‘రైతు భరోసా’ బంద్‌

‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది.

Updated : 08 May 2024 05:45 IST

పంపిణీని తక్షణం నిలిపివేయండి
పోలింగ్‌ తర్వాత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డిది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: ‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఐదు ఎకరాలు.. అంతకు మించి ఉన్న కర్షకులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన ఎన్‌.వేణుకుమార్‌ సోమవారం ఈసీకి ఫిర్యాదు చేశారు. ‘‘ఈ నెల 9లోగా పంట సాయాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని వేణుకుమార్‌ పేర్కొనటంతో ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన అంశాలు పత్రికల్లో కూడా వచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో తక్షణం పంట సాయం పంపిణీని నిలుపుదల చేస్తున్నాం. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు. వాస్తవానికి ఆ పథకాన్ని గతంలో రైతుబంధు పేరిట మునుపటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. పంపిణీకి అనుమతి ఇవ్వాలని అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోరింది. పరిశీలించి గడిచిన ఏడాది నవంబరు 24న పంపిణీకి వీలుగా నిరభ్యంతర అనుమతి జారీ చేశాం. తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆ అంశంపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావటంతో అదే నెల 27న ఆ అనుమతిని ఉపసంహరించాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఆ లేఖలో పేర్కొంది. ‘‘రబీ పంట సాయం పంపిణీకి నిర్దుష్టమైన గడువు లేదు. గడిచిన ఐదేళ్లలో ఏటా అక్టోబరు- జనవరి మధ్యలో పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. 2023 రబీకి సంబంధించి మే నెలలోనే పంట సాయం విడుదల చేసేందుకు ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం లేదు’’ అని ఈసీ పేర్కొంది.

కొత్తగా పేర్లు చేర్చకూడదు

పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయడంతో పాటు రైతు భరోసా చెల్లింపుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం పలు ఆంక్షలు విధించింది. ‘‘ఈ పథకం పరిధిలోకి కొత్త పేర్లను చేర్చకూడదు. ఈ పథకంపై ఎలాంటి ప్రచారం చేయకూడదు. పంట సాయాన్ని పంపిణీ చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదు. పంపిణీ ప్రక్రియలో రాజకీయ నాయకులు పాల్గొనకూడదు. సాధ్యమైనంత మేరకు పంట సాయాన్ని నగదు బదిలీ విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. చెక్కుల రూపంలోనూ పంపిణీ చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, తీసుకున్న చర్యలపై నివేదిక పంపాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను మంగళవారం మధ్యాహ్నం ఈసీ ఆదేశించింది. వికాస్‌రాజు ఆ మేరకు నివేదిక పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని