పకడ్బందీగా ప్లాస్టిక్‌ నిషేధం

నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులన్నింటినీ ఈ నెల 1 నుంచి నిషేధించిన నేపథ్యంలో మార్గదర్శకాలు,

Updated : 07 Jul 2022 06:16 IST

నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

ఉత్పత్తి చేసినా..వాడినా కఠిన చర్యలు

మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులన్నింటినీ ఈ నెల 1 నుంచి నిషేధించిన నేపథ్యంలో మార్గదర్శకాలు, జరిమానాల వివరాలతో ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ సంచులు, వస్తువుల ఎగుమతులు, దిగుమతులు, అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగం.. అన్నింటిపైనా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. నిషేధిత వస్తువులు తయారు చేస్తే తొలి తప్పిదానికి రూ.లక్ష జరిమానా విధిస్తామని పేర్కొంది. రెండోసారి కూడా తప్పిదానికి పాల్పడితే.. వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థను మూసి వేస్తామని, రూ.2 లక్షల జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. మూడోసారి కూడా తప్పుచేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించింది. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ (పాలీస్టెరీన్‌ సహా) వస్తువులకు ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి పొందిన రిజిస్ట్రేషన్‌ సంఖ్యను ముద్రించకుండా ప్లాస్టిక్‌ వస్తువులను తయారుచేస్తే రూ.50 వేల జరిమానా విధిస్తారు. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను వెంట తీసుకెళ్తున్న వినియోగదారులపై కూడా రూ.500 జరిమానా వేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో, నీటి నిల్వలున్న ప్రాంతాల్లో, నదుల సమీపంలో ఏ రకమైన ప్లాస్టిక్‌ వస్తువులను పడేసినా రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ వస్తువులను తగలబెట్టినా రూ.5 వేల జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్‌ వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో, డంపు యార్డుల్లో తగలబెడితే.. స్థానిక సంస్థలపై కూడా రూ.25 వేల జరిమానా వేస్తారు. జరిమానాలు, అనుమతులు రద్దులో స్థానిక సంస్థలకు విశేష అధికారాలను కట్టబెట్టారు. నిషేధం అమలులో పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, విద్య, రెవెన్యూ, హోం, రవాణా, రోడ్లు, భవనాలు, పౌరసరఫరా, ఉద్యాన, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, పర్యాటక, తదితర శాఖలతో పాటు జిల్లా కలెక్టర్లు, పురపాలక, పంచాయతీరాజ్‌ సంస్థలు కీలకంగా వ్యవహరించాలని తెలిపింది.ప్లాస్టిక్‌ నిషేధిత వస్తువులపై ప్రజల్లో, విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు

ప్లాస్టిక్‌ పుల్లలతో తయారుచేసిన ఇయర్‌ బడ్స్‌, బెలూన్లు, పతాకాలు, పిప్పర్‌మెంటు బిళ్లలు (క్యాండీ), ఐస్‌క్రీమ్‌ పుల్లలు, అలంకరణ కోసం వాడే పాలీస్టెరీన్‌ (థర్మాకోల్‌) వస్తువులు, ప్లేట్లు, కప్పులు, చేతి సంచులు (క్యారీ బ్యాగ్స్‌), ఆహార పొట్లాలు, బాటిల్స్‌, స్ట్రాలు, కప్పులు, కత్తులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తిపీట, ట్రేలు, బహుమతులకు, తీపి పదార్థాల పెట్టెలకు చుట్టే కవర్లు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్‌ పొట్లాలు తదితరాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని