భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!

రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి.

Published : 08 May 2024 03:57 IST

ఫిబ్రవరి కన్నా 1.81 మీటర్లు పడిపోయిన మట్టం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. దీంతో భూగర్భ జలాలను ఎడాపెడా తోడేస్తున్నారు. ఎంతలా అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 8.7 మీటర్లు కాగా.. ఏప్రిల్‌ నాటికి అది 10.51 మీటర్లకు చేరింది. అంటే 1.81 మీటర్లు పడిపోయిందని భూగర్భ జల వనరుల శాఖ నివేదిక పేర్కొంది.

  • భూగర్భ జలాల వినియోగం పెరగడంతోపాటు అదే స్థాయిలో నీరు భూమిలోకి చేరకపోవడంతో ఈ నీటి సంవత్సరంలో జలమట్టాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. గతేడాది ఏప్రిల్‌లో 8.77 మీటర్ల లోతులో మట్టం ఉండగా ఈ ఏప్రిల్‌లో 10.51 మీటర్లుగా నమోదైంది. అంటే 1.74 మీటర్ల భూగర్భజల మట్టం తగ్గుదల నమోదైంది.
  • రంగారెడ్డి జిల్లాలో 3.88 మీటర్లు, నల్గొండలో 3.76, జోగులాంబ గద్వాలలో 3.73, జయశంకర్‌ భూపాలపల్లిలో 3.59, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 3.33, సూర్యాపేటలో 3.14, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3.10 మీటర్ల మేర జలమట్టం పడిపోయింది.
  • గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 22 నుంచి 27 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు పడ్డప్పటికీ భూపాలపల్లి జిల్లాలో 3.59 మీటర్లు, సిద్దిపేటలో 1.98, మెదక్‌లో 1.39, సిరిసిల్లలో 1.24, నిర్మల్‌లో 1.03, నిజామాబాద్‌ జిల్లాలో 0.25 మీటర్ల మేర జలమట్టం పడిపోవడం గమనార్హం.
  • 24 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జల మట్టాలు పడిపోయిన జిల్లాలన్నీ ఈ జాబితాలోనే ఉన్నాయి. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లో 20 నుంచి 30 శాతం వరకు లోటు వర్షపాతం నమోదవగా ఈ జిల్లాల్లో వరుసగా 3.73 మీటర్లు, 2.94 మీటర్లు, 3.76 మీటర్ల మేర నీటి మట్టం పడిపోయింది.
  • భూగర్భ జలవనరులను పొదుపుగా వినియోగించుకోవాలని ఆ శాఖ ప్రజలకు సూచిస్తోంది. ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటి సంరక్షణ చేపట్టాలని, సూక్ష్మ, బిందు సేద్యం తదితర విధానాలు పాటించాలని తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు