గోదావరిలోకి గరళం!

మణుగూరు సమీపంలోని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్‌)లో విద్యుదుత్పత్తి అనంతరం వెలువడిన బూడిద, నీటి వ్యర్థాలను గోదావరి నదిలోకి వదులుతున్నారు.

Published : 25 Jan 2022 04:31 IST

బీటీపీఎస్‌ వ్యర్థాలతో కలుషితమవుతున్న జలాలు

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: మణుగూరు సమీపంలోని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్‌)లో విద్యుదుత్పత్తి అనంతరం వెలువడిన బూడిద, నీటి వ్యర్థాలను గోదావరి నదిలోకి వదులుతున్నారు. విద్యుత్‌ కేంద్రానికి ఉన్న ఒక్క యాష్‌పాండ్‌ నిండిపోవడంతో నెల రోజులుగా వ్యర్థాలను నదిలోకి మళ్లిస్తున్నారు. దీంతో గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నదిలోని జీవరాశులకు, పంటలకు, ఆ నీటిని తాగే ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇంత జరుగుతున్నా పర్యావరణ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

రోజుకు 1,800 టన్నుల బూడిద

బీటీపీఎస్‌లో నాలుగు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి అవుతుంది. ఇందుకోసం రోజుకు 13,000-15,000 టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. ఫలితంగా 1,800 టన్నుల బూడిద, 9 వేల క్యూబిక్‌ మీటర్ల వృథా నీరు వెలువడుతోంది. వీటితో సాంబాయిగూడెం వద్ద ఉన్న మొదటి యాష్‌పాండ్‌ పూర్తి స్థాయిలో నిండింది. దీంతో యాష్‌పాండ్‌ బండ్‌ ఎత్తుని కొద్దికొద్దిగా పెంచుతున్నా సామర్థ్యం సరిపోవడం లేదు. ఈ క్రమంలో వ్యర్థాలను బీటీపీఎస్‌ ఆవరణలో నుంచి ప్రవహించే మద్దువాగులోకి విడిచి పెడుతున్నారు. ఆ వాగు నేరుగా సాంబాయిగూడెం మీదుగా గోదావరిలో కలుస్తుంది. ప్రత్నామ్నాయం ఆలోచన చేయకుండా బీటీపీఎస్‌ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బూడిద వ్యర్థాలను పంపేందుకు మొదట్లోనే సాంబాయిగూడెం వద్ద రెండు యాష్‌పాండ్‌లను జెన్కో సంస్థ నిర్మించ తలపెట్టింది. కానీ వాటి నిర్మాణం మొదటి నుంచీ ఆలస్యంగానే జరుగుతోంది. పనుల్లో జాప్యంపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పలుసార్లు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. రెండో యాష్‌పాండ్‌ అసంపూర్తిగా ఆగిపోవడమే ప్రధాన సమస్యగా మారింది. 

సాంకేతిక సమస్యతోనే: బాలరాజు, సీఈ

ప్లాంట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో కొద్దిసేపు బూడిద వ్యర్థాలను బయటకు పంపాం. సమస్యను పరిష్కరించడానికి ఆరుగురు ఇంజినీర్లు పనిచేస్తున్నారు. గోదావరిలో నురగలు ఈ వ్యర్థాల వల్ల కాదని భావిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని