సంక్షిప్త వార్తలు

మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. మరోవైపు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. వీటి ప్రభావంతో

Updated : 27 Jun 2022 06:01 IST

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు!

ఈనాడు, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. మరోవైపు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజాంబాద్‌(రాజన్న జిల్లా)లో 4.6, కోహెడ(సిద్దిపేట)లో 4, మల్యాల(కరీంనగర్‌)లో 4, టేక్మాలు(మెదక్‌)లో 4, అశ్వాపురం(భద్రాద్రి)లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం అత్యధికంగా కారేపల్లి(ఖమ్మం)లో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

భారీగా తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

అధిక వర్షాలతో రాష్ట్రంలో కరెంటు డిమాండ్‌, వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు అత్యధికంగా 6409 మెగావాట్ల డిమాండు నమోదైంది. గతేడాది(జూన్‌ 26న) సరిగ్గా ఇదే సమయంలో 9108 మెగావాట్లు ఉండగా ఈ ఏడాది గణనీయంగా తగ్గడం గమనార్హం. వర్షాలతో వ్యవసాయ బోర్లకు, ఇళ్లలో కరెంటు వాడకం పెద్దగా లేనందున డిమాండ్‌ పడిపోయింది. వినియోగం లేకపోవడంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో కొత్తగూడెం, భూపాలపల్లి-1 ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసి వార్షిక మరమ్మతులు చేయిస్తున్నారు.


కొత్తగా 434 కరోనా కేసులు

రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 434 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 285 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 3,762 మంది కరోనా చికిత్సలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23,979 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 343, రంగారెడ్డిలో 34, మేడ్చల్‌లో 25 పాజిటివ్‌లు నమోదయ్యాయి.


అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కందగట్ల స్వామి

ఈనాడు, హైదరాబాద్‌: అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కందగట్ల స్వామి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పద్మశాలీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, ఏపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్‌ తదితరులు స్వామిని అభినందించారు.


డీడీఎంఎస్‌ సత్యనారాయణకు ఎంఈఏఐ పురస్కారాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని మంథనికి చెందిన మైనింగ్‌ ఇంజినీర్‌, ఒడిశా గనులశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్‌ సేఫ్టీ(డీడీఎంఎస్‌)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఇనుముల సత్యనారాయణను ప్రతిష్ఠాత్మక మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎంఈఏఐ) పురస్కారాలు వరించాయి. ఎంఈఏఐ ఏటా ప్రదానం చేసే ఎస్‌ఆర్‌జీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అవార్డు-2021, గనులతవ్వకం రంగంలో వస్తున్న నూతన సాంకేతికతపై ఆయన రాసిన వ్యాసానికి డాక్టర్‌ ఎం.ఎల్‌.జాన్‌వర్‌ పురస్కారాలు లభించాయి. శనివారం బెంగళూరులో జరిగిన ఎంఈఏఐ జాతీయ వార్షిక సమావేశంలో సత్యనారాయణకు వీటిని ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని