Telangana Rains: అరగంటలో.. దూసుకొచ్చిన ఆపద

అర్ధరాత్రి సమయం.. అందరూ ఆదమరిచి నిద్రపోతున్న వేళ.. వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న ఆ ఊరిని వరద చుట్టుముట్టింది. కేవలం అరగంట సమయంలోనే ఊరు మొత్తం మునిగిపోయింది. హాహాకారాలు చేస్తూ.. నిద్ర మేలుకున్న గ్రామస్థులు భీతావహులయ్యారు.

Updated : 28 Jul 2023 08:24 IST

వాగు వరదలో మునిగిన మోరంచపల్లి..

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: అర్ధరాత్రి సమయం.. అందరూ ఆదమరిచి నిద్రపోతున్న వేళ.. వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న ఆ ఊరిని వరద చుట్టుముట్టింది. కేవలం అరగంట సమయంలోనే ఊరు మొత్తం మునిగిపోయింది. హాహాకారాలు చేస్తూ.. నిద్ర మేలుకున్న గ్రామస్థులు భీతావహులయ్యారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పరుగులు తీశారు. సజ్జలు, డాబాలు, చెట్ల పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. దాదాపు తొమ్మిది గంటల పాటు వరదనీటిలో చిగురుటాకుల్లా వణికిపోతూ.. సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. గురువారం ఉదయం 5 గంటలకు ఈ విషయం వెలుగులోకి వచ్చాక అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలకు ఉపక్రమించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం దీనావస్థ ఇది. కుండపోత వర్షాలతో ఈ జిల్లా మొత్తం అతలాకుతలం కాగా.. మోరంచవాగు ఊరిని ముంచెత్తింది. జిల్లాలో బాధితులను రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి రెండు హెలికాప్టర్లను పంపారు.

జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, ఎస్పీ కరుణాకర్‌లు మోరంచపల్లి సమీపానికి చేరుకుని అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. వరదలో చిక్కుకున్న వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా దాదాపు వెయ్యి మందిని పడవల్లో ఒడ్డుకు చేర్చారు. మేడలు, చెట్లపై చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. సుమారు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించారు. గ్రామానికి చెందిన అయిదుగురు వరదలో గల్లంతైనట్లు గ్రామస్థులు తెలిపారు. గొర్కె ఓదిరెడ్డి, ఆయన సతీమణి వజ్రమ్మ, గంగిడి సరోజన, గడ్డం మహాలక్ష్మి వరదలో కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. స్థానిక శ్మశానంలో నిద్రిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.  కేవలం అరగంట వ్యవధిలోనే ఊరిని వరద ప్రవాహం చుట్టుముట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. రాత్రంతా వర్షం కురిసినా పెద్దగా వాగు ప్రవాహం లేదు. ఎగువన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట మారేడుకుంట, ముసలమ్మకుంట, పెద్దాపూర్‌, గణపురం మండలం నగరంపల్లి, ధర్మరావుపేట చెరువుల మత్తళ్లు దూకడం, గండ్లు పడటం వల్ల మోరంచవాగుకు ఒక్కసారిగా భారీగా వరద పోటెత్తింది. సమీపంలోనే ఉండే మోరంచపల్లి గ్రామంలోకి చొచ్చుకువచ్చింది.


ఆరుగురు కూలీలను రక్షించిన బృందం

చిట్యాల, న్యూస్‌టుడే: వంతెన నిర్మాణ పనుల కోసం వచ్చిన ఆరుగురు కూలీలు మోరంచవాగులో చిక్కుకుపోగా.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రక్షించింది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్‌పాక, నేరేడుపల్లి గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులకు బిహార్‌ రాష్ట్రం నుంచి కూలీలు వచ్చారు. బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో తాము బస చేసిన ప్రాంతం నుంచి కొంతమంది కూలీలు నైన్‌పాక గ్రామానికి చేరుకున్నారు. మరో ఆరుగురు మాత్రం బస వద్దే నిద్రించేందుకు ఉపక్రమించారు. ఒక్కసారిగా వాగు ప్రవాహం పెరగడంతో వారు జేసీబీ యంత్రంపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక జడ్పీటీసీ సభ్యుడు సాగర్‌, ఎంపీడీవో రామయ్య, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. వారు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం, హెలికాప్టర్‌ను పంపించి బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని