యువతకు రాష్ట్రంలో అపార అవకాశాలు

జీవితంలో స్థిరపడాలనుకునే యువతకు రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 09 Jun 2023 06:45 IST

మంచి చేస్తేనే ప్రజలు పదికాలాలు గుర్తుంచుకుంటారు
మంత్రి కేటీఆర్‌
ఎస్‌జీడీ కార్నింగ్‌ టెక్నాలజీస్‌ ఫార్మా గ్లాస్‌ కంపెనీ యూనిట్‌ నిర్మాణానికి భూమిపూజ

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: జీవితంలో స్థిరపడాలనుకునే యువతకు రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. జడ్చర్లలో రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవం, మూసాపేట మండలం వేముల శివారులో ఎస్‌జీడీ కార్నింగ్‌ టెక్నాలజీస్‌ ఫార్మా గ్లాస్‌ కంపెనీ యూనిట్‌ నిర్మాణానికి భూమిపూజతో పాటు భూత్పూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగార్హత సాధించిన వారికి ఆఫర్‌ లెటర్లు అందించారు. మహబూబ్‌నగర్‌, జడ్చర్లలలో బహిరంగ సభల్లో కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘పోటీ ప్రపంచంలో స్కిల్‌, రీస్కిల్‌, అప్‌స్కిల్‌ ఎంతో ప్రధానం. యువత.. బుక్‌, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పెంచుకోవాలి. రాష్ట్రం ఏర్పాటై పదో ఏట అడుగుపెడుతున్నాం. ఒక్కసారి నాటి పరిస్థితులను మననం చేసుకోవాలి. పాలమూరులో 14 రోజులకోసారి మంచినీళ్లు వచ్చిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తదోనని ఎదురుచూసే పరిస్థితి ఉండేది. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేశారా.. లేదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పల్లెలకు పోవాలంటే ఏ గ్రామంలో ఎక్కడ బిందెలు అడ్డుపెట్టి ఆందోళన చేస్తారోనని భయపడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రమంతా మంచినీటి గోస తీరింది. స్వాతంత్య్రం వచ్చాక ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆరే. ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ అంటే మైగ్రేషన్‌.. ఇప్పుడు ఇరిగేషన్‌ అనే స్థాయికి చేరింది. ఇక్కడ ఉదండాపూర్‌,  కరివెన జలాశయాలు కడుతున్నాం. నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ ప్రాజెక్టులు పూర్తయితే 67 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. పాలమూరులో చెరువులు, కుంటలు నిండి పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయని నాస్కాం, ఎస్‌టీపీఐ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో గతంలో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు 9.05 లక్షల మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ మారిందని స్వయంగా సినీ నటుడు రజనీకాంత్‌ ప్రశంసించారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే న్యూయార్క్‌లా అనిపిస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రెడ్‌ స్టిక్కర్‌ అనే పరిస్థితి నుంచి రెడ్‌ కార్పెట్‌ పరిచే స్థాయికి వచ్చాం. 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల రైతుబంధు అందించాం. తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు పోతే వార్త. 10 నిమిషాలు కరెంటు పోతే మెసేజ్‌లు వస్తున్నాయి. గతంలో మహబూబ్‌నగర్‌లో ఎవరైనా చనిపోతే కరెంటోళ్లకు ఫోన్‌ చేసి అంత్యక్రియల అనంతరం స్నానాలు చేయాల్సి ఉందని.. విద్యుత్తు సరఫరా చేయాలని బతిమిలాడుకునే పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 వైద్య కళాశాలలుండగా.. ఇప్పుడు జిల్లాకొకటి చొప్పున 33 వచ్చాయి. రాష్ట్ర పరిస్థితులు బాగుపడ్డాయా.. లేదా అనేది గుండెలమీద చేయివేసుకొని ఆలోచించాలి. రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయి.

కేసీఆర్‌ ప్రభుత్వంలో వెయ్యినొక్కటి గురుకులాలు ఏర్పాటు చేశాం. ప్రపంచంతో పోటీపడే పౌరులుగా విద్యార్థులను తయారు చేస్తున్నాం. ఆర్థిక స్తోమత లేని పిల్లలు గురుకుల పాఠశాలల ద్వారా నీట్‌, ఐఐటీ, ఐఐఎంలలో సీట్లు సంపాదిస్తున్నారు. ఈ ఆనందం ముందు అన్నీ దిగదుడుపే. పదవులు శాశ్వతం కాదు.. మంచి చేస్తేనే పది కాలాలపాటు ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎవరేం మాట్లాడినా.. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పెరిగిన సంపద ‘స్టేబుల్‌ గవర్నమెంట్‌.. ఏబుల్‌ లీడర్‌షిప్‌’నకు చిహ్నం’’ అని కేటీఆర్‌ అన్నారు.

కార్యక్రమాల్లో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డా.సి.లక్ష్మారెడ్డి, డా.అబ్రహాం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సైయెంట్‌ సంస్థ ఫౌండర్‌ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ప్రతినిధి కృష్ణ, ఎస్‌జీడీ కార్నింగ్‌ టెక్నాలజీస్‌ సంస్థ యజమాని ఎక్బాల్‌ సింగ్‌, ఎండీ అక్షయ్‌కుమార్‌, కలెక్టర్‌ రవి, ఎస్పీ కె.నరసింహ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని