Agnipath: అగ్నిపథ్‌ ఆగే ప్రసక్తే లేదు

త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పింది. ఇక నుంచి నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టంచేసింది. మునుపటి విధానం కొనసాగబోదంది. మూడు దళాలు మరో అడుగు ముందుకేసి.

Updated : 20 Jun 2022 06:43 IST

 రక్షణశాఖ స్పష్టీకరణ

నియామక షెడ్యూళ్లను ప్రకటించిన త్రివిధ దళాలు

తొలి 4-5 ఏళ్లు 60వేల మంది నియామకం

24 నుంచి వాయుసేనలో దరఖాస్తుల నమోదు

ఈనాడు, దిల్లీ: త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పింది. ఇక నుంచి నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టంచేసింది. మునుపటి విధానం కొనసాగబోదంది. మూడు దళాలు మరో అడుగు ముందుకేసి.. అగ్నిపథ్‌ కింద నియామకాల కోసం ఆదివారం షెడ్యూళ్లను ప్రకటించాయి. త్రివిధ దళాల్లో సరాసరి వయసును తగ్గించడమే అగ్నిపథ్‌ ఉద్దేశమని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ స్పష్టంచేశారు. ఈ మేరకు 1989 నుంచి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. కార్గిల్‌ యుద్ధం అనంతరం ఏర్పాటైన సమీక్ష కమిటీ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేసిందన్నారు. ఇప్పుడు కొవిడ్‌-19 పుణ్యమాని ఆ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోందని చెప్పారు. పర్వతప్రాంతాల్లో పనిచేసే సైనికుల్లో కొందరు ప్రతికూల వాతావరణం వల్ల చనిపోతున్నారని, అందుకు ప్రధాన కారణం వయసేనని విశ్లేషించారు. అగ్నిపథ్‌పై యువకులు తమ నిరసనను విరమించుకోవాలని కోరారు. ఇదివరకు ర్యాలీల్లో పాల్గొని శారీరక, వైద్య, ప్రవేశపరీక్షలు పూర్తిచేసి నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నవారూ అగ్నిపథ్‌ కింద దరఖాస్తు చేసుకోవాల్సిందేనని వెల్లడించారు. అలాంటివారి కోసమే వయోపరిమితిని ఈ ఏడాదికి 23 ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. ఆయన ఆదివారం ఇక్కడ త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఎయిర్‌ మార్షల్‌ సూరజ్‌ కుమార్‌ ఝా, వైస్‌ అడ్మిరల్‌ డి.కె.త్రిపాఠి, లెఫ్టినెంట్‌ జనరల్‌ సి.బి.పొన్నప్పలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలివీ..

* అగ్నిపథ్‌ కింద వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ఆరంభమవుతుంది. జులై 24 నుంచి తొలిదశ ఆన్‌లైన్‌ పరీక్ష ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబరు చివరికల్లా తొలి అగ్నివీర్‌ బ్యాచ్‌ నియామకం జరుగుతుంది. డిసెంబరు 30 నుంచి వారికి శిక్షణ మొదలవుతుంది.

* నేవీలో అగ్నివీరుల నియామకాల కోసం జూన్‌ 25కల్లా విస్తృత మార్గదర్శకాలు విడుదలవుతాయి. నవంబరు 21 కల్లా మొదటి బ్యాచ్‌ శిక్షణ ప్రారంభమవుతుంది. నౌకాదళంలో మహిళలకూ అగ్నివీరులుగా అవకాశం కల్పిస్తారు. వీరు యుద్ధనౌకల్లోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

* ఆర్మీలో అగ్నివీర్‌ నియామక ప్రక్రియ కోసం సోమవారం ముసాయిదా నోటిఫికేషన్‌ వెలువడుతుంది. తదుపరి.. సైన్యంలోని వివిధ రిక్రూట్‌మెంట్‌ విభాగాలు జులై 1 నుంచి నోటిఫికేషన్లు జారీచేస్తాయి. ‘జాయిన్‌ ఇండియా వెబ్‌సైట్‌’ ద్వారా దరఖాస్తులు పంపుకోవచ్చు. నియామకం కోసం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరులో ర్యాలీలు జరుగుతాయి. రెండు బ్యాచ్‌లుగా నియామకం జరుగుతుంది. తొలి బ్యాచ్‌లో 25వేల మందిని డిసెంబరు రెండో వారానికల్లా నియమిస్తారు. రెండో బ్యాచ్‌ నియామకం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ రెండింటిలో కలిపి 40వేల మందిని నియమిస్తారు. దేశవ్యాప్తంగా 83 ర్యాలీలు నిర్వహిస్తారు.

* నియామకాల సంఖ్య ఏటా 46వేలకే పరిమితం కాదు. 4-5 ఏళ్లలో 50 వేల నుంచి 60వేలకు పెంచుతారు. ప్రస్తుతం సైనిక దళాల వద్ద 60వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది. క్రమంగా దీన్ని విస్తరించుకుంటూ వార్షిక నియామకాలను 90వేల నుంచి 1.20 లక్షలవరకు తీసుకెళ్తారు.

* విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే అగ్నివీరుడికి రూ.కోటిదాకా బీమా, పరిహారం దక్కుతాయి.

* 18 ఏళ్లలోపు అభ్యర్థుల తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకాలు చేయాల్సి ఉంటుందని వాయుసేన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీరికి 30 రోజుల వార్షిక సెలవులు ఉంటాయని, అనారోగ్యం ఆధారంగా సిక్‌ లీవ్‌లు లభిస్తాయని తెలిపింది.

అల్లరి మూకలకు అవకాశం లేదు

కోచింగ్‌ సంస్థలే యువకుల్లో ఆశలు రేపి రెచ్చగొడుతున్నాయని అనిల్‌ పురీ పేర్కొన్నారు. అలాంటి సంస్థల్లో శిక్షణ పొందుతున్నవారిలో 70 శాతం మంది గ్రామీణులేనని చెప్పారు. ‘‘వాళ్లు అప్పులు చేసి చదువుకుంటున్నారు. వారికి కోచింగ్‌ సంస్థలు ఎన్నో హామీలిస్తున్నాయి. వాటి నిర్వాహకులే అభ్యర్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి పంపుతున్నారు’’ అని తెలిపారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో పాల్గొనేవారికి త్రివిధ దళాల్లోకి ప్రవేశం ఉండబోదని స్పష్టంచేశారు. నియామకాలకు ముందు పోలీసు పరిశీలన ఉంటుందన్నారు. ‘‘సైనిక దళాల్లో క్రమశిక్షణరాహిత్యానికి తావులేదు. అగ్నిపథ్‌లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎలాంటి నిరసనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞపత్రం ఇవ్వాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా అగ్నిపథ్‌ కింద కొన్ని ఉపశమన చర్యలను ప్రభుత్వం ప్రకటించడానికి.. ఆందోళనలు కారణం కాదని స్పష్టంచేశారు. కొంతకాలంగా వాటిపై కసరత్తు జరుగుతోందన్నారు. సాధారణ పరిస్థితుల్లోనూ త్రివిధ దళాల్లో ఏటా 17,600 మంది ముందస్తు పదవీ విరమణ పొందుతున్నారని చెప్పారు. అగ్నిపథ్‌ అమలు వల్లే అనేకమంది సైన్యం నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వస్తుందన్న వాదన సరికాదన్నారు.


తోడ్పాటు ఉంటుంది

అగ్నివీరుల్లో 60-70 శాతం మంది పదో తరగతివారే ఉంటారని అనిల్‌ పురీ తెలిపారు. ‘‘సర్వీసు నుంచి బయటికొచ్చేనాటికి వారి వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉంటుంది. వారికి 12వ తరగతి సర్టిఫికెట్‌ జారీచేస్తాం. తర్వాత డిగ్రీ పూర్తిచేయడానికి చేయూత అందిస్తాం. వారికి పూర్తి క్రమశిక్షణ, నైపుణ్యం అలవడుతుంది. అందువల్ల సులువుగా ఉద్యోగాలు దొరుకుతాయి. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల్లో 25% మందిని రెగ్యులర్‌ సర్వీసులో చేర్చుకుంటాం. మిగిలిన 75% మందికి కేంద్ర సాయుధ బలగాల్లో, రక్షణ శాఖ నియామకాల్లో 10% చొప్పున ప్రాధాన్యం ఇస్తాం. పోలీసుశాఖలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరతాం’’ అని చెప్పారు. బయటికొచ్చేవారి చేతిలో రూ.11.70 లక్షల నిధి ఉంటుందన్నారు. దాంతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. వారికి బ్యాంకులు రుణాలు అందిస్తాయన్నారు.


త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ భేటీ

అగ్నిపథ్‌పై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. వరుసగా రెండోరోజూ ఆదివారం త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. నిరసనకారులను శాంతింపజేయడంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని