Telangana News: శివాజీ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహం తొలగించాలని ఒక వర్గం, అందుకు వీల్లేదని మరోవర్గం పట్టుబట్టడంతో...

Updated : 21 Mar 2022 04:30 IST

బోధన్‌లో రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
లాఠీఛార్జి చేసిన పోలీసులు
ఆందోళనకారులపై బాష్పవాయు ప్రయోగం

బోధన్‌, బోధన్‌ పట్టణం- న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహం తొలగించాలని ఒక వర్గం, అందుకు వీల్లేదని మరోవర్గం పట్టుబట్టడంతో వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు ఒకరిపై, ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈక్రమంలో పోలీసులపై రాళ్లు పడటంతో బాష్పవాయువు ప్రయోగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 8 గంటల ప్రాంతంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో ఓవేదికపై శివాజీ విగ్రహం పెట్టారు. దీంతో ఓ వర్గం తమవారిని అప్రమత్తం చేయడంతో అంబేడ్కర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. మరో వర్గానికి చెందినవారు కూడా భారీగా తరలివచ్చారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని ఒక వర్గం వారు పట్టుబట్టారు. విగ్రహం ఏర్పాటుకు సంబంధించి పురపాలకశాఖ తీర్మానం చేసిందని.. అందుకే విగ్రహాన్ని ప్రతిష్ఠించామని.. దాన్ని తొలిగిస్తే తమ మనోభావాలు దెబ్బతింటాయని మరొకరు చెప్పడంతో గొడవ మొదలైంది. పోలీసు కమిషనర్‌ నాగరాజు, అదనపు కమిషనర్‌ వినీత్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ శాంతిభద్రతలు పర్యవేక్షించారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో దుకాణాలను మూసివేయించి 144 సెక్షన్‌ విధించారు. విగ్రహం ఎవరు పెట్టారో వివరాలు తెలుసుకుంటున్నామని కమిషనర్‌ నాగరాజు తెలిపారు. అభ్యంతరం తెలిపిన వర్గంవారిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనుమతి పొందాక విగ్రహం పెట్టుకుంటే ఇబ్బంది రాదని మరోవర్గానికి సూచించారు. ఉన్నతాధికారుల సూచనతో పురపాలక సిబ్బంది విగ్రహానికి ముసుగు తొడిగి స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీజీపీ వై.నాగిరెడ్డి బోధన్‌లో పరిస్థితిని సమీక్షించారు. పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది.

హోంమంత్రి ఆరా..

ఈనాడు, హైదరాబాద్‌: బోధన్‌ ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ ఆరా తీశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ నాగరాజులతో మాట్లాడారు. పరిస్థితిని అదుపులో పెట్టామని డీజీపీ.. హోంమంత్రికి వివరించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యమిస్తున్నారని హోంమంత్రి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని