‘స్లాబ్‌’ లేకుంటే ఫీజుల మోతే!

ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల పెంపు ఏటా 10 శాతం మించరాదని మంత్రుల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో స్లాబ్‌ విధానం లేకుంటే తల్లిదండ్రులకు రుసుముల భారం గుదిబండగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా ప్రతి తరగతికి 10 శాతం

Published : 14 Mar 2022 04:35 IST

 ప్రతి తరగతికి ఏటా 10 శాతం పెంచితే భారమే

స్లాబ్‌ల విధానం మేలంటున్న హెచ్‌ఎస్‌పీఏ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల పెంపు ఏటా 10 శాతం మించరాదని మంత్రుల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో స్లాబ్‌ విధానం లేకుంటే తల్లిదండ్రులకు రుసుముల భారం గుదిబండగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా ప్రతి తరగతికి 10 శాతం పెంచితే సగటున ఏడాదికి 15-20 శాతం భారం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి తరగతికి ఒక ఫీజు కాకుండా రెండు లేదా మూడు స్లాబ్‌లుగా నిర్ణయించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అంటే ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి వరకు ఒక ఫీజు, 6-10 తరగతులకు మరో ఫీజు ఉండాలని లేదా ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి వరకు ఒకటి, 6,7,8 తరగతులకు మరొకటి, 9, 10 తరగతులకు ఇంకో ఫీజైనా తీసుకునేలా ప్రభుత్వం నిబంధనలు విధించాలని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) డిమాండ్‌ చేస్తోంది.

ప్రతి తరగతికి ఒక్కో ఫీజు అంటే... దానిపై 10 శాతం పెంచుకుంటే తల్లిదండ్రులపై పెనుభారం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థి ప్రస్తుత విద్యా సంవత్సరం(2021-22)లో ఎల్‌కేజీ చదువుతున్నాడనుకుందాం. ఇప్పుడు ఫీజు రూ.20 వేలు. ఒక్కో తరగతికి రూ.5 వేలు అధికమైతే యూకేజీకి రూ.25 వేలు, ఒకటో తరగతికి రూ.30 వేలు.. ఇలా అయిదో తరగతికి రూ.50 వేలు.. అంటే ఆరేళ్లలోనే రెట్టింపు ఫీజు చెల్లించాలి. ఆ లెక్కన పదో తరగతికి రూ.75 వేలు అవుతుంది. ఇది ఇప్పుడున్న ఫీజు. ఈ రుసుములపై ఏటా 10 శాతం పెంచితే వచ్చే విద్యాసంవత్సరం(2022-23) ఎల్‌కేజీ విద్యార్థి యూకేజీలోకి రావాలంటే గతేడాది ఉన్న ఫీజు రూ.25 వేలపై 10 శాతం కలిపితే రూ.27,500 చెల్లించాలి. అలా పదో తరగతికి వచ్చేసరికి పెద్దమొత్తంలో కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా స్లాబ్‌ విధానం పెడితే నాలుగైదు సంవత్సరాలు ఒకే ఫీజుపై 10 శాతం చెల్లించాలి. స్లాబ్‌ల విధానాన్ని తీసుకురావడంతో పాటు రాజస్థాన్‌ తరహాలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఫీజు పెంచాలని హెచ్‌ఎస్‌పీఏ సంయుక్త కార్యదర్శి వెంకట్‌ సాయినాథ్‌ కోరారు. ఇప్పుడు ఉన్న విధానాన్నే కొనసాగించాలని,  స్లాబ్‌లకు అంగీకరించమని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని