Hyderabad: సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇష్టారాజ్యం!

మాతృత్వపు మధురిమల కోసం పరితపించేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

Updated : 20 Mar 2024 06:28 IST

నిబంధనల బేఖాతరు.. అడ్డగోలుగా చికిత్సలు
కఠిన చర్యల దిశగా వైద్య, ఆరోగ్య శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: మాతృత్వపు మధురిమల కోసం పరితపించేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నవి కొన్నయితే.. అనుమతులను పునరుద్ధరించుకోకుండానే కొనసాగుతున్నవి మరికొన్ని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 265 సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 123 హైదరాబాద్‌లో ఉండగా.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 40, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 35, వరంగల్‌ జిల్లాలో 27 కేంద్రాలు ఉన్నాయి. రోజురోజుకూ ఈ కేంద్రాల సంఖ్య పెరుగుతుండగా.. అదే స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలూ ఎక్కువ అవుతున్నాయి. ఈ కేంద్రాలు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతితోనే ఏర్పాటు కావాల్సి ఉంది. నిర్దేశించిన గడువు మేరకు అనుమతులను రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంది.

అయితే, రాష్ట్రంలో పలు చోట్ల ప్రధానంగా జిల్లా కేంద్రాల్లో సంతాన సాఫల్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీల్లో వెల్లడైంది. కృత్రిమ గర్భధారణకు సంబంధించి ఎలాంటి వసతులు, నిపుణులైన వైద్యులు లేకున్నా పలుచోట్ల కేంద్రాలను నిర్వహిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. మరోవైపు స్కానింగ్‌ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో నిబంధనలను అతిక్రమిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలతోపాటు, స్కానింగ్‌ సెంటర్లపైనా చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ ఉపక్రమించింది.

ఉల్లంఘనల పరంపర..

వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. చికిత్స కోసం వచ్చేవారిని తప్పుదోవ పట్టించేలా కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఓ కేంద్రంలో అనుమతి లేకుండా ఐవీఎఫ్‌ చికిత్స చేస్తున్న ఘటన వెలుగు చూసింది. మరో కేంద్రంలో ఎలాంటి చికిత్సలు చేయకుండా హైదరాబాద్‌లోని కేంద్రానికి పంపుతున్న ఘటన వెలుగు చూసింది. ఇటీవల హైదరాబాద్‌ మలక్‌పేటలోని ఓ ఫర్టిలిటీ సెంటర్‌లో అనుమతి లేకుండా నడుపుతున్న మెడికల్‌ షాపును ఔషధ నియంత్రణ మండలి అధికారులు సీజ్‌ చేశారు. నిషేధించిన స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా జిల్లాల్లోని పలు కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు.

ప్రత్యేక సమీక్ష..

బాధితులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. చివరికి మోసపోతున్న ఘటనలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కఠిన చర్యల దిశగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్‌ చోంగ్తూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషర్‌ ఆర్‌.వి.కర్ణన్‌లు జిల్లా వైద్యాధికారులతో సమీక్షించి సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయా డీఎంహెచ్‌ఓల పరిధిలోని వాటిని క్రమంతప్పకుండా తనిఖీలు చేయడంతోపాటు ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో డీఎంహెచ్‌ఓలు ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని