Virtual Lab: ల్యాబ్‌ లేకున్నా ప్ర‘యోగం’!

ఇంజినీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీ.. ఇలా ఏ కోర్సు చేసినా ప్రాక్టికల్స్‌ తప్పనిసరి. కానీ ప్రస్తుతం చాలా కళాశాలల్లో ప్రయోగశాలలు అందుబాటులో లేవు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ఈ సమస్య ఎక్కువ. దీన్ని అధిగమించేలా

Updated : 08 Aug 2022 06:12 IST

వర్చువల్‌, రిమోట్‌ ల్యాబ్‌లతో వీలు
బిట్స్‌, ట్రిపుల్‌ ఐటీలో ప్రత్యేకంగా ఏర్పాటు
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులకు  అందుబాటులో తెచ్చేలా కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీ.. ఇలా ఏ కోర్సు చేసినా ప్రాక్టికల్స్‌ తప్పనిసరి. కానీ ప్రస్తుతం చాలా కళాశాలల్లో ప్రయోగశాలలు అందుబాటులో లేవు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ఈ సమస్య ఎక్కువ. దీన్ని అధిగమించేలా వర్చువల్‌, రిమోట్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఇప్పటికే బిట్స్‌ పిలానీ-హైదరాబాద్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో నడుస్తుండగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఏమిటీ విధానం?

విద్యార్థులు నేరుగా ప్రయోగశాలలకు వెళ్లనక్కర్లేదు. తమ కళాశాలలో ఉంటూనే.. వేరొక కళాశాలలో ఉండే పరికరాలతో ప్రయోగాలు చేయొచ్చు. బిట్స్‌లో రిమోట్‌, వర్చువల్‌ ల్యాబ్‌ ఉండగా.. ట్రిపుల్‌ఐటీలో వర్చువల్‌ ల్యాబ్‌ ఉంది. వర్చువల్‌ ల్యాబ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ప్రయోగాలు చేసేందుకు వీలుండగా, రిమోట్‌ ల్యాబ్‌లలో పరికరాలను కూడా ఉపయోగించవచ్చు. బిట్స్‌ వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ (డబ్ల్యూఐఎల్‌పీ)లో విద్యార్థులు, వృత్తి నిపుణులు తమ శిక్షణలో భాగంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కేంద్రంలో బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంబీఏ సహా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్‌ చేస్తూ వర్చువల్‌, రిమోట్‌ ల్యాబ్‌ సాయంతో ప్రయోగాలు చేసే వీలుంటుందని బిట్స్‌ డబ్ల్యూఐఎల్‌పీ డీన్‌ గురునారాయణన్‌ వివరించారు. ఐటీ, ఆటోమోటివ్‌, తయారీ, ఫార్మా, కెమికల్స్‌ రంగాలకు చెందిన లక్ష మందికిపైగా వృత్తి నిపుణులు ఆయా కోర్సులు చేసినట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలోనూ 2012 వర్చువల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలకు చెందిన వెయ్యికి పైగా ప్రయోగాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ట్రిపుల్‌ఐటీకి రాకుండానే చేసి ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసేందుకు వీలు కలుగుతోంది.


అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు

-సి.శ్రీనాథ్‌, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి
 

బిట్స్‌లో ఉన్న వర్చువల్‌, రిమోట్‌ ల్యాబ్‌ల నుంచి సహకారం తీసుకుందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు ఆయా ల్యాబ్‌లలోని ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి.  

ఎలా చేస్తారంటే..?

ఈ ల్యాబ్‌లు సెన్సర్‌, రిమోట్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. కళాశాలలోని ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న పరికరాలకు సెన్సర్లు, సీసీ కెమెరాలు అమర్చి వర్చువల్‌గా ఆపరేట్‌ చేసేలా సిద్ధం చేస్తారు. వేరొక కళాశాలలో ఉన్న ల్యాబ్‌తో అనుసంధానం చేస్తారు. అక్కడి విద్యార్థులు వర్చువల్‌గా వీక్షిస్తూ ప్రయోగాలు చేసుకోవచ్చు. ఉదాహరణకు బిట్స్‌లో ఉండే ఆధునిక పరికరాలను వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివే విద్యార్థులు ఉపయోగిస్తూ ప్రయోగాలు చేసేందుకు వీలు కుదురుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని