Sergei Lavrov: ఏ వస్తువులను దొంగలించారు. ఎవరికి అమ్మివేశారు..?

టర్కీ రాజధాని అంకారాలో పర్యటించిన సందర్భంగా రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్ పాత్రికేయుడి నుంచి అజెండాలోలోని ప్రశ్నను ఎదుర్కొవాల్సి వచ్చింది.

Updated : 09 Jun 2022 17:44 IST

ఏం అడిగాడంటే..?

అంకారా: టర్కీ రాజధాని అంకారాలో పర్యటించిన సందర్భంగా రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్ పాత్రికేయుడి నుంచి అజెండాలో లేని ప్రశ్నను ఎదుర్కొవాల్సి వచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం ఎగుమతి జరగకపోతే.. ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రం కానుందని నివేదికలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పలు ఆఫ్రికా దేశాలు పుతిన్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల నిమిత్తం తగిన కారిడార్లు ఏర్పాటుపై చర్చించేందుకు లావ్రోవ్‌ టర్కీ వెళ్లారు. 

ఈ సమయంలో ఉక్రెయిన్ పాత్రికేయుడు ఒక్క ఉదుటున లేచి, నేరుగా లావ్రోవ్‌ను ప్రశ్నించారు. ‘నేను ఉక్రెయిన్‌ పబ్లిక్‌ టీవీలో పనిచేస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ధాన్యంతో పాటుగా ఉక్రెయిన్‌ నుంచి మీరు ఇంకా ఏ వస్తువులను దొంగలించారు. ఎవరికి అమ్మివేశారు..?’ అని ప్రశ్నించారు. ఈ పరిణామంతో సెర్గీ లావ్రోవ్ కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘మీ ఉక్రేనియన్లు దొంగలించడం గురించి ఆందోళన చెందుతున్నారు. మా లక్ష్యం స్పష్టంగా ఉంది. నియోనాజీల పాలన వల్ల కలిగే ఒత్తిడి నుంచి ప్రజలు రక్షించాలనుకుంటున్నాం. మేం ధాన్యాలను అడ్డుకోవడం లేదు. ధాన్యం మీ పోర్టులను వీడి వెళ్లాలంటే మీ (అధ్యక్షుడు) జెలెన్‌స్కీ ఆదేశాలు ఇవ్వాలి’ అని లావ్రోవ్ స్పష్టం చేశారు. 

దీనికి ముందు అంకారాలోని ఉక్రెయిన్‌ దౌత్యవేత్త మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ధాన్యాన్ని దొంగలించి, ఎగుమతి చేస్తోందంటూ రష్యాపై ఆరోపణలు చేశారు. ప్రత్యేకించి టర్కీకి వాటిని ఎగుమతి చేస్తుందని తెలిపారు. 

దహించివేయనున్న ఆకలి మంటలు..

నల్లసముద్రంలోని పోర్టులను రష్యా ముట్టడించడంతో ధాన్యం ఎగుమతి జరగడం లేదని జెలెన్‌స్కీ మండిపడ్డారు. గోధుమలు, మొక్కజొన్న, నూనెలు, ఇతర పదార్థాలను ఎగుమతి చేయలేకపోవడంతో ప్రపంచం భయంకరమైన ఆహార సంక్షోభం అంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ఉత్పత్తుల కొరత ఏర్పడవచ్చు. నల్ల సముద్రంలో ఈ ముట్టడి ఇలాగే కొనసాగితే.. మిలియన్ల కొద్ది ప్రజలు ఆకలితో అలమటించనున్నారు’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని