సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు

కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోందని, కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. కేంద్రంలోని పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని

Updated : 16 Aug 2022 06:33 IST

రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరుస్తున్నారు

సమరయోధుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

ప్రగతిలో దేశానికి దిక్సూచి తెలంగాణ

విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొడదాం

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోందని, కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. కేంద్రంలోని పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని పేర్కొన్నారు. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత..కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గోల్కొండ కోటపై జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిని చాటుతూ మరోవైపు కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 32 పేజీల ప్రసంగ పాఠంలో దాదాపు ఆరు పేజీల్లో ఆయన కేంద్రవిధానాలను దుయ్యబట్టారు.

సహకార స్ఫూర్తికి విరుద్ధం

‘‘సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ.. ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతోంది. భారత్‌ రాష్ట్రాల సమాఖ్య అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం చేస్తోంది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటోంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్రం ఈవిధంగానే రుద్దాలని చూసింది. చివరికి రైతుల పోరాటానికి తలొగ్గి నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది.

రాష్ట్రాల ఆదాయానికి గండి..

కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41 శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలి. ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల పేరుతో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోంది. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం గండి కొడుతోంది. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు తెచ్చింది.రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో తీసుకొనే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తోంది. కేంద్ర అసమర్థతల వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతోంది.

పెట్టుబడి వ్యయంగా అప్పులు

కేంద్ర లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్ర అప్పుల మొత్తం రూ. 2,25,450 కోట్లు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రం నుంచి సంక్రమించిన అప్పు రూ.75,577 కోట్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,49,873 కోట్లు. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. జీఎస్‌డీపీలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే ..దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు తెలంగాణకన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జీఎస్‌డీపీలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతం. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు  ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు.

ఫ్లోరైడ్‌ను తరిమికొట్టాం

మిషన్‌ భగీరథతో 100 శాతం ఆవాసాలకూ మంచినీరందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం పార్లమెంటు వేదికగా కొనియాడింది. రూ.57,880 రైతులకు పంట పెట్టుబడిగా అందించిన చరిత్రాత్మక రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రస్తుతించింది. వైద్య ఆరోగ్యరంగంలో రాష్ట్రం అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పింది. వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేసుకుంటున్నాం. కొత్తగా 5111 అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ పోస్టులను భర్తీచేయనున్నాం. టీఎస్‌ఐపాస్‌ ద్వారా పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్లలో రూ.2,32,111 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 50 వేల ఉద్యోగాల కల్పన జరిగింది.

కుట్రలను తిప్పికొడదాం..

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 1.20 కోట్ల జాతీయ జెండాలను ప్రతి ఇంటిపై ఎగురవేయడంతో యావత్‌ తెలంగాణ త్రివర్ణ శోభితంతో మురిసి మెరిసిపోతోంది. దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను జరుపుకొంటున్నాం.మన రాష్ట్రంలోనూ మత చిచ్చురేపి శాంతిని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలని.. తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలనీ విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని మేధావులు, యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి కుట్రలను తిప్పికొట్టాలని’’ కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు

‘‘జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. నేడు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చోటు చేసుకుంటున్నాయి’’    

  -సీఎం కేసీఆర్‌


స్వాతంత్య్ర ఉద్యమ ఆకాంక్షలను కాపాడుకుందాం

‘‘మన తెలంగాణ సుదీర్ఘకాలం అనేక సంక్షోభాల్లో చిక్కి కొట్టుమిట్టాడింది. ఎనిమిదేళ్లుగా కోలుకొని కడుపునిండా తింటూ, కంటినిండా నిద్ర పోతోంది. ఈ కీలక సమయంలో ఏ వర్గాన్నీ విస్మరించకుండా సకలజనులనూ ముందుకు నడిపించాల్సిన గురుతర బాధ్యత సీఎంగా నాపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా ఉంది. పూజ్య బాపూజీ ప్రశంసించిన గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ ఆశయాలను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’

  -సీఎం కేసీఆర్‌


సంక్షేమంలో అగ్రస్థానం

‘‘సంక్షేమంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వజ్రోత్సవాల కానుకగా సోమవారం నుంచి మరో 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ఇస్తున్నాం. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా విప్లవాత్మకమైన ‘దళితబంధు’ పథకాన్ని అమల్లోకి తెచ్చాం. తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతిరేఖగా ఇది దేశానికి దిశా నిర్దేశనం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాం’’

-సీఎం కేసీఆర్‌


సస్యశ్యామల తెలంగాణ

‘‘ప్రతి రంగంలోనూ యావత్‌ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ రాష్ట్రం ‘సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణ’గా ఆవిర్భవించింది. ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్ల అపూర్వ విజయాలను సొంతం చేసుకుంది. దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థికశక్తిగా రూపొందింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు అత్యుత్తమ విద్యుత్తునిస్తూ 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటుతో దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. 12.01 శాతం ఉత్పత్తి రంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా.. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26.14 శాతం వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకెళ్తోంది’’

 -సీఎం కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని