Joe Biden: అజయ్‌ బంగా ఆ పదవికి వన్నె తెస్తారు: జో బైడెన్‌

ప్రపంచ బ్యాంకు (World Bank) అధ్యక్ష పదవికి అజయ్‌ బంగా వన్నె తీసుకొస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తాను నామినేట్‌ చేసిన వ్యక్తికి అధ్యక్ష పదవి రావడం సంతోషంగా ఉందన్నారు.

Updated : 05 May 2023 00:11 IST

వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్‌ బంగా నియమితులు కావడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆ పదవికి వన్నె తీసుకొస్తారని అన్నారు. అజయ్‌ బంగా తనకున్న అనుభవం, నైపుణ్యంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మార్పులను తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచ బ్యాంక్‌ ఎక్సిక్యూటివ్‌ డైరెక్టర్లంతా కలిసి కొత్త అధ్యక్షుడిగా అజయ్‌ బంగాను బుధవారం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బైడెన్‌ స్పందిస్తూ.. ‘‘ ప్రస్తుతం ప్రపంచానికి అత్యంత అవసరమైన ఆర్థికాభివృద్ధి కోసం ప్రాథమిక మార్పులు తీసుకొచ్చేందుకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అజయ్‌ బంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది. ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా తాను నామినేట్‌ చేసిన వ్యక్తిని నియమించడం సంతోషంగా ఉంది’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

ప్రపంచబ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న అజయ్‌ బంగా తొలి భారతీయ అమెరికన్‌. ఈ ఏడాది జూన్‌ 2 నుంచి అయిదేళ్ల పాటు బంగా ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం, అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగా ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరిలో బంగాను ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అమెరికా నామినేట్‌ చేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బంగా ఇప్పటివరకు మాస్టర్‌ కార్డ్‌, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి దిగ్గజ సంస్థల్లో అత్యున్నత హోదాల్లో పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని