Joe Biden: మా దేశ విలేకరిని వెంటనే విడుదల చేయండి: రష్యాను కోరిన బైడెన్‌

రష్యా (Russia) అరెస్టు చేసిన అమెరికా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (Wall Street Journal) విలేకరి ఇవాన్‌ గెర్ష్‌కోవిచ్‌ను వెంటనే విడుదల చేయాలని అగ్రదేశాధినేత జోబైడెన్‌ కోరారు.

Published : 01 Apr 2023 00:08 IST

వాషింగ్టన్: రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాడన్న కారణంతో అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ (Wall Street Journal) విలేకరి ఇవాన్‌ గెర్ష్‌కోవిచ్‌ (Evan Gershkovich)ను రష్యా (Russia) అరెస్టు చేయడంపై అగ్రదేశాధినేత జో బైడెన్‌ (Joe Biden) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని విడుదల చేయాలని కోరారు. రష్యాలో విధులు నిర్వర్తిస్తున్న గెర్ష్‌కోవిచ్‌ను అక్కడి ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) అధికారులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తుపాను కారణంగా మిసిసిపీలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు శ్వేతసౌధం నుంచి వెళ్తున్న బైడెన్‌ను ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా.. గెర్ష్‌కోవిచ్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. 

గెర్ష్‌కోవిచ్‌ను నిర్భందించిన నేపథ్యంలో అమెరికాలోని రష్యా దౌత్య వేత్తలను బహిష్కరిస్తారా? అని విలేకరులు అడగ్గా.. ప్రస్తుతం అలాంటి ప్రణాళిక లేమీ లేవని బైడెన్‌ బదులిచ్చారు. మరోవైపు రష్యా చర్యలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరైన్‌ జీన్‌ పియర్రీ తీవ్రంగా ఖండించారు. రష్యా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రహస్య పత్రాలను సేకరించేందుకు గ్రెస్‌కోవిక్‌ ప్రయత్నించాడన్న దానికి ఎలాంటి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. తప్పుడు ఆరోపణలతో, కావాలనే తమ సంస్థకు చెందిన విలేకరిని అరెస్టు చేశారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత ఓ విదేశీ జర్నలిస్టుపై బహిరంగ చర్యలకు దిగడం ఇదే తొలిసారి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని