Omicron BA.4.6: వ్యాప్తిలోకి మరో కొత్త వేరియంట్‌..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకొని మనుగడ సాగిస్తోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ బీఏ.4.6 కొత్త రకం బ్రిటన్‌లో వ్యాప్తిలో ఉన్నట్లు తేలింది.

Published : 15 Sep 2022 02:09 IST

అమెరికా, బ్రిటన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కేసులు

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (Coronavirus) మహమ్మారి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకొని మనుగడ సాగిస్తోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ బీఏ.4.6 కొత్త రకం బ్రిటన్‌లో వ్యాప్తిలో ఉన్నట్లు తేలింది. యూకేలో ఆగస్టు నెలలో పరీక్షించిన కొవిడ్‌ నమూనాల్లో 3.3శాతం ఈ వేరియంట్‌వే ఉన్నాయని బ్రిటన్‌ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ (UKHSA) వెల్లడించింది.

అటు అమెరికాలోనూ బీఏ.4.6 వేరియంట్‌ విస్తృత వ్యాప్తిలో ఉన్నట్లు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది. అక్కడ సీక్వెన్సింగ్‌ చేపట్టిన కేసుల్లో 9శాతానికి పైగా ఈ కొత్త వేరియంట్‌వే ఉన్నట్లు తెలిపింది. కేవలం అమెరికా, బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వేరియంట్‌ ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు సీడీసీ పేర్కొంది.

ఈ వేరియంట్‌ ప్రమాదకరమా..?

ఒమిక్రాన్‌ బీఏ.4 కు చెందిన ఉపరకమే బీఏ.4.6. ఈ ఏడాది జనవరిలో బీఏ.4ను దక్షిణాఫ్రికాలో మొదటగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ వేరియంట్‌తోపాటు బీఏ.5 కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాప్తిలో ఉన్నాయి.

బీఏ.4.6 వేరియంట్‌ కచ్చితంగా ఎలా ఉద్భవించిందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, కొన్ని వేరియంట్ల కలయిక (రీకాంబినెంట్‌) వల్ల ఈ వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు.

ఒకేవ్యక్తికి, ఒకేసారి రెండు కరోనా వైరస్‌ రకాలు సోకినట్లయితే దాన్ని రీకాంబినెంట్‌గా పరిగణిస్తున్నారు.

R346T మ్యుటేషన్‌కి చెందిన ఈ రకం కరోనా వైరస్‌లు చాలా దేశాల్లో ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నాయి.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ మాదిరిగానే బీఏ.4.6 వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరణాలు కూడా స్పల్పంగానే ఉన్నాయని చెబుతున్నారు.

అయితే, ప్రస్తుతం అధిక ప్రాబల్యం కలిగిన బీఏ.5.. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే గుణం ఉన్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. తాజాగా బయటపడిన బీఏ.4.6కు తప్పించుకునే సామర్థ్యం మరింత ఎక్కువ ఉందని ప్రాథమిక అధ్యయనాల్లో తేలినట్లు తెలుస్తోంది.

కొత్త వేరియంట్లను చూస్తుంటే కరోనా వైరస్‌ ఇంకా మనమధ్యే ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ వల్ల పూర్తి రక్షణ ఉంటుందని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని