
ఫెమా నిబంధనల ఉల్లంఘన.. రూ.3.19 కోట్ల ఆస్తుల జప్తు
అమెరికాకు రూ.52.47 కోట్లు మళ్లించిన వ్యవహారం
విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు
ఈనాడు, హైదరాబాద్: విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల్ని ఉల్లంఘించిన వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన 3కె టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఆస్తుల్ని ఈడీ గురువారం జప్తు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని రూ.3.19 కోట్ల విలువైన 15 స్థిరాస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ సంస్థ ప్రతినిధులు కరుసాల వెంకటసుబ్బారావు, తేజేష్ కె.కొడాలి, కడియాల వెంకటేశ్వరరావుకు చెందినవి. 2010లో ఈ సంస్థ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు భారీగా జరిగినట్లు విశాఖపట్నం ప్రత్యేక ఆర్థికమండలి కమిషనర్ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అమెరికాలో 2007 ఫిబ్రవరి 23న 3కె టెక్నాలజీస్ పేరిట ఓ సంస్థ ప్రారంభమైనట్లు గుర్తించింది. హైదరాబాద్‌లోని 3కె టెక్నాలజీస్ లిమిటెడ్ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నెపంతో దాదాపు రూ.52.47 కోట్ల మేర నిధుల్ని అమెరికాలోని సంస్థకు మళ్లినట్లు ఆధారాలు సేకరించింది. పలు విడతలుగా నిధుల మళ్లింపు పూర్తయిన మూడు నెలలకే 2011 జనవరి 28న అమెరికాలో సంస్థను మూసేసినట్లు వెల్లడైంది. ఈ లావాదేవీలపై అటు అమెరికాలో ఎలాంటి షేర్లు జారీ కాకపోగా.. ఇటు ఆర్‌బీఐలోనూ ఎలాంటి వార్షిక నివేదికలు నమోదు కాలేదని తేలింది. ఈ లావాదేవీల అనంతరం వెంకటసుబ్బారావు, తేజేష్, వెంకటేశ్వరరావు అమెరికాకు వెళ్లి అక్కడే నివాసం ఏర్పరచుకున్నట్లు వెల్లడైంది. నిందితులకు ఎన్నిసార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఫలితం లేకపోయింది. న్యూజెర్సీలో ఎఫ్‌బీఐ ఇటీవలే తేజేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఈడీ సమాచారం సేకరించింది. మోసపూరితంగా అమెరికా ఇమిగ్రేషన్ హోదా చూపి అక్కడ పని పొందడంతోపాటు విద్యార్థి వీసా మోసం కేసులో అయిదేళ్ల జైలుశిక్ష, రూ.2.5 లక్షల అమెరికా డాలర్ల జరిమానాకు గురైనట్లు తెలుసుకుంది. ఈ క్రమంలో తాజాగా నిందితుల ఆస్తుల్ని జప్తు చేసింది.