ఫుట్‌బాల్‌ ఆట.. అమ్మనాన్నల దరిజేర్చింది

అది ముంబయిలోని ఓ ప్రాంతం.. అక్కడో పాఠశాలలో మహమ్మద్‌ దానిష్‌ (15) అనే విద్యార్థి చదువుతున్నాడు. అతడు ఆరేళ్ల వయసులో తప్పిపోయి ముంబయి చేరాడు.

Published : 02 Feb 2023 07:29 IST

తొమ్మిదేళ్ల కిందట తప్పిపోయిన బాలుడు మళ్లీ ఇంటికి

అది ముంబయిలోని ఓ ప్రాంతం.. అక్కడో పాఠశాలలో మహమ్మద్‌ దానిష్‌ (15) అనే విద్యార్థి చదువుతున్నాడు. అతడు ఆరేళ్ల వయసులో తప్పిపోయి ముంబయి చేరాడు. వివరాలు తెలియకపోవడంతో అధికారులు అతడిని బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి చదివిస్తున్నారు. ఫుట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్న ఆ బాలుడు ఇటీవల అండర్‌-15 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇందుకోసం అధికారులు వివరాలు అడిగితే తెలియవన్నాడు. దీంతో వారు అతడి వేలిముద్రలను పరీక్షిస్తే ఆధార్‌ నంబరు, తల్లితండ్రుల వివరాలు తెలిశాయి. తొమ్మిదేళ్లుగా ఆ వివరాలు తెలియక సందిగ్ధంలో ఉన్న అధికారులకు దీంతో స్పష్టత వచ్చింది. అతడు తెలంగాణకు చెందినవాడని, నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహార్‌పేటకు చెందిన మహమ్మద్‌ మొయిజ్‌, షబానాల కుమారుడని గుర్తించారు. అంతే అతడి జీవితం మరో మలుపు తిరిగింది. తొమ్మిదేళ్లుగా కుమారుడి కోసం తల్లడిల్లుతున్న తల్లితండ్రుల వద్దకు చేర్చింది. దానిష్‌ 2014 డిసెంబరు 16న చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెదికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లితండ్రులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ బాలుడు హైదరాబాద్‌లో రైలెక్కి ముంబయి చేరాడు. అక్కడ రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్న అతడిని బాలల సంరక్షణ కేంద్రం (సీడబ్ల్యూసీ) అధికారులు చేరదీసి పాఠశాలలో చేర్పించారు. అతడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పలుమార్లు అతడి వేలిముద్రలు, ఐరిస్‌ పరీక్షలు చేసి ఆధార్‌ ద్వారా చిరునామా కనుక్కొనేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా ఆ వివరాలు తెలియడంతో వారు నారాయణపేట అధికారులకు సమాచారమిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌, డీసీపీవో కుసుమలత బాలుడి తల్లితండ్రులకు విషయం చెప్పి ముంబయి పంపారు. వారు వెళ్లి కుమారుడిని వెంటబెట్టుకుని తిరిగివచ్చారు. అధికారులు వారికి బాలుడిని అధికారిక పత్రాలతో అప్పగించారు. తమ కుమారుడు ఇక దక్కడనుకున్నామని, దేవుడి దయ, అధికారుల కృషితో అతడు ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉందని తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

 నారాయణపేట, న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు