ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో  అధికార వైకాపా రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణలకు చెందిన ఇద్దరేసి అభ్యర్థులను ఎంపిక చేసింది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాకు

Published : 18 May 2022 05:29 IST

విజయసాయిరెడ్డికి మరోసారి, కొత్తగా బీద మస్తాన్‌రావుకు చోటు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైకాపా రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణలకు చెందిన ఇద్దరేసి అభ్యర్థులను ఎంపిక చేసింది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యకు సీఎం జగన్‌ అవకాశం ఇచ్చారు. ఏపీలో ఇప్పటికే ఎంపీగా ఉంటూ వచ్చే నెలలో పదవీ కాలం ముగియనున్న విజయసాయిరెడ్డికి మరో అవకాశం ఇచ్చారు. మిగిలిన ఒక్క స్థానాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుకు కేటాయించారు.

న్యాయవాది నిరంజన్‌రెడ్డికి..
తొలిసారి 2017లో రాజ్యసభకు అభ్యర్థిని పంపే అవకాశం వైకాపాకు దక్కింది. ఆ తొలి అవకాశాన్ని సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డికి ఇచ్చారు. ఆయన వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. జగన్‌ కేసులను వాదిస్తున్న న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి రాజ్యసభ టికెట్‌ కేటాయించారు. ఆయన తెలంగాణలోని నిర్మల్‌కు సమీపంలోని దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌కు చెందినవారు.

రాజ్యసభకు వైకాపా ఎంపిక చేసిన ఇద్దరు బీసీ అభ్యర్థులు కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు రాజకీయ ప్రస్థానం తెదేపాలోనే ప్రారంభమైంది. ఒకసారి కావలిలో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మస్తాన్‌రావు.. 2019లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అదే సంవత్సరం డిసెంబరులో ఆయన వైకాపాలో చేరారు. కృష్ణయ్య 2014లో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో తెలంగాణ తెదేపా సీఎం అభ్యర్థిగా కృష్ణయ్యను ప్రకటించారు.

నెల్లూరు నుంచే ముగ్గురు
నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, విజయసాయిరెడ్డి వైకాపా నుంచి ఇప్పటికే రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుకూ అవకాశం దక్కింది. దీంతో నెల్లూరు జిల్లా నుంచే ముగ్గురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లవుతోంది.

జాతీయ గుర్తింపు ఉన్న నేత అనే...
నాలుగు స్థానాల్లో తొలుత ఒక స్థానాన్ని బీసీలకు, మరొకటి ఎస్సీ/మైనారిటీ వర్గాలకు కేటాయించాలని భావించినా.. చివర్లో బీసీ వర్గానికే మరో సీటు ఇవ్వాలనే నిర్ణయానికి వైకాపా అధినాయకత్వం వచ్చినట్లు తెలిసింది. జనవరిలోనే బీద మస్తాన్‌రావు పేరును ఖరారు చేశారు. అయితే ‘ఆయనకే కాకుండా మరో స్థానాన్నీ బీసీలకు ఇస్తే 50% బీసీలకు ఇచ్చినట్లవుతుంది. 2020లో 4 స్థానాలు పార్టీకి వస్తే అందులో 50% బీసీలకు ఇచ్చాం.. ఇప్పుడూ అలాగే ఇచ్చినట్లు ప్రజల్లోకి సందేశాన్ని పంపినట్లవుతుంది’ అనే కోణంలో కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి నుంచి బీసీ సంక్షేమ సంఘం నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆర్‌.కృష్ణయ్య పేరును పరిశీలించారు. ఆయన తెలంగాణకు చెందినవారే అయినా బీసీల నేతగా పేరుండటంతో అందరి ఆమోదం పొందుతారని వైకాపా అధినాయకత్వం అంచనా వేసిందంటున్నారు. సీఎంవో నుంచి సోమవారం కృష్ణయ్యకు ఫోన్‌ చేసి.. మంగళవారం విజయవాడ రావాలని చెప్పారు. అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు సీఎం జగన్‌తో కృష్ణయ్య భేటీ అయ్యారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. శాలువాతో సత్కరించారు.

బలహీనవర్గాలకు సముచిత స్థానం ఇచ్చేందుకే
‘బలహీనవర్గాలకు సముచిత స్థానం కల్పించి, వారిని రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఆలోచనలో భాగంగా ముఖ్యమంత్రి ఇప్పుడు బీసీలైన కృష్ణయ్య, మస్తాన్‌రావును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు’ అని మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్‌ తదితరులతో ముఖ్యమంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తర్వాత రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. పేర్లను ప్రకటించారు. కృష్ణయ్య బీసీల్లో జాతీయ స్థాయి నాయకుడు కాబట్టే పార్టీపరంగా బీసీల వాణిని వినిపించేందుకే ఆయన్ను ఎంపిక చేశారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిరంజన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది అని.. అందువల్లే ఆయనను ఎంపిక చేశారని బొత్స తెలిపారు.


సిర్గాపూర్‌ నిరంజన్‌రెడ్డి
పుట్టిన తేదీ: 1970 జులై 23

స్వగ్రామం: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌

తల్లిదండ్రులు: విద్యాసాగర్‌రెడ్డి (సీనియర్‌ న్యాయవాది), విజయలక్ష్మి

కుటుంబం: భార్య, కుమారుడు, కుమార్తె

విద్యాభ్యాసం: పుణెలోని సింబియాసిస్‌ లా స్కూల్‌లో న్యాయవిద్య.

వృత్తి జీవితం: 1992లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డివద్ద ప్రాక్టీసు ప్రారంభించారు. రాజ్యాంగపరమైన అంశాలు, చట్టాలపై పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఎన్నికల సంఘం, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్‌ సీనియర్‌ కౌన్సెల్‌గా పలు కేసుల్లో సేవలందించారు.

చిత్ర నిర్మాత: ఆచార్య, వైల్డ్‌డాగ్‌, అర్జున ఫల్గుణ, మిషన్‌ ఇంపాజిబుల్‌ తదితర చిత్రాలకు..


ర్యాగ కృష్ణయ్య
పుట్టిన తేదీ: 1954 సెప్టెంబరు 13

స్వగ్రామం: వికారాబాద్‌ మోమిన్‌పేట మండలం రాళ్లడుగుపల్లి

విద్యాభ్యాసం: ఎంఏ, ఎంఫిల్‌, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం

ఉద్యమాలు: 1987లో ఉమ్మడి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రారంభించారు. వసతి గృహాలు, బోధన రుసుములు, ఉపకార వేతనాల సమస్యలు, ఖాళీల భర్తీలు, నిరుద్యోగులకు వయోపరిమితి పెంపు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఆందోళనలు చేశారు. 2014 నుంచి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు.

రాజకీయాలు: 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్బీనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడారు. ఇప్పుడు ఏ పార్టీలో లేరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని