జిల్లాల్లోనూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు

సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ పోలీసులు కొత్త సంవత్సరంలో మరో ముందడుగు వేయనున్నారు. ఫుటేజీల విశ్లేషణకు జిల్లాలవారీగా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే చాలావరకు పోలీస్‌ స్టేషన్ల

Published : 18 Jan 2022 04:14 IST

యూనిట్లవారీగా సీసీ కెమెరాల అనుసంధానం
భవిష్యత్తులో బంజారాహిల్స్‌ జంట టవర్ల కేంద్రంలో విశ్లేషణ

ఈనాడు, హైదరాబాద్‌: సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ పోలీసులు కొత్త సంవత్సరంలో మరో ముందడుగు వేయనున్నారు. ఫుటేజీల విశ్లేషణకు జిల్లాలవారీగా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే చాలావరకు పోలీస్‌ స్టేషన్ల వారీగా కెమెరాల్ని అనుసంధానించారు. వాటిని డీఎస్పీ కార్యాలయాలు.. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఒక యూనిట్‌లో చోటుచేసుకున్న ఘటనల దృశ్యాలను ఠాణాలోనే కాకుండా ఎస్పీ కార్యాలయంలోనూ ఉన్నతాధికారులు వీక్షించవచ్చు. ఇప్పటికే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 6 లక్షల కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా కమిషనరేట్ల వారీగానే కాకుండా.. సైబరాబాద్‌లోని భారీ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికీ వీటిని అనుసంధానం చేశారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న జంట పోలీస్‌ టవర్లలో ఏర్పాటవుతున్న భారీ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికీ అనుసంధానం చేయనున్నారు. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట కమిషనరేట్లలోనూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలకు సీసీ కెమెరాల అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా కమిషనరేట్ల పరిధిలో నగరాల్లో ఉన్నవి ఇప్పటికే అనుసంధానించగా.. గ్రామీణ ప్రాంతాల్లోనివీ అనుసంధానిస్తున్నారు.

అందుబాటులోకి 8.5 లక్షల కెమెరాలు

రాష్ట్రవ్యాప్తంగా 2021 ఆఖరు నాటికి 8,51,644 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వపరంగా ప్రధాన రహదారులతో పాటు ముఖ్య కూడళ్లలో.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రైవేటు సంస్థలు, కాలనీ సంఘాల సహకారంతోనూ ఏర్పాటు చేయిస్తున్నారు. వీటి ఆధారంగా ఇప్పటివరకు 22,781 కేసుల్ని ఛేదించినట్లు పోలీస్‌శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కెమెరాలు ఏర్పాటు చేసి.. జంట పోలీస్‌ టవర్లలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానించనున్నారు. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో ఏ సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలనైనా ఈ కేంద్రం నుంచి విశ్లేషించేందుకు వీలు కలుగుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని