Viral: కచోరి పొట్లం కోసం రైలు ఆపిన లోకో పైలట్‌.. మండిపడుతున్న నెటిజన్లు

కచోరి పొట్లం కోసం ఓ లోకో పైలట్‌ ప్రతిరోజు రైలును ఆపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.......

Published : 23 Feb 2022 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమయం ఉదయం 8గంటలు. పట్టాలపై రైలు దూసుకొస్తోంది. వాహనాల రాకపోకలను ఆపేందుకు దౌద్‌పూర్‌ క్రాసింగ్‌ వద్ద రైల్వే గేట్లు వేశారు. రోడ్డుకు ఇరువైపులా పదులు సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైలు వెళ్లిపోతే తాము కూడా వెళ్లిపోవచ్చని వాహనదారులంతా ఎదురుచూస్తున్నారు. కానీ ట్రైన్‌ ఒక్కసారిగా నెమ్మదించింది. సరిగ్గా క్రాసింగ్‌ వద్దకు వచ్చి ఆగింది. అప్పటికే అక్కడ ఓ పార్సిల్‌తో ఎదురుచూస్తున్న వ్యక్తి రైలింజన్‌ కంపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లగా.. కంపార్ట్‌మెంట్‌లోనుంచి వచ్చిన లోకో పైలట్‌ ఆ పొట్లాన్ని అందుకున్నాడు.

రాజస్థాన్‌ అల్వార్‌లోని దౌద్‌పూర్‌ క్రాసింగ్‌ వద్ద ప్రతిరోజు ఇదే తంతు. ఇంతకీ ఆ పార్సిల్‌లో ఏముంది అనుకుంటున్నారా..? లోకో పైలట్‌ కోసం కచోరి. అత్యవసరమైతే తప్ప ఆపకూడని రైలును కచోరి పార్సిల్‌ కోసం సదరు లోకో పైలట్‌ ప్రతిరోజు ఆపుతున్నాడు. క్రాసింగ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ రైల్వే గేట్‌మెన్‌.. సమీపంలోని ఓ దుకాణంలో ప్రతిరోజు కచోరి కొని తీసుకెళ్లడం, దాన్ని తీసుకునేందుకు లోకో పైలట్‌ రైలును ఆపడం సర్వసాధారణంగా మారింది.

కాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. బాధ్యతగల ఓ లోకో పైలట్‌ ఇలా వ్యవహరించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా దర్యాప్తు ప్రారంభించి, చర్యలు చేపట్టారు. ఇద్దరు లోకో పైలట్లు, ఇద్దరు గేట్‌మెన్‌లు, ఓ ఇన్‌స్ట్రక్టర్‌ను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని