Telangana News: కేసీఆర్‌తో పీకే భేటీ

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై విస్తృతంగా

Updated : 24 Apr 2022 09:48 IST

ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత చర్చ

తాజా సర్వే నివేదిక ఇచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌

తెరాసతో కలిసి పనిచేస్తానని వెల్లడి

రాత్రి ప్రగతిభవన్‌లోనే బస!

నేడూ కొనసాగనున్న సమాలోచనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో పీకే హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆదివారం సైతం సమాలోచనలు కొనసాగనున్నాయి. ఇందుకోసం పీకే శనివారం రాత్రి ప్రగతిభవన్‌లోనే బస చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే తెరాసతో ఒప్పందం మేరకు పీకే రాష్ట్రంలో తమ బృందంతో కలిసి రాజకీయ, పాలన పరిస్థితులపై సర్వే నిర్వహించారు. తొలుత 30 నియోజకవర్గాల్లోని సర్వే ఫలితాలను ఇచ్చారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల సర్వే జరిగింది. పీకే ఆ నివేదికను కేసీఆర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కాంగ్రెస్‌ నేతలతో జరిపిన సమావేశాల గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తాను తెరాసతో పనిచేస్తానని పీకే వెల్లడించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం కూడా చర్చలు కొనసాగించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రధానంగా ఈ నెల 27న తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ప్లీనరీని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పీకే తాజా సర్వే, తెరాస బలోపేతం వంటి అంశాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని