TS News: సంపాదన మద్యంపాలు.. సంసారం వీధిపాలు!

రోజుకు సుమారు రూ.82 కోట్లు. గడచిన ఏడాది రాష్ట్రంలో మందుబాబులు సగటున చేసిన ఖర్చు ఇది. 2021 డిసెంబరు 31, 2022 జనవరి ఒకటో తేదీల్లో.. రూ. 248.05 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. అంటే రోజుకు రూ. 124 కోట్ల చొప్పున..

Updated : 03 Jan 2022 05:22 IST

నానాటికీ పెరుగుతున్న మద్యపాన వ్యసనం
ఏడాదిలోనే రూ.30 వేల కోట్ల అమ్మకాలు
బెల్ట్‌షాపుల్లో పెరిగిన విక్రయాలతో అనర్థాలు
ఈనాడు - హైదరాబాద్‌

రోజుకు సుమారు రూ.82 కోట్లు. గడచిన ఏడాది రాష్ట్రంలో మందుబాబులు సగటున చేసిన ఖర్చు ఇది. 2021 డిసెంబరు 31, 2022 జనవరి ఒకటో తేదీల్లో.. రూ. 248.05 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. అంటే రోజుకు రూ. 124 కోట్ల చొప్పున.. గత ఏడాది రోజువారీ సగటును ఈ రెండు రోజుల విక్రయాలు అధిగమించాయన్నమాట. ఏడాది చివరి అయిదు రోజుల్లోనే రూ. 902 కోట్ల మేర మద్యాన్ని మందుబాబులు తాగేశారు. సంవత్సరమంతా కలిపితే రూ. 30 వేల కోట్ల విక్రయాలు నమోదైనట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి. మద్యపాన వ్యసనం పెరుగుతోందనడానికి ఈ అంకెలే సంకేతాలు. పేరుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవి 2,620 దుకాణాలే. కానీ 40-50 వేల బెల్ట్‌షాపుల్లో అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అంచనా. ఫలితంగా లక్షలాది కుటుంబాలు ఈ ఊబిలో చిక్కుకుని ఆర్థికంగా చితికిపోతున్నాయి. నూనూగు మీసాల ప్రాయంలోనే యువత మద్యానికి అలవాటుపడుతుండటం మరో ప్రమాదకర పరిణామమని, యుక్త వయసు వచ్చే నాటికి బానిసలుగా మారుతుండటంతో వారు ఎందుకూ కొరగాకుండా పోతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు.

‘‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిసి సగటున 36.2 శాతం మంది పురుషులు ప్రతిరోజూ తాగుతున్నారు. గ్రామీణ, నగరాల్లో సగటున 54 శాతం మంది వారంలో ఒకసారి మత్తులో మునిగిపోతున్నారు. ముఖ్యంగా 15-49 ఏళ్ల వయసులో ప్రతిరోజూ తాగే వారిలో పురుషులతోపాటు మహిళలూ పెద్ద సంఖ్యలో ఉన్నారు’’ అని కొద్దిరోజుల క్రితం వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదికలో బహిర్గతమైంది.


‘మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసకూ ప్రధాన కారణం మద్యపానమేనని, తమకొచ్చే గృహహింస కేసులలో కనీసం సగం అలాంటివేనని’ మహిళా భద్రతా విభాగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్ల వ్యవధిలో గృహహింస కేసులు 37 శాతం తగ్గినట్టు ఎన్‌సీఆర్బీ గణాంకాలే చెబుతున్నాయి. పలు సందర్భాల్లో ఇవి ప్రాణాలు తీసే వరకూ వెళ్తున్నాయని’’ అని ఓ పోలీసు అధికారి ‘ఈనాడు’తో చెప్పారు.


వ్యసనపరులు 6.33 లక్షల మంది

దేశవ్యాప్తంగా మత్తుపదార్థాల వినియోగంపై సామాజిక మంత్రిత్వశాఖ 2019లో నిర్వహించిన అధ్యయనంలో రాష్ట్రవ్యాప్తంగా 59,13,600 మంది మద్యం వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. వీరిలో 6,33,600 మంది బానిసలుగా మారినట్లు తేలింది. రెండేళ్ల క్రితం లెక్కలతో పోలిస్తే ఇప్పుడు ఈ సంఖ్య మరెంతో అధికంగా ఉంటుందనేది అంచనా. ‘‘ఇలాంటి వారు తమ సంపాదనలో ఎక్కువ భాగం మద్యానికే ఖర్చుచేస్తున్నారు. తాగేందుకు అవసరమైన డబ్బులు లేని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇవి అంతిమంగా గృహహింసకు, వరకట్న వేధింపుల తాలూకు హత్యలకు కూడా కారణమవుతున్నాయి.


యుక్త వయసులోనే వితంతువులుగా

రంగల్‌ గ్రామీణ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడు జనాభా సుమారు 1500. అధికారికంగా అక్కడ మద్యం దుకాణం లేదు. ఐదు బెల్ట్‌షాపుల్లో పగలూరాత్రి తేడా లేకుండా దొరుకుతుండటంతో ఎక్కువ మంది పురుషులు బానిసలయ్యారు. 30-40 ఏళ్ల ప్రాయంలోనే అనారోగ్యాలతో పాణాలు కోల్పోయారు. ఈ కారణంగా దాదాపు 15-20 మంది మహిళలు యుక్త వయసులోనే వితంతువులుగా మారారు. ‘‘పరిస్థితి చేయి దాటుతుండటంతో ఊరంతా ఏకమై 2019 అక్టోబరు 2న గాంధీజయంతి సందర్భంగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించామని’’ సర్పంచ్‌ రాజేందర్‌ తెలిపారు. ఒక్క గ్రామంలోనే ఇంతమంది పసుపుకుంకుమలు కోల్పోయారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. మద్యం సామాజికంగా ఎంత నష్టం చేస్తుందో చెప్పే ఉదాహరణ ఇది.


యువశక్తి నిస్సారం

ద్యం తాగే అలవాటు పదేళ్ల ప్రాయం నుంచే మొదలవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది సంపాదించే స్థాయికి చేరుకునే 20 ఏళ్ల ప్రాయంలోనే వ్యసనపరులవుతున్నట్టు తేల్చాయి. ‘మొదట స్నేహితుల బలవంతంతోనే, సరదాగానో మొదలుపెడుతున్నారు. తర్వాత అది వ్యసనంగా మారుతోంది. ఒక దశలో తగినంత సొమ్ముల్లేక ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడుతున్నవారూ లేకపోలేదు. ఫలితంగా యువశక్తి నిరుపయోగం అవుతోంది. నిరంతరం తాగుతూ అనారోగ్యాల బారినపడుతున్న కారణంగా వైద్యానికి అయ్యే ఖర్చు ఆయా కుటుంబాలకు అదనపు భారంగా మారుతోంది. ఎంతోమంది కాలేయ సమస్యల బారినపడుతున్నారు’’ అని మద్య ప్రభావంపై చైతన్యపరుస్తున్న ఓ సంస్థ ప్రతినిధులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని