ఏ స్థాయికి ఎదిగినా మహిళలకు తప్పని వేధింపులు

ఉన్నత స్థానాలకు వెళ్లినా మహిళలకు సమాజంలో వేధింపులు తప్పడంలేదని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, సీఐడీ విభాగాధిపతి మహేష్‌ భగవత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 29 Jan 2023 03:28 IST

సీఐడీ విభాగాధిపతి మహేష్‌ భగవత్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత స్థానాలకు వెళ్లినా మహిళలకు సమాజంలో వేధింపులు తప్పడంలేదని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, సీఐడీ విభాగాధిపతి మహేష్‌ భగవత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక మహిళా జడ్జీని వేధిస్తుంటే సంబంధిత వ్యక్తిని జైలుకు పంపామని ఆయన తెలిపారు. మానవ అక్రమ రవాణా సమాజాన్ని వేధిస్తోన్న తీవ్ర సమస్య అని, ఇది ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల వ్యవస్థీకృత నేరమని ఆయన చెప్పారు. మాదక ద్రవ్యాల దందా తరువాత పెద్దఎత్తున జరిగే అక్రమ వ్యాపారం ఇదేనన్నారు. తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ లాయర్స్‌(టీఎఫ్‌డబ్ల్యూఎల్‌) హైదరాబాద్‌ బేగంపేట టూరిజం ప్లాజాలో ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమంలో మహేష్‌ భగవత్‌ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మానవ అక్రమ రవాణా మాటున ప్రపంచవ్యాప్తంగా 210 లక్షల మంది బాధితులున్నారని, ఇందులో 71 శాతం మహిళలు, బాలికలేనని ఆయన పేర్కొన్నారు. పిల్లలను అపహరించి తీసుకొచ్చి యాదగిరిగుట్టలో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారన్నారు. ఈ క్రమంలో 42 మంది అక్రమార్కులను అరెస్ట్‌ చేశామని, గత మూడేళ్లలో 20 వ్యభిచార గృహాలను మూసివేయించామని మహేష్‌ భగవత్‌ వివరించారు. కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ కౌన్సిల్‌లో ఇద్దరు మహిళా సభ్యులు ఉండేలా రిజర్వేషన్‌ను తీసుకురావాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసినట్లు చెప్పారు. మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ న్యాయవిద్య చదివే మహిళలను పెద్దసంఖ్యలో న్యాయవాద వృత్తిలోకి వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ పి.శ్రీసుధ, జస్టిస్‌ రాధారాణి, సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి, టీఎఫ్‌డబ్ల్యూఎల్‌ జాతీయ అధ్యక్షురాలు హేమలత, రాష్ట్ర అధ్యక్షురాలు పి.రేవతీదేవి, ఉపాధ్యక్షురాలు డి.మాధవీరెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షురాలు సుమాలినీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని