Pat Toomey: ఆధునిక భారత చరిత్రలో 1984.. ఓ చీకటి ఏడాది!

సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన 1984 సంవత్సరం.. ఆధునిక భారత చరిత్రలోనే చీకటి ఏడాది అని అమెరికా చట్టసభ సభ్యుడు(US Senator) పేర్కొన్నారు. సిక్కు వర్గంపై చేపట్టిన...

Published : 03 Oct 2022 01:26 IST

వాషింగ్టన్‌: సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన 1984 సంవత్సరం.. ఆధునిక భారత చరిత్రలోనే చీకటి ఏడాది అని అమెరికా చట్టసభ సభ్యుడు(US Senator) పేర్కొన్నారు. సిక్కు వర్గం(Sikh community)పై జరిగిన దాడులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. తద్వారా ఆ ఘటనలకు కారకులైన వారిని జవాబుదారీగా ఉంచేందుకు వీలుంటుందన్నారు. ‘ఆధునిక భారత చరిత్రలో 1984 ఒక చీకటి ఏడాది. వివిధ వర్గాల మధ్య చోటుచేసుకున్న నాటి హింసాత్మక ఘటనలతోపాటు సిక్కులపై ఊచకోతను యావత్‌ ప్రపంచం గమనించింది. భవిష్యత్తులో మానవ హక్కుల ఉల్లంఘనలను నిర్మూలించేందుకుగానూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకుగానూ ఈ విషాదాన్ని మనం గుర్తుంచుకోవాలి’ అని అమెరికా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ ప్యాట్‌ టూమే(Pat Toomey) పేర్కొన్నారు.

అమెరికన్‌ సిఖ్‌ కాకస్‌ సభ్యుడిగా ఉన్న టూమే.. సిక్కు మతానికి 600 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల మంది సిక్కులు ఉండగా.. అందులో ఏడు లక్షల మంది అమెరికాలోనే ఉన్నారని చెప్పారు. మహమ్మారి సమయంలో అమెరికాలో సిక్కులు అందించిన సామాజిక సేవలనూ ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. 1984 అక్టోబర్‌ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఓ సిక్కు బాడీగార్డ్‌ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం రాజధాని దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఆ ఘటనల్లో దాదాపు మూడు వేల మంది సిక్కులు హత్యకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని