Published : 23 May 2022 03:03 IST

నిలిచిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు

సాంకేతిక లోపాలు, విద్యుత్తు ఛార్జీల బకాయిలు, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడమే కారణం

ప్రశ్నార్థకంగా 3.50 లక్షల ఎకరాల ఆయకట్టు భవితవ్యం

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, దేవరకొండ: శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్‌ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌(టీబీఎం)లో ఏర్పడిన సాంకేతిక లోపాలు, విద్యుత్తు ఛార్జీల బకాయి తదితర అంశాల వల్ల గత నాలుగైదు నెలలుగా పనులు సాగడం లేదు. ఇటీవలే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పనులు మొదలుపెట్టే సమయానికి ఇక్కడ పనిచేస్తున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన దాదాపు 300మంది కార్మికులు సమ్మెకు దిగారు. గత 4నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఈ నెల 4 నుంచి ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.

పెరుగుతున్న అంచనా వ్యయం
నల్గొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, 500 గ్రామాలకు పైగా తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో రూ.1,925 కోట్ల అంచనా వ్యయంతో 2007లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 15 ఏళ్లలో సుమారు రూ.2,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయగా..పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం సుమారు రూ.4 వేల కోట్లకు చేరినట్లు తెలిసింది. గత మూడేళ్లు కలిపి బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.10 కోట్లే కేటాయించగా ఇవి నిర్వహణకే సరిపోయాయని గుత్తేదారు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. పనులు సకాలంలో పూర్తి కావాలంటే సత్వరం నిధులు విడుదల చేయాలంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలుత రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ప్రకారం 43 కి.మీ. టన్నెల్‌ తవ్వాల్సి ఉంది. ఇది నల్లమల అటవీ ప్రాంతం నుంచి వస్తుండటంతో వన్యప్రాణులకు హానీ కలగకుండా పనులు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ సూచించింది. దీంతో ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట వద్ద ప్రారంభమై అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద ముగిసేలా టన్నెల్‌కి రూపకల్పన చేశారు. ఇప్పటివరకు రెండు వైపుల నుంచి 33కి.మీ.సొరంగమార్గం తవ్వకాన్ని పూర్తి చేశారు. మధ్యలో మరో 10 కి.మీ. మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ చక్రపాణి ‘ఈనాడు’కు తెలిపారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని