యూట్యూబ్‌ వీడియో ఆడియోగా మారితే

యూట్యూబ్‌ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్‌ చేసుకుంటే ఇది సాధ్యమే

Updated : 07 Feb 2024 10:51 IST

యూట్యూబ్‌ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్‌ చేసుకుంటే ఇది సాధ్యమే. ఇందుకోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్లు ఉన్నాయి. ఇవి వీడియోల్లోంచి ఆడియోను వేరు చేసి ఎంపీ3 ఫైళ్లుగా మార్చేస్తాయి. వీటిని ఆఫ్‌లైన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా వినొచ్చు. వీడియోను ఆడియోగా మార్చే కొన్ని వెబ్‌సైట్లు ఇవీ..

 డిర్పీ(https://dirpy.com)

 యూట్యూబ్‌లో వీడియోను ఓపెన్‌ చేసి, దాని యూఆర్‌ఎల్‌ను కాపీ చేయాలి. డిర్పీ వెబ్‌సైట్‌లోకి వచ్చి ఎంటర్‌ వీడియో యూఆర్‌ఎల్‌ ఆర్‌ సెర్చ్‌ టర్మ్‌ అని రాసి ఉన్న బాక్సులో పేస్ట్‌ చేయాలి. అనంతరం పక్కనున్న డిర్పీ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు ఆ ఫైలుకు సంబంధించిన పేరు, వ్యవధి, ఐడీ3 ట్యాగ్‌ వంటి వివరాలు కనిపిస్తాయి. కుడివైపున కనిపించే రికార్డ్‌ ఆడియో విభాగంలోకి వెళ్లి ఎంపీ3 ఫార్మాట్‌ను సెట్‌ చేసుకోవాలి. క్వాలిటీని ఎంచుకొని రికార్డ్‌ ఆడియో బటన్‌ను క్లిక్‌ చేయగానే కంప్యూటర్‌లో ఎంపీ3 ఫైలును సేవ్‌ చేసుకోవాలనే ఆప్షన్‌ కనిపిస్తుంది.                                                                                                                                                                                                                                                                                  ఎస్ థింకమ్  (https://www.acethinker.com/youtube-mp3-download)                                             

వివిధ సాఫ్ట్‌వేర్‌ సాధనాలతో కూడిన ఏస్‌థింకర్‌ వెబ్‌సైట్‌లో యూట్యూబ్‌ కన్వర్షన్‌ టూల్‌ కూడా ఉంది. యూట్యూబ్‌ లింక్‌ను సెర్చ్‌ బాక్స్‌లో పేస్ట్‌ చేసి, డౌన్‌లోడ్‌ బటన్‌ను నొక్కితే ఆ పాట పేరు కనిపిస్తుంది. కింద ఉండే డౌన్‌లోడ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేసి సేవ్‌ చేసుకుంటే సరి. డిఫాల్ట్‌గా ఫైల్‌ 128కే క్వాలిటీలో సేవ్‌ అవుతుంది. కావాలంటే హయ్యర్‌ క్వాలిటీని ఎంచుకోవచ్చు.

4కే యూట్యూబ్‌ టు ఎంపీ3 (https://www.4kdownload.com/products/youtubetomp3-72)   

పీసీలోనే యూట్యూబ్‌ కన్వర్షన్‌ ప్రోగ్రామ్‌ కావాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. విండోస్‌, మ్యాక్‌ రెండింటిలోనూ పనిచేస్తుంది. ఉచిత వర్షన్‌ అయితే రోజుకు 15 కన్వర్షన్లను అనుమతిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఫైళ్లను మార్చుకోవాలనుకుంటే పెయిడ్‌ సేవలను తీసుకోవాలి. ఇది చాలా తేలికగా, త్వరగా యూట్యూబ్‌ వీడియోలను ఆడియోగా మార్చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ హోం స్క్రీన్‌లో వీడియో యూఆర్‌ఎల్‌ను పేస్ట్‌ చేస్తే చాలు. దానంతటదే కన్వర్షన్‌ ఆరంభిస్తుంది. ఆ ఫైల్‌ పరికరంలోని మ్యూజిక్‌ ఫోల్డర్‌లో సిద్ధంగా ఉన్న 4కే యూట్యూబ్‌ టు ఎంపీ3 ఫోల్డర్‌లో సేవ్‌ అవుతుంది. దీన్ని ఈ సాఫ్ట్‌వేర్‌తోనే నేరుగా వినొచ్చు. లేదూ పీసీలోని విండోస్‌ ప్లేయర్‌, వీఎల్‌సీ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారానైనా వినొచ్చు.
జాగ్రత్త సుమా: ఆన్‌లైన్‌లో వీడియోలను మార్చే వెబ్‌సైట్ల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. కొన్నిసార్లు ఇవి సరిగా పనిచేయకపోవచ్చు. పరికరంలోకి మాల్వేర్‌ను జొప్పించే ప్రయత్నం చేయొచ్చు. మొదట్లో వెబ్‌సైట్‌ బాగానే ఉన్నా మున్ముందు హానికరంగా పరిణమించొచ్చు. వీడియోలను ఆడియోలుగా మార్చుకోవటానికి ముందు ఇలాంటి ప్రమాదాలనూ పరిగణనలోకి తీసుకొని చూడాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని