Biden: పగ, ప్రతీకారాన్ని తిరస్కరించండి.. ట్రంప్‌పై విరుచుకుపడ్డ బైడెన్‌

Biden: కాంగ్రెస్ స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగంలో అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధ్యక్ష రేసులో నిలవనున్న ఆయన ఈ వేదికను ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపర్చుకునేందుకు ఉపయోగించుకున్నారు. ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated : 08 Mar 2024 11:45 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందున్న డొనాల్డ్‌ ట్రంప్‌ దేశానికి చాలా ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. పగ, ప్రతీకారంతో బరిలోకి దిగుతున్న ఆయన్ను రాబోయే ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి ఏటా చేసే ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌’ ప్రసంగంలో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు తమ ప్రభుత్వ విధానాలు, ప్రాథమ్యాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతారు. కానీ, రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న బైడెన్‌ తాజాగా ఈ వేదికను తన అభ్యర్థిత్వాన్ని బలపర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నారు.

‘‘జీవితం నాకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని స్వీకరించడం నేర్పింది. నిజాయతీ, మర్యాద, గౌరవం, సమానత్వం.. అమెరికాను నిర్వచించిన ఈ విలువలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందరినీ గౌరవించాలి. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ద్వేషానికి ఎక్కడా తావివ్వొద్దు. కానీ, ఇప్పుడు కొంత మంది పగ, ప్రతీకారంతో కూడిన అమెరికాను చూస్తున్నారు’’ అంటూ పరోక్షంగా ట్రంప్‌ (Donald Trump)పై బైడెన్‌ విరుచుకుపడ్డారు. తయారీ, మౌలిక వసతుల రంగంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు సహకరించాలని కాంగ్రెస్‌ను కోరారు. ఔషధ ధరలను తగ్గించటం, కఠిన వలస విధానాల రూపకల్పనపై కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా విజృంభిస్తుండడం, ఆర్థిక వృద్ధి క్షీణిస్తున్న సమయంలో 2021లో తాను అధికారంలోకి వచ్చానని బైడెన్‌ గుర్తు చేశారు. తన హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా భవిష్యత్తు మెరుగ్గా ఉండనుందని తెలిపారు. కానీ, ట్రంప్‌ అధికారంలోకి వస్తే మాత్రం అది పూర్తిగా దెబ్బతింటుందన్నారు. మరోవైపు కార్పొరేట్‌ పన్ను పెంపుపైనా బైడెన్‌ తన ప్రణాళికలను వివరించారు. అబార్షన్‌ హక్కులకు మద్దతు పలకడం గమనార్హం.

గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధానికి మద్దతునివ్వటంపై సొంత పార్టీ నుంచే బైడెన్‌ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజా ప్రసంగంలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేస్తున్నామని ప్రకటించారు. గాజాకు మానవతా సాయం అందించడం కోసం ప్రత్యేకంగా ఓ నౌకాశ్రయాన్నే ఏర్పాటు చేశామని చెప్పారు. మరింత సాయాన్ని అందించేందుకుగానూ కాంగ్రెస్‌ మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాలకు రిపబ్లికన్లు అడ్డు నిలుస్తున్నారని ఆరోపించారు.

బైడెన్‌ వయసుపైనా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయోభారం నేపథ్యంలో మరోసారి అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడంటూ విమర్శలు వస్తున్నాయి. తాజా స్పీచ్‌లో వాటికీ బైడెన్‌ సమాధానం ఇచ్చారు. వయసు ముఖ్యం కాదని.. విధానాలపైనే దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. మరోవైపు గాజాలో కాల్పుల విరమణను కోరుతూ అనేక మంది రోడ్లపై నిరసనలు చేపట్టారు. దీంతో బైడెన్‌ కాన్వాయ్‌ మరో మార్గంలో క్యాపిటల్‌ హిల్‌కు చేరుకోవాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు