరింత కఠినమైన పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకుంటే భద్రంగా ఉండొచ్చు.

రిపోర్టు చేయాలి

కొన్నిసార్లు హ్యాకర్లు మన పాస్‌వర్డ్‌ను మార్చేయొచ్చు. దీంతో మనం లాగిన్‌ కావటానికి అవకాశముండదు. అప్పుడు ఫర్‌గాట్‌ మై పాస్‌వర్డ్‌ ఆప్షన్‌తో ప్రయత్నించొచ్చు. ఇదీ పనిచేయకపోతే వీలైనంత త్వరగా సోషల్‌ మీడియా సంస్థకు రిపోర్టు చేయాలి. దీంతో హ్యాక్‌ అయిన మెసేజ్‌లు వెనక్కి వచ్చేలా చూసుకోవచ్చు. అంతా సురక్షితంగా ఉందని భావించేంతవరకు ఖాతాను స్తంభింపజేయొచ్చు. హ్యాకింగ్‌ను రిపోర్టు చేయటానికి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పేజీలున్నాయి.

కాంటాక్టులకు తెలియజేయాలి

ఖాతా హ్యాక్‌ అయిన విషయాన్ని మిత్రులు, బంధువులు, తెలిసినవారందరికీ తెలియజేయాలి. మనం పంపినట్టుగా స్పామ్‌ మెసేజ్‌లు, లింకులు అందొచ్చని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని క్లిక్‌ చేయొద్దని హెచ్చరించాలి. పరిస్థితులన్నీ కుదురుకున్నాక ఆ విషయాన్ని వారికి తిరిగి తెలియజేయాలి.

ఎలా కాపాడుకోవాలి?

ఖాతా హ్యాక్‌ అయ్యాక చింతించటం కన్నా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
కఠిన పాస్‌వర్డ్‌లు: పొడవైన, సంక్లిష్టమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ సురక్షితం. కాబట్టి అక్షరాలు, అంకెలు, చిహ్నాలతో కూడిన కఠినమైన పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకోవాలి. ఇందులో కనీసం 12 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి. అన్నింటికీ ఒకటే కాకుండా వేర్వేరు ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవటానికి, వాటిని స్టోర్‌ చేయటానికి పాస్‌వర్డ్‌ మేనేజర్లను వాడుకోవాలి.
ఎంఎఫ్‌ఏ: వీలైతే మల్టీఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌(ఎంఎఫ్‌ఏ)కు మారాలి. వేలిముద్ర వంటి బయోమెట్రిక్స్‌, సెక్యూరిటీ కీ, టెక్స్ట్‌ మెసేజ్‌లతో కూడిన ఇది 2ఎఫ్‌ఏ కన్నా మరింత ఎక్కువ భద్రత కల్పిస్తుంది. హ్యాకర్లకు పాస్‌వర్డ్‌ తెలిసినా ఖాతాలోకి ప్రవేశించలేరు.
తెలియని లింకులు క్లిక్‌ చేయొద్దు: ఈమెయిల్‌కు, ఫోన్లకు అందే మెసేజ్‌ల్లోని లింకులను క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా వెంటనే క్లిక్‌ చేయాలనే, భయపెట్టే లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెసేజ్‌లను క్షుణ్ణంగా చదివి, వాటిని ఎవరు పంపించారో తెలుసుకోవాలి. దీంతో ఫిషింగ్‌ లింకుల వలలో పడకుండా చూసుకోవచ్చు.
అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు: యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటే సురక్షితంగా ఉండొచ్చు. అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేసుకోవటం అన్నింటికన్నా తేలికైన, మంచి మార్గమని గుర్తుంచుకోవాలి. ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకుంటే మన ప్రమేయం లేకుండా వాటికవే అప్‌డేట్‌ అవుతాయి. మరచిపోతామన్న దిగులుండదు.

అనూహ్య మార్పుల తనిఖీ

సోషల్‌ మీడియా ఖాతాలో అనూహ్య మార్పులేవైనా జరిగాయేమో తనిఖీ చేయాలి. అకౌంట్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి విచిత్రమైన వ్యాపార వివరాలేవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. నకిలీ మెసేజ్‌లు, పోస్టులుంటే డిలీట్‌ చేయాలి. తేలికగా హ్యాక్‌ చేయటానికి నేరగాళ్లు వారి పరికరాలను జోడిస్తుంటారు మరి. అలాంటివి కనిపిస్తే వెంటనే తొలగించాలి. ఖాతా హ్యాక్‌ అయినప్పుడు ట్రాక్‌ చేయటానికి, డేటాను దొంగిలించటానికి కొత్త యాప్‌లనూ యాడ్‌ చేస్తుండొచ్చు. వీటిని డిలీట్‌ చేయాలి. ప్రొఫైల్‌ ఫొటోను సరిచూసుకోవాలి.

టూఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌

ఖాతాకు విధిగా టూఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ) పెట్టుకోవాలి. దీంతో ఖాతాలోకి లాగిన్‌ అయ్యేటప్పుడు మనల్ని ధ్రువీకరించుకోవటానికి ఈమెయిల్‌, ఫోన్‌కు ఆరు అంకెల కోడ్‌ వస్తుంది. దీన్ని ఎంటర్‌ చేస్తేనే ఖాతాలోకి లాగిన్‌ కావటానికి వీలవుతుంది. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇతరులకు తెలిసినా మన ఖాతాలోకి లాగిన్‌ కాలేరు.


హ్యాక్‌ లక్షణాలు ఇవీ..

  •  మనం సృష్టించని పోస్ట్‌లు పబ్లిష్‌ కావొచ్చు. డైరెక్ట్‌ మెసేజ్‌లూ వెళ్తుండొచ్చు. వీటితో హ్యాకర్లు మన ఫాలోయర్లకు ఫిషింగ్‌ డీఎంలు, పోస్టులు పెడుతుంటారు. చాలావరకూ ఫాలోయర్లను లింకులు క్లిక్‌ చేయాలని కోరుతుంటారు. యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాలని చెబుతుంటారు.
  •  మనది కాని ఈమెయిల్‌ ఐడీ, సోషల్‌ మీడియా డీఎం నుంచి ఈమెయిళ్లు, మెసేజ్‌లు వస్తున్నాయని స్నేహితులు, సన్నిహితులు, ఫాలోయర్లు చెప్పటం మరో లక్షణం.
  •  డేటా ఉల్లంఘన ద్వారా మన సమాచారం పోయిందని ఏదైనా కంపెనీ చెప్పటమూ ఖాతా హ్యాక్‌ అయ్యిందనటానికి సంకేతం కావొచ్చు. ఒకవేళ సైబర్‌ దాడి, డేటా ఉల్లంఘన జరిగి, మన సమాచారం పోయినట్టయితే కంపెనీలు ఆ విషయాన్ని చట్టబద్ధంగా తెలియజేస్తుంటాయి. ప్రపంచంలోని చాలాదేశాల్లో దీన్ని పాటిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని