నిధుల కోసం ఎదురుచూపులు

ప్రాంతీయ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా విడుదల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు.

Updated : 08 Dec 2022 10:01 IST

ప్రాంతీయ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణపై కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా విడుదల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డుకు ఆవల నిర్మించతలపెట్టిన ఈ రోడ్డు భూసేకరణకు అయ్యే వ్యయాన్ని చెరి సగం భరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయి. 158.645 కిలోమీటర్ల ఉత్తర భాగం రోడ్డుకు 4,760 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ మార్గంలో భూమి 95 శాతం వరకు ప్రయివేటు వ్యక్తులదే కావటంతో రూ.2,500 కోట్లవరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. ఈ మార్గంలో భూసేకరణ ప్రక్రియ తుదిదశలో ఉంది. ఒకట్రెండు ప్రాంతాల్లో మినహా అన్ని సర్వేలు పూర్తయ్యాయి. కేంద్రం తుది నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవటమే తరువాయి అని అధికారులు  చెబుతున్నారు.. తుది నోటిఫికేషన్‌లోగా నిధులు సమకూర్చుకోవాలని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

బడ్జెట్‌లో కేటాయించింది రూ.500 కోట్లే..

ముందస్తు నిర్ణయం ప్రకారం భూసేకరణలో చెల్లించాల్సిన సగం వాటాలోని కొంత మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబరులో లేఖ రాసింది. అయినా గత రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. భూసేకరణ వ్యయంలో సగం.. అంటే సుమారు రూ.1,250 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ రూపకల్పన సమయానికి పూర్తి స్పష్టత లేక రూ.500 కోట్లే కేటాయించింది. వీటిని విడుదల చేయడంతో పాటు మరిన్ని నిధులూ కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వారంలో మరోదఫా లేఖ రాసింది. తమ వాటా నిధులు సిద్ధంగా ఉన్నాయని అందులో పేర్కొంది. దక్షిణ భాగం అధ్యయనం కూడా ఇటీవలే పూర్తి అయింది. ఈ మార్గంలో కూడా సుమారు నాలుగు వేల ఎకరాల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఆ మార్గంలో కొంతమేరకు ప్రభుత్వ భూమి ఉండటంతో సేకరణ వ్యయం కాస్త తక్కువగా ఉంటుందని అంచనా. మొత్తమ్మీద భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.రెండు నుంచి రూ.మూడు వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది.

రైతుల గోసకు పరిష్కారం ఏది?

ఉత్తర భాగంలో సేకరించేందుకు ప్రతిపాదించిన భూముల్లో కొందరు రైతులు కట్టుబట్టలతో రోడ్డుపై నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా రైతుల అరిగోసను పట్టించుకున్న నాథుడు లేడు. భువనగిరి, మెదక్‌ జిల్లాలోని పలు గ్రామాల ప్రజల నుంచి ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మూడు సార్లు భూములను సేకరించాయి. నష్ట పరిహారం ఇస్తున్నప్పటికీ మార్కెట్‌లో ఉన్న ధరకు.. ప్రభుత్వం చెల్లించేదానికి మధ్య పొంతన లేకపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి జిల్లాలోని రాయగిరి, కేసారం, మెదక్‌ జిల్లా కాసాల, దేవులపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజలు భూ సేకరణను అడ్డుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని