Asiana Airlines: త్వరగా విమానం దిగాలని.. గాల్లో ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడట..!

South Korean flight: గగనతలంలో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో మిగిలినవారు భయంతో వణికిపోయారు. ఆ ప్రవర్తనకు కారణం తెలిసి ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. 

Updated : 27 May 2023 13:45 IST

సియోల్‌: విమానంలో అత్యవసర ద్వారం(Emergency Door) తెరిచి ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ద్వారం తెరుచుకోవడంతో క్యాబిన్‌లోకి భారీగా గాలులు వీచి అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తక్షణ స్పందనతో ప్రాణాపాయం తప్పింది. దక్షిణ కొరియాలోని జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి బయలుదేరిన ఏసియానా ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ బస్‌ విమానం( Asiana Airlines flight)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 

విమాన ప్రయాణం సౌకర్యంగా లేదని, అందుకే వెంటనే విమానం(South Korean flight) నుంచి దిగిపోవాలని భావించి ఆ వ్యక్తి అత్యవసర ద్వారాన్ని తెరిచినట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ మీడియా సంస్థ వెల్లడించింది. ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు అతడు తెలిపాడని పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి వయసు 30 ఏళ్లు. గంట ప్రయాణం భరించలేక అతడు అలా ప్రవర్తించాడు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఆ ఘటన తర్వాత విమానంలోకి భారీగా గాలి చొరబడటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తీవ్ర గాలులతో కొందరికి శ్వాసకోశ సమస్యలు తలెత్తగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచినప్పుడు విమానం 700 అడుగులు(213 మీ) ఎత్తులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని